Begin typing your search above and press return to search.

విభజన వల్ల ఏపీకే మేలు : జగ్గారెడ్డి హాట్ కామెంట్స్....!

అయితే కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మాత్రం ఏపీకి విభజన వల్ల మేలే జరిగిందని అంటూ హాట్ కామెంట్స్ చేయడం విశేషం.

By:  Tupaki Desk   |   23 April 2024 7:30 AM GMT
విభజన వల్ల ఏపీకే మేలు : జగ్గారెడ్డి  హాట్ కామెంట్స్....!
X

ఉమ్మడి ఏపీ రెండుగా చీలింది. బంగారం లాంటి హైదరాబాద్ రాజధాని తెలంగాణాకు వెళ్ళింది. ఏపీకి పదేళ్ళు అయినా రాజధాని లేని రాష్ట్రంగానే పరిస్థితి ఉంది. పూర్తిగా వ్యవసాయిక రాష్ట్రంగా ఉన్న ఏపీ ఎపుడు అభివృద్ధి చెందుతుంది, ముందుకు వెళ్తుంది అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి.

అయితే కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మాత్రం ఏపీకి విభజన వల్ల మేలే జరిగిందని అంటూ హాట్ కామెంట్స్ చేయడం విశేషం. ఒక చానల్ కి ఆయన ఇచ్చిన ఇంటర్వూలో విభజన వల్లనే కదా ఏపీ సీఎం అక్కడే ఉండి పాలిస్తున్నారు అని లాజిక్ తో కూడిన ప్రశ్నను సంధించారు. వారి సీఎం వారితోనే ఉంటున్నారు. వారి జనాలకు కనిపిస్తున్నారు. ఇదంతా ఎలా జరిగింది అంటే సోనియా గాంధీ ఏపీని రెండుగా చేసి విభజన చేయడం వల్లనే కదా అని ఆయన అంటున్నారు. విభజన వల్ల కొంత ఇబ్బంది పడి ఉండవచ్చు కానీ లాభాలు ఉన్నాయని జగ్గారెడ్డి చెబుతున్నారు.

అందువల్ల ఏపీకి ఇంత మంచి చేసిన కాంగ్రెస్ ని అక్కడ ప్రజలు గెలిపించాలని ఆయన కోరుతున్నారు. విభజన చేసి ఏపీకి ఒక సీఎం ని ఇచ్చారని జగ్గారెడ్డి అంటున్నారు. అయితే దీని మీద విమర్శలు వస్తున్నాయి. ఏదైనా ఒక వస్తువుని పగలగొడితే రెండు ముక్కలు అవుతుంది. పెద్ద ముక్క బాగున్నది ఒకరి చేతిలోకి వెళ్తే చిన్న ముక్క మరొకరికి వెళ్తుంది.

ఏదో ఒక ముక్క దక్కింది కాబట్టి నా పుణ్యమే అని విరగ్గొట్టిన వ్యక్తి వాదిస్తే ఎంత సొంపుగా ఉంటుందో జగ్గారెడ్డి వాదన కూడా అలాగే ఉందని అంటున్నారు. కాంగ్రెస్ ఏపీని ముక్కలు చేసింది కానీ ఏమి న్యాయం చేసిందో చెప్పాలని మేధావులు ప్రజలు కోరుతున్నారు.

కనీసం ప్రత్యేక హోదా అన్న దానికి విభజన చట్టంలో పెట్టలేకపోయిందని దాని వల్లనే అది ముగిసిన అధ్యాయంగా మారి ఏపీ నష్టపోయిందని ఎత్తి పొడుస్తున్నారు. ఎటూ విభజన జరుగుతుందని తెలుసు కాబట్టి యూపీయే టూ ఉండగానే పోలవరం పూర్తి చేసి ఉంటే ఈపాటికి ఏపీకి చాలా ప్రయోజనం కలిగేదని అని కూడా అంటున్నారు. ఆ పని కూడా చేయలేకపోయారు అని అంటున్నారు.

ఎన్నికలు దగ్గరపడిన వేళ ముక్కలు చేయడం వెనక రాజకీయం తప్ప ఏముందని కూడా అంటున్నారు. నిజంగా విభజన చేయాలని ఉంటే ముందు నష్టపోయిన ఏపీకి న్యాయం చేసిన మీదటనే చేసి ఉండాల్సింది అని అంటున్నారు. జగ్గారెడ్డి ఎవరూ ఎత్తని కొత్త పాయింట్ లేవనెత్తి మీ సీఎం మీ దగ్గర ఉన్నారు అది సోనియా ఇచ్చిన వరం అంటూ కొత్త భాష్యం చెప్పడం విభజన గాయానికి వెన్న పూయడమే తప్ప మరేమీ కాదని జనాల నుంచి ఘాటు విమర్శలు వస్తున్నాయి.