Begin typing your search above and press return to search.

శ్రీరాముడిపై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు!

తాజాగా చేవెళ్ల ఎంపీ స్థానానికి బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్‌ నామినేషన్‌ సందర్భంగా జరిగిన ర్యాలీలో కేటీఆర్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు

By:  Tupaki Desk   |   23 April 2024 3:05 PM GMT
శ్రీరాముడిపై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తయిన బీఆర్‌ఎస్‌ పార్టీకి లోక్‌ సభ ఎన్నికల్లో అయినా మెరుగైన సీట్లను సాధించిపెట్టాలని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కృతనిశ్చయంతో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ అభ్యర్థుల తరఫున ఆయన సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

తాజాగా చేవెళ్ల ఎంపీ స్థానానికి బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్‌ నామినేషన్‌ సందర్భంగా జరిగిన ర్యాలీలో కేటీఆర్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. శ్రీరాముడు బీజేపీ ఎంపీనో, ఎమ్మెల్యేనో కాదన్నారు. రాముడి అందరివాడని వ్యాఖ్యానించారు. శ్రీరాముడు అందరికీ దేవుడు అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. బీజేపీ ఎన్నికల్లో ఓడిపోయినా రాముడికి ఏమీ కాదన్నారు. శ్రీరాముడితో తమకు ఎలాంటి పంచాయతీ లేదన్నారు. ఏం ఫరక్‌ పడదన్నారు.

మతం పేరుతో రాజకీయం చేస్తూ ఓట్లు దండుకోవాలని చూస్తున్న బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. బీజేపీ కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్నా జైశ్రీరామ్‌ అనడం తప్ప దేశానికి కానీ, తెలంగాణకు కానీ చేసిందేమీ లేదన్నారు. తెలంగాణలో ఒక్క కాలేజీ, బడికి, గుడికి ఒక్క పైసా ఇవ్వలేదని ఆరోపించారు. అలాగే ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదన్నారు.

2014లో మోదీ ప్రధాని అయినప్పుడు సిలిండర్‌ ధర తక్కువగా ఉంటే ఇప్పుడు పెంచారని కేటీఆర్‌ ఆరోపించారు. మోదీ దేవుడు అని బీజేపీ నేతలు అంటున్నారని.. మోదీ ఎవరికి దేవుడని నిలదీశారు. పెట్రోల్‌ ధరల పెంచినందుకా..? సరుకు రవాణా ఛార్జీలు పెంచి నిత్యవసరాలు పెంచి బతుకులు ఆగం చేసినందుకు దేవుడా అని ప్రశ్నించారు.

అలాగే చేవెళ్లలో తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన రంజిత్‌ రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డికి బుద్ధి చెప్పాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పారిపోయే పిరికిపందలకు తప్పకుండా బుద్ధి చెప్పాలని పార్టీ శ్రేణులను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్‌ కు 8 నుంచి 10 సీట్లు ఇస్తే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మనం చెప్పినట్లే వింటుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండే ఎవరైనా మన వద్దకు రావాలంటే బీఆర్‌ఎస్‌ కు ఎక్కువ సీట్లు ఇవ్వాలని కోరారు.

మోదీ, ఎన్డీయే కూటమికి 400 కాదు..200 సీట్లు కూడా వచ్చేలా లేవని కేటీఆర్‌ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి కూడా 100 నుంచి 150 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు.