Begin typing your search above and press return to search.

పిఠాపురం పవన్ ప్రత్యర్థి వంగా గీత ఆస్తుల వివరాలివే!

ఇక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారనే ప్రకటన వెలువడినప్పటి నుంచీ ఈ నియోజకవర్గం డైలీ ట్రెండింగ్ లో ఉంటుంది.

By:  Tupaki Desk   |   23 April 2024 5:09 AM GMT
పిఠాపురం పవన్ ప్రత్యర్థి  వంగా గీత ఆస్తుల వివరాలివే!
X

ప్రస్తుతం ఏపీలోని హాట్ టాపిక్ నియోజకవర్గాల్లో పిఠాపురం ఫస్ట్ లైన్ లో ఉంటుందనేది తెలిసిన విషయమే. ఇక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారనే ప్రకటన వెలువడినప్పటి నుంచీ ఈ నియోజకవర్గం డైలీ ట్రెండింగ్ లో ఉంటుంది. పైగా.. ఇక్కడ వైసీపీ ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, రానున్న ఎన్నికల్లోనూ పవన్ కు షాకివ్వాలని ప్లాన్ చేసిందని చెబుతుండటంతో ఈ విషయం మరింత చర్చనీయాంశం అవుతుంది.

ఇప్పటికే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత ప్రచారంతో హోరెత్తించేస్తుండగా.. తెరవెనుక మిథున్ రెడ్డి వ్యూహాలు, తెరముందు ముద్రగడ పద్మనాభం అనుభవాలు వెరసి ఇక్కడ రాజకీయం రసవత్తరంగా మారిందని చెబుతున్నారు. మరోపక్క అన్నీ అనుకూలంగా జరిగితే పిఠాపురంలో చిరంజీవి ప్రచారంపైనా ఊహాగాణాలు తెరపైకి వస్తున్నాయి. దీంతో.. ఇప్పుడు ఏపీలో పిఠాపురం నియోజకవర్గం తీవ్ర హాట్ టాపిక్!

ఈ సమయంలో అక్కడ నుంచి పోటీ చేస్తున్న అధికార పార్టీ అభ్యర్థి వంగ గీత సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ లో ఆస్తులు, అప్పులు, విద్యార్థతలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మరోపక్క... ఈ రోజు పిఠాపురంలో కూటమి తరుపున జనసేన అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ వేయబోతున్నారు. ఈ సందర్భంగా చేబ్రోలు నుంచి గొల్లప్రోలు మీదుగా పిఠాపురం పాదగయ వరకు ర్యాలీ చేపట్టబోతున్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే నామినేషన్ వేసిన వంగ గీత సమర్పించిన అఫిడవిట్ లోని ఆస్తులు, అప్పుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇందులో భాగంగా... బీఏ, బీఎల్‌, ఎంఎల్‌ విద్యార్హతలు ఉన్న వంగ గీతపై ఎలాంటి కేసులూ లేవు. ఇక చరాస్థుల విషయానికొస్తే... ఆమె పేరు మీద రూ.2.10 కోట్లు, ఆమె భర్త పేరు మీద రూ.27.81 లక్షలు ఉన్నాయి.

అదేవిధంగా... స్థిరాస్థుల విషయానికొస్తే.. గీత పేరు మీద రూ.13.11 కోట్లు, ఆమె భర్త పేరు మీద రూ.13.64కోట్లు ఉన్నాయి. ఇక వంగ గీత పేరు మీద రూ. 4.51 కోట్లు, ఆమె భర్త పేరు మీద రూ.51.64 లక్షల అప్పులు ఉన్నట్లు ఆమె వెల్లడించారు. ఈ నేపథ్యంలో... ఈ రోజు పవన్ వెల్లడించబోయే ఆస్తుల వివరాలు ఎలా ఉంటాయనేది వేచి చూడాలి!