Begin typing your search above and press return to search.

సైకిల్ వర్సెస్ ఫ్యాన్... గుంటూరు వెస్ట్ లో ఎవరి స్పీడ్ ఎలా ఉంది?

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ అయిపోయింది. మరోపక్క నామినేషన్ల పర్వం హడావిడిగా సాగుతోంది

By:  Tupaki Desk   |   23 April 2024 12:30 PM GMT
సైకిల్ వర్సెస్ ఫ్యాన్... గుంటూరు వెస్ట్ లో ఎవరి స్పీడ్ ఎలా ఉంది?
X

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ అయిపోయింది. మరోపక్క నామినేషన్ల పర్వం హడావిడిగా సాగుతోంది. ఈ సమయంలో గతంలో గెలిచిన ఏ నియోజకవర్గాన్నీ చేజార్చుకోకుండా.. అదనంగా మరికొన్ని నియోజకవర్గాలను గెలుచుకోవాలని అధికార పార్టీ భావిస్తుండగా.. గతంలో 2014 ఎన్నికల తరహాలో ఉమ్మడిగా విజయం సాధించాలని కూటమి భావిస్తుందని అంటున్నారు!

ఈ సమయంలో ఏపీలోని పలు నియోజకవర్గాల్లో.. ప్రధానంగా మంత్రులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో పోరు రసవత్తరంగా మారుతుందని అంటున్నారు. వీటిలో కొన్ని నియోజకవర్గాల్లో పోరు నువ్వా నేనా అన్నట్లుగా ఉంటే.. మరికొన్ని నియోజకవర్గాల్లో వార్ వన్ సైడ్ అన్నట్లుగానే పరిస్థితి ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం!

గత ఎన్నికల్లో చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై 8వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు విడదల రజని. అయితే... ఇటీవల పలు కారణాలు, కొత్త కొత్త సమీకరణలు, సరికొత్త వ్యూహాల్లో భాగంగా వైఎస్ జగన్ తీసుకున్న నియోజకవర్గాల మార్పులు, చేర్పుల్లో భాగంగా ఆమె గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు.

ఈ గుంటూరు వెస్ట్ లో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి 4 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు! ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన మద్దాల గిరి అనంతరం వైసీపీకి అనుకూలంగా మారారు! ఆ సంగతి అటుంచితే ఈ సారి అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండు పార్టీలూ తమ తమ అభ్యర్థులను మార్చాయి. ఇందులో భాగంగా... వైసీపీ నుంచి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజనీ పోటీ చేస్తుండగా.. కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా గల్లా మాదవి పోటీ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మాధవి జోరుగానే ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రజక కులానికి చెందిన ఆమె భర్త.. కమ్మ సామాజికవర్గానికి చెందినవారు కావడంతో అటు బీసీ, ఇటు కమ్మ సామాజికవర్గ ఓట్లు దక్కుతాయనే చంద్రబాబు ప్లాన్ లో భాగంగా ఆమెకు టిక్కెట్ దక్కిందని అంటున్నారు. వైసీపీ నుంచి బీసీ సామాజికవర్గానికి చెందిన రజనీ ని జగన్ బరిలోకి దించారు.

ఈ నేపథ్యంలో... రజనీ ఇంటింటి ప్రచారానికి తెరలేపారు. ప్రచారాన్ని హోరెత్తించేస్తున్నారు. ఈ సందర్భంగా ఇంటింటి ప్రచారంలో ఆమెకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పడుతున్నారు! ఇదే సమయంలో... నియోజకవర్గంలో ఆమె నిర్వహిస్తోన్న రోడ్‌ షోల్లో భారీ ఎత్తున ప్రజలు, అభిమానులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా... తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తాను చేసే అభివృద్ధి పనులపై విడదల రజిని ప్రజలకు సవివరంగా వివరిస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధితో పాటు.. నియోజకవర్గం సైతం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామని చెబుతూ, చిలకలూరిపేటలో చేసిన అభివృద్ధిని ప్రస్థావిస్తున్నారు! ఈ సమయంలో... ఆరోగ్య శ్రీతో పాటు గ్రామాల్లోకి ప్రభుత్వ వైద్య సేవలు అద్భుతంగా అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం రజనీకి బాగా కలిసివస్తుందని అంటున్నారు గుంటూరు వెస్ట్ ప్రజానికం!

ఇదే సమయంలో... సంక్షేమ పథకాలతో, పాటు కరోనా సమయంలో ప్రభుత్వంతో పాటు విడదల రజనీ చేసిన సేవలు ప్రజలు మరిచిపోయే అవకాశం ఉండకపోవచ్చనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా వెలుగులోకి వచ్చిన సర్వేల ప్రకారం... ఈ ఏడాది మొదట్లో గుంటూరు వెస్ట్ లో నిర్వహించిన సర్వేలో “వైసీపీ - టీడీపీ ల మధ్య హోరా హోరీ పోరు ఉండగా... అభ్యర్థుల ప్రకటన అనంతరం ఈ నెల రెండో వారంలో నిర్వహించిన సర్వే ఫలితాల్లో విడదల రజనీకి ఎడ్జ్ స్పష్టం”గా ఉందని అంటున్నారు!

ఇందులో భాగంగా... గుంటూరు వెస్ట్ లో వైసీపీకి 49% శాతం అనుకూలంగా ఉండగా.. టీడీపీకి 43%, ఇతరులు 8% ఉన్నట్లు చెబుతున్నారు! దీంతో... గత ఎన్నికల్లో చేజారిన గుంటూరు వెస్ట్ ని ఈసారి అధికార పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... స్థానిక సమీకరణలు, సర్వే ఫలితాలతో పాటు సెంటిమెంట్ కూడా రజినీకి కలిసొస్తుందని అంటున్నారు. ఇందులో భాగంగా... గుంటూరు వెస్ట్ లో ఇంతవరకు ఏ పార్టీకి హ్యాట్రిక్ విజయాలు రాలేదు. ఇదే సమయంలో... మరో నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచి మంత్రులై తిరిగి గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసిన వారు గెలిచారు. ఇలా సెంటిమెంట్ పరంగా చూసినా కూడా ఈసారి విడదల రజినీకి విజయం కన్ ఫాం అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి!