Begin typing your search above and press return to search.

మోడీ ఎఫెక్ట్... ఆ రెండు పార్టీలకు భారీ దెబ్బ ?

దేశంలో రాజకీయం మారుతోంది. మొదటి విడత పోలింగ్ ముగిసిన వెంటనే బీజేపీ ఎన్నికల ప్రచారం కొత్త రూటు తీసుకుంది.

By:  Tupaki Desk   |   1 May 2024 7:44 AM GMT
మోడీ ఎఫెక్ట్... ఆ రెండు పార్టీలకు భారీ దెబ్బ ?
X

దేశంలో రాజకీయం మారుతోంది. మొదటి విడత పోలింగ్ ముగిసిన వెంటనే బీజేపీ ఎన్నికల ప్రచారం కొత్త రూటు తీసుకుంది. అప్పటిదాకా ఏమనుకున్నారో లేక ధీమాగా ఉన్నారో తెలియదు కానీ తొలి ఓటు ఈవీఎంలలో నిక్షిప్తం కాగానే బీజేపీ టోనూ వ్యూహాలు మొత్తం మారిపోయాయి.

దేశంలో మైనారిటీలు ముస్లిమ్స్ అంటూ ఏకంగా ప్రధాని స్థాయిలో ఉన్న మోడీ తో పాటు బీజేపీ అగ్ర నేతలు అందరూ కూడా ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ల రద్దు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమీ మిగలదు అన్నారు. ఒక విధంగా మెజారిటీ మైనారిటీ అంటూ కొత్త చర్చకు తెర తీశారు.

ఈ రకమైన ప్రచారంతో హిందూత్వను బీజేపీ గట్టిగా నమ్ముకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఎన్నికల ప్రచారంలో కూడా మోడీ అమిత్ షాలు ముస్లిం రిజర్వేషన్లు అమలు చేయమని చెబుతున్నారు ఉమ్మడి పౌర స్మృతి మీద మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఏపీలో తీవ్ర రాజకీయ ప్రభావం చూపించబోతున్నాయని అంటున్నారు.

అదెలా అంటే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి మళ్ళీ రాకూడదని ముస్లిం సామాజిక వర్గం కోరుకుంటోంది అని అంటున్నారు. దాంతో ఏపీలో బీజేపీ సొంతంగా ఆరు సీట్లకు కూటమి సహకారంతో పోటీ చేయబోతోంది. ఆ ఆరింటిలో డైరెక్ట్ గానే బీజేపీకి యాంటీగా ముస్లింలు ఓటు వేస్తారు అని ప్రచారం సాగుతోంది.

ఇక మిగిలిన చోట్ల టీడీపీ జనసేన పోటీలో ఉన్నాయి. మరి వాటి విషయంలో కూడా ముస్లింలు ఏ స్టాండ్ తీసుకుంటాయంటే యాంటీగానే అని అంటున్నారు. అయితే ఇక్కడ చూస్తే కనుక ఏపీలో ఎవరు గెలిచినా అంటే వైసీపీ టీడీపీ జనసేనలలో ఎంపీలు అయితే కచ్చితంగా బీజేపీకి మద్దతు ఇస్తారు అని అంటున్నారు దాంతో బలమైన అభ్యర్ధులను నిలిపిన చోట్ల కాంగ్రెస్ కి ఏపీలో ముస్లిం మైనారిటీలు మద్దతుగా నిలవబోతున్నారు అని అంటున్నారు. కడపలో చూసుకుంటే బలమైన అభ్యర్ధిగా కడప ఎంపీ సీటుకు వైఎస్ షర్మిల ఉన్నారు.

ఆమెకు ముస్లిం మైనారిటీ ఓట్లు ఎక్కువగా టర్న్ అయ్యే చాన్స్ ఉందని అంటున్నారు. దీని మీద ప్రచారం కూడా అలాగే సాగుతోంది.ఎమ్మెల్యేల దాకా చూస్తేనే ఏపీలో టీడీపీ వైసీపీల మధ్య పోటీ ఉన్నా ఎంపీ సీట్లు వచ్చేసరికి మాత్రం బలమైన ఎంపీ అభ్యర్ధులు కాంగ్రెస్ కి ఉన్న చోట అంటే కాకినాడలో కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు, గుంటూరు లో జేడీ శీలం, తిరుపతిలో చింతా మోహన్, కడపలో వైఎస్ షర్మిల ఇలా ఉన్న చోట మాత్రం డైరెక్ట్ గా కాంగ్రెస్ కే ముస్లిమ్స్ ఓట్లు వేస్తారు అని ప్రచారం సాగుతోంది.

అదే కనుక నిజమైతే మాత్రం టీడీపీ వైసీపీలకే పెద్ద దెబ్బ పడుతుంది అని అంటున్నారు; మరీ ముఖ్యంగా వైసీపీకే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఏపీలో గత రెండు ఎన్నికల్లో ముస్లిం మైనారిటీ ఓట్లు వైసీపీకే ఎక్కువగా పడ్డాయన్నది తెలిసిందే. ఇపుడు ఆ ఓట్లలో చీలిక వస్తే వైసీపీకే దెబ్బ పడుతుంది అని అంటున్నారు.

మొత్తం మీద చూసుకుంటే మాత్రం దేశంలో కాంగ్రెస్ ని బీజేపీ ఎంతగా కార్నర్ చేస్తే దాని ప్రభావం ఏపీలో అంతలా వైసీపీ టీడీపీల మీదనే పడుతోందని అంటున్నారు. ఇది కేవలం ముస్లిం మైనారిటీలకు మాత్రమే పరిమితం అవుతుందా లేక ఎస్సీ ఎస్టీ సహా ఇతర సామాజిక వర్గాల మీద కూడా పడుతుందా అన్నది చూడాల్సి ఉంది.