Begin typing your search above and press return to search.

ఖమ్మంలో ఘోరం... ఆ దంపతుల ఆశలు అర్ధంతరంగా ఆవిరి!

సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం శివారులోని పెట్రోలుబంకు వద్ద.. ఆగి ఉన్న కంటెయినర్‌ లారీని కారు ఢీకొట్టడంతో భార్యాభర్తలు మృతిచెందారు.

By:  Tupaki Desk   |   23 April 2024 5:28 AM GMT
ఖమ్మంలో ఘోరం... ఆ దంపతుల ఆశలు అర్ధంతరంగా  ఆవిరి!
X

రోజు రోజుకీ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు ఎన్నో జీవితాలను అర్ధాంతరంగా చిదిమేస్తున్నాయి. వారిని నమ్ముకున్న కుటుంబాలను రోడ్డున పాడేస్తున్నాయి. ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాలను నింపుతున్నాయి. అందొస్తాడనుకున్న కొడుకు అర్ధాంతరంగా కాటికెళ్లిన విషయాలు.. నూతన జీవితంలోకి అడుగుపెట్టిన నవ దంపతుల జీవితాలను గాల్లో కలిపేస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

అవును... రెండేళ్ల కిందటే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టి, భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ.. సంతోషంగా జీవిస్తున్న ఓ దంపతుల ఆశలు అర్ధంతరంగా ఆవిరైపోయాయి. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం శివారులోని పెట్రోలుబంకు వద్ద.. ఆగి ఉన్న కంటెయినర్‌ లారీని కారు ఢీకొట్టడంతో భార్యాభర్తలు మృతిచెందారు. ఇలా రోడ్డు ప్రమాదం వారిద్దరినీ బలిగొనడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

వివరాళ్లోకి వెళ్తే... ఖమ్మం జిల్లా వైరా మండలానికి చెందిన సామినేని నవీన్‌ రాజా (29), ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా విస్సన్నపేటకు చెందిన భార్గవి (27)లకు రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది. ఈ సమయంలో నవీన్‌ రాజా విజయవాడ గూడవల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఫిజిక్స్‌ లెక్చరర్ గా పనిచేస్తుండగా.. భార్గవి సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగినిగా ఉన్నారు.

ఈ క్రమంలో... శనివారం భార్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి నవీన్‌ రాజా ఆమెతో కలిసి హైదరాబాద్‌ లో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు. శని, ఆదివారాలు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. అనంతరం సోమవారం ఉదయం 6 గంటలకు కారులో విజయవాడకు బయలుదేరారు. ఈ సమయంలో... మునగాల మండలంలోని ముకుందాపురం గ్రామ శివారులో పెట్రోలు బంకు వద్ద ఆగి ఉన్న కంటెయినర్‌ లారీని.. వీరి కారు వెనుక నుంచి వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారు టాప్‌ ఎగిరి పక్కనే ఉన్న బంకులో పడిందంటే ఆ ప్రమాద తీవ్రతను అంచనా వేయొచ్చని అంటున్నారు! ఈ ప్రమాదంలో ఆ దంపతులు అక్కడికక్కడే మరణించారు. విధయం తెలుసుకున్న పోలీసులు.. స్థానికుల సహాయంతో జేసీబీ, క్రేన్‌ తో సుమారు రెండు గంటల పాటు శ్రమించి మృతదేహాలను బయటకు తీయించారు.