Begin typing your search above and press return to search.

2024 వేవ్ లెస్ ఎలక్షన్స్...!?

2024లో బీజేపీ తమకు నాలుగు వందల సీట్లు అని ఎంచుకున్న నినాదం రాజకీయంగానే చూడాలి తప్ప భావోద్వేగంగా చూడడానికి లేదు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   23 April 2024 10:40 AM GMT
2024 వేవ్ లెస్ ఎలక్షన్స్...!?
X

ప్రతీ ఎన్నికకూ ఒక చరిత్ర ఉంది. ప్రతీ ఎన్నిక వెనక ఒక భావోద్వేగం ఉంది. ప్రతీ ఎన్నిక వెనకాల ఒక రాజకీయ సంచలనం ఉంది. కానీ 2024 ఎన్నికలకు మాత్రం అలాంటి ప్రత్యేకత ఏదీ లేదని తెలుస్తోంది. ఏడు దశల ఎన్నికలు లోక్ సభకు జరుగుతున్నాయి. ఏకంగా నెలన్నర పాటు సాగే ఈ భారీ ఎన్నికల కసరత్తులో తొలి దశ పూర్తి అయింది. మలి దశ ఈ నెల 26న జరగనుంది.

అయితే ఇప్పటికే ప్రచారం దేశంలో సాగుతోంది. కానీ ఎక్కడా చడీ చప్పుడూ అయితే రాజకీయంగా లేదు అనే అంటున్నారు. నిజానికి దేశంలో ఎన్నికలు అంటే ఆ హోరే వేరుగా ఉంటూ వచ్చేది. దాదాపుగా అర్ధ శతాబ్దంగా చూస్తే ప్రతీ ఎన్నికకూ ఒక రాజకీయ అంశం ముఖ్య భూమిక పోషిస్తూ వచ్చింది. 1971లో జరిగిన ఎన్నికలకు ఇందిరాగాంధీ నవ్య నూతన నాయకత్వం అదే విధంగా పాకిస్థాన్ మీద భారత్ యుద్ధంలో సాధించిన విజయం ముఖ్య భూమిక పోషించాయి.

దాంతో కాంగ్రెస్ ఎన్నడూ లేని విధంగా భారీ మెజారిటీని సొంతం చేసుకుంది. ఇందిరాగాంధీ ఆ ఎన్నికల తరువాత తిరుగులేని నేతగా మారారు. ఐరన్ లేడీ అన్న బిరుదు అందుకున్నారు. ఇక 1977 గురించి అందరికీ తెలుసు. ఆ ఎన్నికలు దేశంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ సాగిన ఆ ఎన్నికలు దేశంలో స్వాతంత్రం వచ్చాక కాంగ్రెస్ కి తొలిసారి ఓటమిని చూపించాయి. విపక్షాలు అన్నీ కూటమిగా జట్టు కట్టి కేంద్రంలో జనతా ప్రభుత్వం ఏర్పాటు అయింది.

ఇక 1980లో జరిగిన ఎన్నికలు చూసుకుంటే ఇందిరాగాంధీ మరోసారి వీర విహారం చేయడం సుస్థిర ప్రభుత్వం అన్న ఆమె ఇచ్చిన పవర్ ఫుల్ నినాదం పనిచేయడం ద్వారా కాంగ్రెస్ అధ్బుతమైన విజయం సొంతం చేసుకుంది. ఇక 1984లో ఇందిరాగంధీ దారుణ హత్యతో విపరీతమైన భావోద్వేగం దేశమంతా చెలరేగింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 404 కి పైగా ఎంపీ సీట్లు దక్కాయి.

అదే విధంగా చూసుకుంటే 1989లో జరిగిన ఎన్నికలు నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రభుత్వం అవినీతి చేసిందని బోఫోర్స్ కుంభకోణం వంటి వాటి మీద సాగిన ఎన్నికలు నేషనల్ ఫ్రంట్ గా ఏర్పడిన విపక్షాలు అన్నీ ఆ ఎన్నికల్లో గెలిచి రాజీవ్ ని మాజీ గా చేశాయి. 1991లో జరిగిన ఎన్నికలు రాజీవ్ మరణం తరువాత మరోసారి సానుభూతి పవనాలతో సాగాయి. కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చాయి. 1996లో జరిగిన ఎన్నికలు దేశంలో విపక్షాలకు ఒక్క చాన్స్ అంటూ సాగాయి. అలా 1996లో విపక్షాలు యునైటెడ్ ఫ్రంట్ అంటూ అధికారాన్ని పంచుకున్నాయి.

ఇక 1998లో జరిగిన ఎన్నికలలో బీజేపీ మాకూ ఒక్క చాన్స్ అంటూ ముందుకు వస్తే జనాలు ఆ పార్టీని ఏకైక పెద్ద పార్టీగా నెగ్గించారు. మిత్రులతో అధికారంలోకి వచ్చింది. ఇక 1999లో జరిగిన ఎన్నికలు ఒక్క ఓటుతో వాజ్ పేయ్ ప్రభుత్వం పడిపోయింది అన్న సానుభూతితో పాటు కార్గిల్ యుద్ధం నేపధ్యమో జరిగి వాజ్ పేయ్ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి పట్టం కట్టాయి. ఇక 2004లో జరిగిన ఎన్నికలు బీజేపీ పాలనలో దేశం వెలవెలబోతోంది అని కాంగ్రెస్ చేసిన ప్రచారానికి జనాల మద్దతు దక్కించుకుని యూపీఏ సర్కార్ అధికారం చేపట్టింది.

అదే విధంగా 2009లో యూపీఏ ప్రభుత్వానికి మరోసారి అధికారం కావాలని కోరినపుడు జనాలు ఆమోదించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడపగలదు అంటూ ప్రజల వద్దకు వెళ్ళి మన్ననలు పొందినదిగా చూడాలి. 2014లో చూస్తే నరేంద్ర మోడీ జాతీయ తెర మీద తొలిసారిగా మెరిసి దేశాన్ని గుజరాత్ మోడల్ అంటూ ఆకర్షించారు. అంతే కాదు ఆయన అప్పటికి పదేళ్ళ యూపీఏ ప్రభుత్వం అవినీతిని ఆసరాగా చేసుకుని ఎండగడుతూ ముందుకు సాగారు. ఫలితంగా తొలిసారిగా పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చింది.

ఇక 2018లో చూస్తే పాకిస్తాన్ మీద జరిగిన మెరుపు దాడులు పూల్వామా దాడులతో దేశాన్ని కాపాడేది తామే అంటూ భావోద్వేగంతో కూడిన ప్రచారం బీజేపీ చేసుకుని ఎన్నికలను మరోసారి అధికారంలోకి వచ్చింది. ఇపుడు చూస్తే ఏ నినాదమూ కనిపించని ఎన్నికలుగా చూడాల్సి ఉంటుంది. 2024లో బీజేపీ తమకు నాలుగు వందల సీట్లు అని ఎంచుకున్న నినాదం రాజకీయంగానే చూడాలి తప్ప భావోద్వేగంగా చూడడానికి లేదు అని అంటున్నారు. అయితే ఈ నినాదం ప్రజల బుర్రలోకి ఎక్కకపోగా ఫెయిల్ అయ్యే చాన్స్ ఉందని అంటున్నారు.