Begin typing your search above and press return to search.

టీవీ ఛానళ్ల ఆఫీసులకే గులాబీ బాస్.. రేవంత్ ఎఫెక్టు మరీ ఇంతనా?

పేదళ్లకు కష్టం వచ్చినా.. విపత్తులతో విలవిలలాడినా.. దగ్గరకు వచ్చి సాంత్వన కలిగించే మాటను చెప్పింది లేదు.

By:  Tupaki Desk   |   23 April 2024 9:30 AM GMT
టీవీ ఛానళ్ల ఆఫీసులకే గులాబీ బాస్.. రేవంత్ ఎఫెక్టు మరీ ఇంతనా?
X

గెలుపు ధీమాను పెంచితే.. ఓటమి గుబులును పెంచుతుంది. అందునా.. సెంటిమెంట్ మీద రాజకీయం చేసే వారు.. కదలించే మాటలతో సరి పెట్టకుండా.. అంతే కమిట్ మెంట్ తో ప్రజల సమస్యలకు పరిష్కారాన్ని చూపుతారన్న భరోసాను నింపాల్సి ఉంది. కానీ.. ఆ విషయంలో ఫెయిల్ అయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పదేళ్లు (దగ్గర దగ్గర) తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన.. ఏ రోజు ప్రజల ముంగిటకు వచ్చి.. తన పాలనా లోపాల్ని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. పేదళ్లకు కష్టం వచ్చినా.. విపత్తులతో విలవిలలాడినా.. దగ్గరకు వచ్చి సాంత్వన కలిగించే మాటను చెప్పింది లేదు.

తాను.. తన మనుషులు.. తన ప్రపంచాన్ని వేరుగా చేసుకున్న ఆయన.. అందులోనే మునిగి తేలేవారు. మంత్రులు మొదలు సామాన్యుల వరకు ఎవరికి అందుబాటులో ఉండేవారు కాదు. సీనియర్ ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులు గంటల కొద్దీ సమయం వెయిట్ చేయాల్సి వచ్చేది. తన తప్పొప్పులను ఎత్తి చూపే మీడియాను అస్సలు పట్టించుకోకపోవటమే కాదు.. వారికి ఎలాంటి సమాచారం అందకుండా కట్టడి చేసిన రోజుల్ని మర్చిపోలేం. అంతేనా.. ప్రభుత్వం జారీ చేసే జీవోల్ని సైతం బయటకు రాకుండా.. రహస్యంగా ఉంచేసిన వైనం తెలిసిందే.

హక్కుల కోసం ఉద్యమించిన ఒక ఉద్యమ నేత పాలనలో.. ప్రభుత్వం చేసే పనులన్ని పారదర్శకంగా చూపించాల్సింది పోయి.. రహస్యంగా ఉంచేసిన వైనం విస్మయానికి గురి చేసింది. ప్రతిది గుట్టుచప్పుడు కాకుండా చూసుకోవటం.. పల్లెత్తు విమర్శకు తావివ్వకపోవటం లాంటివెన్నో పదేళ్ల కేసీఆర్ పాలనతో చూసిందే. ఎప్పుడో తనకు నచ్చినప్పుడు మాత్రమే శాఖల పరంగా రివ్యూలు చేయటం.. ఫైళ్లను క్లియర్ చేయటం మొదలు ప్రజలు తమ గోడు చెప్పుకోవటానికి వీల్లేని రీతిలో అందరికి దూరంగా ఉండిపోయిన ఆయన.. పాలనను అస్తవ్యస్తంగా మార్చేశారన్న ఆరోపణలెన్నో.

అన్నింటికి మించి కేసీఆర్ తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన విచిత్రమైన మనస్తత్వాన్ని ప్రదర్శించేవారు. ఎవరు అవునన్నా.. కాదన్నా కేసీఆర్ ఇంతటి నాయకుడు అయ్యాడంటే అది మీడియా.. మీడియా ప్రతినిధుల పుణ్యమే. అది కాదనలేని సత్యం. ఉద్యమనేతగా ఉన్నప్పుడు నిత్యం మీడియా ప్రతినిధులకు అందుబాటులో ఉంటూ.. ఉద్యమాన్ని వేడెక్కించేందుకు.. ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చేందుకు గంటల కొద్దీ సమయాన్ని గడిపిన ఆయన.. అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు నచ్చిన కొందరిని అందలానికి ఎక్కించేసి.. మొత్తం మీడియా వ్యవస్థను ఎంతలా తూలనాడిన తీరుకు అవాక్కు అయ్యే పరిస్థితి.

అంతేనా.. మీడియాకు అందుబాటులోకి రాకుండా ఉండటం.. తనకు నచ్చిన ఆదివారాల్లోనో.. రాత్రి వేళల్లోనూ మీడియా భేటీలు పెట్టటం ద్వారా చుక్కలుచూపేవారు. ప్రజల తరఫున ఏదైనా అంశంపై ప్రశ్నించే ప్రయత్నం చేస్తే.. వారిని తూలనాడటం.. వారి మాటల్ని ఎటకారం చేసి.. అందరి ముందు పలుచన చేసేవారు. దీంతో.. ప్రశ్నించేతత్త్వాన్నిచంపేసి.. ప్రశ్నించి అందరి ముందు పలుచన కావటం అన్న భయాన్ని అందరిలో కలిగేలా చేశారు. చివరకు దశాబ్దాల తరబడి పని చేసిన వారికి ఇలాంటి బెరుకు కలిగేలా చేశారు. ఇక.. మీడియా అధిపతుల విషయంలో ఆయన ధోరణి ఏమిటన్నది అందరికి తెలిసిందే. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అలాంటి కేసీఆర్ కు పవర్ పోయిన తర్వాత తనలో మార్పు అనివార్యమన్న విషయాన్ని గ్రహించారు. ఆయన నిజంగా మారారా? అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఎన్నికల వేళ మార్పు వచ్చిన భావన ప్రజల్లో కలిగేలా చేయటం కోసం ఆయన కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా బస్సు యాత్రను షురూ చేసిన ఆయన.. త్వరలో టీవీ చానళ్ల వద్దకు వెళ్లి.. ప్రత్యేక ఇంటర్వ్యూల పేరుతో గంటల కొద్దీ సమయాన్ని గడపాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎక్కడ చూసినా తన మాటలు.. తన వాదన బలంగా వినిపించేలా చేయటమే ఆయన లక్ష్యమంటున్నారు. తన మాటలు మంత్రాల వలే ఉంటాయన్న విషయాన్ని తన సన్నిహితుల వద్ద గొప్పగా చెప్పుకునే ఆయన.. అదే నమ్మకంతో ఎన్నికల వేళ ప్రజల మనసుల్ని గెలుచుకోవాలన్న ఆత్రుతతో ఉన్నారు. మరి.. ఆయన మంత్రించే మాటలకు ముగ్థులవుతారా? పదేళ్ల పాలన నుంచి నాలుగు నెలల క్రితమే బయటకు వచ్చి ‘కొత్త ప్రభుత్వం’ మార్పుకు బద్ధులై ఉంటారా? అన్నది తేలాలంటే ఎన్నికల ఫలితాలు వెల్లడి కావాల్సిందే. అప్పటివరకు వెయిట్ చేయక తప్పదు.