Begin typing your search above and press return to search.

షైన్ ఇండియా వర్సెస్ 370...ఫెయిల్ అవుతుందా ?

బీజేపీ ఎమోషనల్ గా ఇచ్చే స్లోగన్స్ కి జనాలు ఎపుడూ ఓకే చెబుతూ వచ్చారు. వాటి ఆకర్షణలో పడి బీజేపీని అధికారంలోకి పలు మార్లు తెచ్చారు కూడా.

By:  Tupaki Desk   |   23 April 2024 12:20 PM GMT
షైన్ ఇండియా వర్సెస్ 370...ఫెయిల్ అవుతుందా ?
X

బీజేపీ ఎన్నికల నినాదాలు ఒక్కోసారి బూమరాంగ్ అవుతూ ఉంటాయి. దానికి కారణం వాటిలో భావోద్వేగం లేనపుడు జనాలకు రీచ్ కానపుడు పొలిటికల్ యాటిట్యూడ్ ఎక్కువగా ఉన్నపుడు అవి కాస్తా రివర్స్ అవుతూంటాయి. బీజేపీ ఎమోషనల్ గా ఇచ్చే స్లోగన్స్ కి జనాలు ఎపుడూ ఓకే చెబుతూ వచ్చారు. వాటి ఆకర్షణలో పడి బీజేపీని అధికారంలోకి పలు మార్లు తెచ్చారు కూడా.

అయితే అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం బీజేపీ అతి ధీమాకు పోయి జనం కళ్ళలోకి చూడకుండా తమ మెదడుతో తనదైన కోణంలో దేశాన్ని చూస్తూ అతి విశ్వాసంతో ఇచ్చే నినాదాలు మాత్రం ఎపుడూ ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. జనాలు కూడా వాటిని తిప్పు కొడుతూ వస్తున్నారు. ఈ చేదు అనుభవాలు బీజేపీ హిస్టరీలో ఉన్నాయి.

సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం అంటే 2004కి వెళ్తే అప్పుడు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని నడుపుతున్న వాజ్ పేయ్ ఆరేడు నెలల ముందుగా లోక్ సభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలు వెళ్లారు. ఆ ఎన్నికల్లో బీజేపీ నినాదం షైనింగ్ ఇండియా. అంటే భారత్ వెలిగిపోతోంది అని. బీజేపీ ఏలుబడిలో దేశం అన్ని విధాలుగా దూసుకుని పోతోందని ఇక తిరుగులేదని భావించి మరీ ఎన్నికల ముగ్గులోకి దిగిన బీజేపీని జనాలు ఓడించి విపక్షం పాత్రలోకి విజయవంతంగా పంపించారు.

ఆ తరువాత మళ్లీ బీజేపీ అలాంటి నినాదాన్ని ఇచ్చే సాహసం చేయలేకపోయింది. కానీ 2024 ఎన్నికల్లో మరోమారు బీజేపీ పెద్దలు మోడీ అమిత్ షా నాయకత్వంలో అతి విశ్వాసం ప్రకటిస్తూ అదే రకమైన నినాదం ఇచ్చారు. అదేంటి అంటే బీజేపీకి సొంతంగా 370 సీట్లు అని. నిజంగా చూస్తే బీజేపీ దేశంలో ముఖ్య భాగమైన దక్షిణాదిన ఎక్కడా లేదు. అలాగే ఈశాన్య భారతాన కొన్ని పశ్చిమ తూర్పు ప్రాంతాలలో బీజేపీ ఎదుగుదల పెద్దగా ఏమీ లేదు ఉత్తర మధ్య భారతంలో తమకు ఉన్న రాజకీయ ప్రాపకాన్ని చూసుకుని మాత్రమే బీజేపీ ఈ విధంగా అతి విశ్వాసానికి పోతోంది అని అంటున్నారు.

