Begin typing your search above and press return to search.

వీడియో వైరల్‌.. గగనతలంలో రెండు హెలికాఫ్టర్లు ఢీకొని!

సైనిక విన్యాసాలు లేదా రిహార్సల్స్‌ నిర్వహించేటప్పుడు హెలికాప్టర్లు, యుధ్ధ విమానాలు పలు సందర్భాల్లో నేలకూలుతుంటాయి.

By:  Tupaki Desk   |   23 April 2024 6:42 AM GMT
వీడియో వైరల్‌.. గగనతలంలో రెండు హెలికాఫ్టర్లు ఢీకొని!
X

సైనిక విన్యాసాలు లేదా రిహార్సల్స్‌ నిర్వహించేటప్పుడు హెలికాప్టర్లు, యుధ్ధ విమానాలు పలు సందర్భాల్లో నేలకూలుతుంటాయి. మనదేశంలోనూ పలుమార్లు మిగ్‌ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, తేజస్‌ యుద్ధ విమానాలు కుప్పకూలాయి. ఈ ప్రమాదాల్లో పలువురు సైన్యాధికారులు, సిబ్బంది అమరులయ్యారు.

ఇప్పుడు ఇలాంటి ఘటనే ఆసియా దేశం మలేసియాలో జరిగింది. నేవీ విన్యాసాల్లో భాగంగా రెండు హెలికాప్టర్లు గాలిలో ఢీకొన్న ఘటనలో పది మంది మృత్యువాతపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

మలేసియాలో జరిగిన ఈ ఘోర దుర్ఘటన వివరాల్లోకి వెళ్లే.. మలేసియా నేవీ దినోత్సవం సందర్భంగా ఆ దేశ ప్రభుత్వం పెరక్‌ లోని లుమత్‌ లో నేవీ ఉత్సవాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తాజాగా రిహార్సల్స్‌ చేపట్టింది.

ఇందులో భాగంగా పడంగ్‌ సితియావాన్‌ నుంచి పైకి లేచిన రెండు హెలికాప్టర్లు కొద్దిసేపటికే ప్రమాదానికి గురయ్యాయి. ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఇందులో ఒక హెలికాప్టర్‌ విన్యాసాలు జరుగుతున్న ప్రాంతానికి చేరువలో ఉన్న ఒక స్టేడియంలో కుప్పకూలింది. మరొక హెలికాప్టర్‌ స్విమ్మింగ్‌ పూల్‌ లో నేలకూలింది.

ఈ ఘోర దుర్ఘటనలో రెండు హెలికాప్టర్లకు చెందిన పది మంది నేవీ సిబ్బంది అశువులు బాశారు. ఇందులో ఇద్దరు లెఫ్టినెంట్‌ కమాండర్లు కూడా ఉన్నారని వార్తా సంస్థలు నివేదించాయి.

కాగా రెండు హెలికాఫ్టర్లలో పది మంది సిబ్బంది అక్కడికక్కడే చనిపోయినట్లు మలేషియా నేవీ ప్రకటన విడుదల చేసింది. మృతదేహాలను గుర్తించడానికి వాటిని నేవీ ఆస్పత్రికి తరలించినట్టు వెల్లడించింది.

కొద్ది రోజుల క్రితం జపాన్‌ లోనూ ఇలాంటి ఘోర దుర్ఘటనే చోటు చేసుకుంది. ప్రత్యేక శిక్షణలో ఉన్న రెండు నౌకాదళ హెలికాప్టర్‌లు ఒకదానికొకటి గుద్దుకుని సముద్రంలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో 8 మంది మృత్యువాత పడ్డారు.