Begin typing your search above and press return to search.

బీజేపీకి మెజారిటీ రాదా...జగన్ అంచనా ఏంటి...!?

కేంద్రంలో మూడవసారి పూర్తి మెజారిటీతోనే కాదు ఏకంగా 400 ఎంపీ సీట్లు టార్గెట్ గా పెట్టుకుని బీజేపీ పనిచేస్తోంది.

By:  Tupaki Desk   |   23 April 2024 9:57 AM GMT
బీజేపీకి మెజారిటీ రాదా...జగన్ అంచనా ఏంటి...!?
X

కేంద్రంలో మూడవసారి పూర్తి మెజారిటీతోనే కాదు ఏకంగా 400 ఎంపీ సీట్లు టార్గెట్ గా పెట్టుకుని బీజేపీ పనిచేస్తోంది. మిషన్ 400 అంటూ చాలా కాలం నుంచే జనం లోకి వెళ్తోంది. బీజేపీకి సొంతంగా 370 సీట్లు ఎన్డీయే కూటమికి 400 సీట్లూ అంటూ భారీ లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది.

అయితే రాజకీయ విశ్లేషకుల నుంచి మేధావుల నుంచి వినిపిస్తున్న మాట ఏంటి అంటే బీజేపీకి అన్ని సీట్లు రావు అనే. నిజానికి 2019లో బీజేపీకి సొంతంగా వచ్చిన 304 ఎంపీ సీట్లు వచ్చినా టార్గెట్ రీచ్ అయినట్లే అని అంటున్నారు. ఎందుకంటే వరసగా రెండుసార్లు అధికారంలోకి బీజేపీ వచ్చింది. పదేళ్ళ పాలనలో సహజంగానే బీజేపీ మీద వ్యతిరేకత ఉంటుంది. అలాంటిది మూడవసారి కూడా మెజారిటీ సీట్లు దక్కితే అది రికార్డు అవుతుంది. కానీ అలా కాకుండా బీజేపీ మరో వంద సీట్లు ఎక్కువ కోరడం అంటే అతిగానే ఉంది అని అంటున్నారు.

ఈ నేపధ్యంలో బీజేపీకి బొటా బొటీ మెజారిటీ వస్తుందని కొందరు విశ్లేషకులు అంటూంటే మెజారిటీకి దూరంగా ఆగిపోతుందని మరికొందరు అంటున్నారు. ఇక ఇండియా కూటమి అయితే బీజేపీ కానీ ఎన్డీయే కానీ 200 ఎంపీ సీట్ల నంబర్ వద్ద ఆగిపోవడం ఖాయమని జోస్యం చెబుతున్నారు.

ఇదిలా ఉంటే బీజేపీకి మాత్రం తాము 400 సీట్లు కాకపోయినా 350 దాకా సీట్లు సాధిస్తామని నమ్మకం ఉంది అంటున్నారు. మరి బీజేపీతో మంచి రిలేషన్స్ తెర వెనక వైసీపీ మెయిన్ టెయిన్ చేస్తుంది అని ప్రచారంలో ఉన్న నేపధ్యంలో ఆ పార్టీ అంచనాలు ఏమిటి అన్న చర్చ సాగుతోంది.

అయితే వైసీపీ ఈ విషయంలో మాత్రం బీజేపీకి మెజారిటీ రాదు అనే అంచనాలలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విశాఖలో విడిది చేసిన జగన్ ని ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు కలసినపుడు జగన్ ఇదే విషయం వారితో పంచుకున్నట్లుగా చెబుతున్నారు.

ఈసారి కేంద్రంలో బీజేపీకి మెజారిటీ రాకపోతే కచ్చీంతా ఏపీ ప్రయోజనాలను కాపాడుకుందామని ఆయన అన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఏపీకి సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు వంటి వాటి విషయంలో బీజేపీకి గట్టిగా చెప్పి ఆపించే చాన్స్ అపుడు వస్తుందని జగన్ అన్నట్లుగా చెబుతున్నారు

దీనిని బట్టి చూస్తే కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ రాదు అని జగన్ భావిస్తున్నారా అన్న చర్చకు తెర లేచింది. నిజానికి 2019లో కూడా కేంద్రంలో బీజేపీకి మెజారిటీ రాదు ఏపీలో పార్టీల అవసరం పడుతుంది అపుడు ప్రత్యేక హోదాను సాధించుకుందామని జగన్ చెబుతూ వచ్చారు. కానీ బీజేపీకి సొంతంగా 304 సీట్లు వచ్చాయి.

మరి ఈసారి బీజేపీ మరింత పెద్ద ఆశలతో ఉంది. అయితే జగన్ మాత్రం అలా కాదు బీజేపీకి మెజారిటీ రాకపోవచ్చు అన్న ఆలోచనలో ఉన్నట్లుగా ఆయన మాటల బట్టి అర్ధం అవుతోంది. మరి బీజేపీకి మెజారిటీ రాకపోతే ఏపీలో వైసీపీ లాంటి పార్టీలే దిక్కు అవుతాయని ఆయన భావిస్తున్నారు

ఇప్పటికే ఎన్డీయేలో టీడీపీ జనసేన ఉన్నాయి. మెజారిటీ బీజేపీకి రాకపోతే కచ్చితంగా వైసీపీకే జాతీయ స్థాయిలో బీజేపీ వద్ద విలువ ఉంటుంది. దాంతో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని నమ్మకంతోనే జగన్ ఈ విధంగా అంటున్నారు అని తెలుస్తోంది.ఏది ఏమైనా బీజేపీకి మెజారిటీ రాదు అన్న అంచనాల్లో జగన్ ఉండడం మాత్రం రాజకీయ వర్గాలలో చర్చగానే ఉంది అంటున్నారు.