అందుకే బీజేపీ ఈ రకమైన నినాదాలు ఇస్తోంది అని అంటున్నారు. నిజానికి ఒకసారి పాలించిన ప్రభుత్వాలకే యాంటీ ఇంకెంబెన్సీ వస్తుంది. అయితే 2019లో పుల్వామా దాడులు వంటి ఎమోషనల్ టచ్ ఇచ్చే అంశం తోడుగా ఉంది బీజేపీ నెగ్గేసింది. ఇపుడు పదేళ్ళుగా బీజేపీ అధికారంలో ఉంది. దాంతో యాంటీ ఇంకెంబెన్సీ ఇంకా పెరుగుతుంది అన్న లెక్క ఉంది.

కానీ బీజేపీ మాత్రం ప్రతీ ఎన్నికకూ తమ ఓట్లూ సీట్లూ పెరుగుతాయని భావిస్తూ అదే నినాదంగా చేసుకుంటూ జనం లోకి వెళ్తోంది. నిజానికి చూస్తే ఇలాంటి నినాదాలను జనాలు అహంకారపూరిత మైనవిగా భావిస్తారు. విశ్వాసానికి కి అతికి మధ్య తేడాను జనాలు ఇట్టే గమనిస్తారు. బీజేపీ ఏలుబడిలో సక్సెస్ అని ఆ పార్టీ చెప్పుకోవచ్చు కానీ ఫెయిల్యూర్స్ చెప్పమంటే సగటు జనాలు చెబుతారు.

బీజేపీ ఏలుబడిలో దేశం ఎలా ఉంది అన్నది సగటు ఓటరు నిర్ణయించి తీర్పు ఇస్తాడు. ఆ ఓటరు ఇచ్చే తీర్పుతో సీట్లు దక్కుతాయి. కానీ బీజేపీ మాత్రం 370 సీట్లు తమకు దక్కడం లాంచనం అన్నట్లుగా దూకుడు చేస్తోంది. ఈ రాజకీయ తమాషాను చూసి జనాలు రివర్స్ అయితే 2004 ఫలితాలు వచ్చినా వస్తాయని అంటున్నారు.

బీజేపీ పాలనలో ఎన్నో సమస్యలు అలాగే ఉన్నాయి. అదే విధంగా బీజేపీ ఆలోచనా విధానాలు ఆ పార్టీ పొలిటికల్ ఫిలాసఫీతో విభేదించే సెక్షన్లు కూడా దేశంలో చాలానే ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీ అందరికీ ఆమోదయోగ్యమైన విధానాలను చేయలేదని ఒప్పుకోవచ్చు. కానీ బీజేపీ చూస్తే తనదైన సిద్ధాంతాలతో దేశంలోని చాలా పార్టీలకు అయిష్టంగా మారింది అన్నది ప్రచారంగా ఉంది.

బీజేపీ రాజకీయ విధానాలను పూర్తిగా విభేదించేవారు కూడా ఉన్నారు. ఈ దేశంలో 144 కోట్లమంది ఉంటే భిన్న జాతులు భిన్న మతాలు భిన్నమైన కల్చర్ వంటివి ఎన్నో ఉన్నాయి. పూదండలోని దారంగా భారతం ఉంది. దాన్ని అలాగే ఉంచుతూ ముందుకు సాగాల్సి ఉంది. అయితే బీజేపీ తనదైన అజెండాతో ముందుకు సాగుతోంది.

దీంతోనే ఇబ్బందులు వస్తున్నాయి. మెజారిటీ మైనారిటీ అన్న విభజనతో రాజకీయాలు చేయడం వల్ల ఒకటి రెండు సార్లు సక్సెస్ అయితే కావచ్చు. కానీ ఏకంగా దానినే ఆయుధంగా చేసుకుని దేశంలో రికార్డు స్థాయి మెజారిటీలు సాధిస్తామని సీట్లు అందుకుంటామని అనుకోవడం అంటే అది భ్రమ గానే చూడాలని అంటున్నారు. బీజేపీ 370 స్లోగన్ లో గన్ పవర్ తక్కువ అంటున్నారు. అది పేలని తూటాగా మిగిలిపోతుందని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.