Begin typing your search above and press return to search.

ఇంట్లో 'బీ', కేంద్రంలో 'బీ' చేతుల్లో జగన్ రిమోట్ కంట్రోల్.. షర్మిళ సెటైర్లు!

అక్రమ కేసుల ఛార్జిషీట్లలో తన తండ్రి వైఎస్సార్ పేరు, తన పేరు చేర్చింది కాంగ్రెస్, టీడీపీలే అని అన్నారు.

By:  Tupaki Desk   |   30 April 2024 7:13 AM GMT
ఇంట్లో బీ, కేంద్రంలో బీ చేతుల్లో జగన్  రిమోట్  కంట్రోల్.. షర్మిళ సెటైర్లు!
X

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కుతుండటం ఒకెత్తు అయితే... ఈ రాజకీయ వార్ లో వైఎస్ జగన్ వర్సెస్ షర్మిళ రాజకీయ మరొకెత్తుగా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ తరుపున కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న షర్మిళ... జగన్ & కో పై వివేకా హత్య కేసు విషయంపైనే తీవ్ర విమర్శలు గుప్పించారు. హంతకులకు, మర్డర్ కేసుల్లో నిందితులకు ఓట్లు వేయొద్దన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు.

అయితే... ప్రస్తుతానికి వివేకా హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుండగా.. వ్యవహారం కోర్టు పరిధిలో ఉందనేది తెలిసిన విషయమే! దీంతో... ఈ విషయంపై స్పందించొద్దని కడప కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో.. ప్రస్తుతానికి ఆ విషయంపై రాజకీయ విమర్శలు తగ్గాయి. ఈ సమయంలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రోజుకి మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న జగన్... గ్యాప్ లో జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షర్మిళ & కోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... మోడీతో తనకున్నది కేంద్ర ప్రభుత్వం - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న బంధం మాత్రమే అని స్పష్టం చేసిన జగన్... ఇప్పుడు వారు రాజకీయంగా తమ ప్రత్యర్థులని గుర్తుచేశారు. ఇదే క్రమంలో... కడప లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిళ పైనా స్పందించిన జగన్... ఆమె పోటీ చేయడంపై తనకు బాధ లేదని.. కానీ, ఆమె డిపాజిట్ కోల్పోతుందనే బాధ ఎక్కువగా ఉందని అన్నారు.

అక్రమ కేసుల ఛార్జిషీట్లలో తన తండ్రి వైఎస్సార్ పేరు, తన పేరు చేర్చింది కాంగ్రెస్, టీడీపీలే అని అన్నారు. ఇదే సమయంలో... ఇప్పుడు తన చెల్లెలు, కాంగ్రెస్ పార్టీలను రేవంత్ ద్వారా నడిపిస్తున్నది చంద్రబాబే అని జగన్ సంచలన ఆరోపణ చేశారు. కాంగ్రెస్ పార్టీ అనేది చంద్రబాబు రిమోట్ కంట్రోల్ తో నడుస్తున్న పార్టీ అని జగన్ వ్యాఖ్యానించారు!

ఈ వ్యాఖ్యలపై తాజాగా షర్మిళ స్పందించారు. ఈ సందర్భంగా... రిమోట్ కంట్రోల్స్ గురించి జగన్ కు బాగా అవగాహన ఉందని మొదలుపెట్టిన షర్మిళ... అందుకు కారణం ఇదే అంటూ చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా... గత ఐదు సంవత్సరాలుగా జగన్ కేంద్రంలోని మోడీ చేతుల్లోనూ, రాష్ట్రంలో తన ఇంట్లో ఉన్న వాళ్ల చేతుల్లో రిమోట్ కంట్రోల్ లో ఉన్నారని అన్నారు.

ఇదే సమయంలో... ఇద్దరి పేర్లూ "బీ"తోనే స్టార్ట్ అవుతాయని చెబుతూ... అది బీజేపీ అయినా.. ఇంట్లో ఉన్నవాళ్లయినా అని షర్మిళ సెటైర్లు వేశారు! దీంతో... ఇంట్లో ఉన్న "బీ" అంటే జగన్ సతీమణి, షర్మిళ వదిన "భారతీ" అయ్యి ఉండొచ్చని, ఆ విషయాన్ని పైకి చెప్పలేక ఇలా 'బీ' అంటూ స్పందించారని పలువురు కామెంట్ చేస్తున్నారు!!