Begin typing your search above and press return to search.

బీజేపీ ఈసారి నార్త్ ఇండియాలో యాభై సీట్లు పోగొట్టుకుంటుందా..!?

అంటే అపుడు 210 ఎంపీ సీట్లు మాత్రమే బీజేపీకి వస్తాయని అంటున్నారు. ఇది నిజంగా బీజేపీకి చాలా ఇబ్బంది పెట్టే అంశం అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   23 April 2024 10:37 AM GMT
బీజేపీ ఈసారి నార్త్ ఇండియాలో యాభై సీట్లు పోగొట్టుకుంటుందా..!?
X

బీజేపీకి పైకి బింకంగా తమకు ఎక్కువ సీట్లు వస్తాయని చెబుతోంది. కానీ రియాలిటీ చూస్తే అలాంటి వాతావరణం ఉందా అన్న చర్చ సాగుతోంది. మరీ ముఖ్యంగా చూస్తే బీజేపీ బలం అంతా ఉత్తరాదిలోనే ఉంది. బీజేపీ ఇప్పటికి అనేక సార్లు గెలిచి అధికారంలోకి వచ్చినా దానికి కారణం ఉత్తరాది రాష్ట్రాలే అని చెప్పాల్సి ఉంటుంది.

ఉత్తరాదిలో ఏకంగా మొత్తం 542 ఎంపీ సీట్లలో సగానికి పైగా ఉన్నాయి. దాంతో బీజేపీకి ఎపుడు విజయం ఉత్తరాది నుంచే దక్కుతోంది. బీజేపీ జనసంఘ్ గా ఉన్న కాలం నుంచి ఉత్తరాది రాష్ట్రాలలోనే బలం ఉంది. ఇక బీజేపీ దక్షిణాదిలో ఎన్నడూ పెద్దగా విస్తరించింది లేదు. ఆ ప్రయత్నం పార్టీ ఎపుడు చేసినా కూడా పెద్దగా ఫలితాలను ఇవ్వడం లేదు.

మరో వైపు చూస్తే ఈసారి బీజేపీ భారీ టార్గెట్ పెట్టుకుంది. దాని వెనక బీజేపీ ధీమా కంటే వ్యూహాలే ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికి రెండు ఎన్నికల్లో బీజేపీ కొమ్ము కాసిన ఉత్తరాది రాష్ట్రాలు ఈసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటాయని అంటున్నారు. ఈ రాష్ట్రాలలో గతంలో వచ్చిన దాని కంటే సీట్లు తగ్గుతాయని అంటున్నారు. దాంతో ఆ లోటుని భర్తీ చేసుకోవడానికి బీజేపీ వేసిన కొత్త ఎత్తులలో భాగమే నాలుగు వందలు ఎన్డీయేకు సీట్లు అన్న నినాదం అని అంటున్నారు.

బీజేపీకి ఈసారి ఉత్తరాది రాష్ట్రాలలో ఏకంగా యాభై దాకా ఎంపీ సీట్లు తగ్గిపోతాయని అంటున్నారు. అంటే 2019లో బీజేపీ ఉత్తరాదిన గెలుచుకున్న 260కి పైగా సీట్లలో యాభై సీట్లు అన్న మాట. అంటే అపుడు 210 ఎంపీ సీట్లు మాత్రమే బీజేపీకి వస్తాయని అంటున్నారు. ఇది నిజంగా బీజేపీకి చాలా ఇబ్బంది పెట్టే అంశం అని అంటున్నారు.

ఎందుకంటే మెజారిటీ కి మ్యాజిక్ ఫిగర్ 273 గా ఉంది.దానికి అరవై సీట్ల దూరంలో బీజేపీ నిలిచిపోతే ఆదుకోవాల్సింది కచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలే. లేకపోతే బీజేపీ సొంతంగా మెజారిటీని సాధించి అధికారంలోకి రావడం అన్నది సాధ్యపడదు అని అంటున్నారు.

ఇక గత ఎన్నికల్లో చూసుకుంటే రాజస్థాన్ లో మొత్తం పాతికకు పాతిక సీట్లు గెలుచుకున్న బీజేపీకి ఈసారి 10 సీట్లు కోత పడతాయని అంటున్నారు. అలాగే బీహార్ లో మొత్తం 40 ఎంపీ సీట్లు ఉంటే 38 దాకా 2019లో గెలుచుకుంది. ఈసారి అలా కుదరదు అంటున్నారు. ఎందుకంటే అక్కడ ఆర్జేడీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు పుంజుకున్నాయి. దాంతో పది సీట్లు నష్టపోతుందని లెక్క వేస్తున్నారు.

అదే విధంగా చూస్తే కనుక గుజరాత్ మొత్తం 26 ఎంపీ సీట్లనూ స్వీప్ చేసి పారేసింది 2019లో బీజేపీ. ఈసారి కనీసంగా రెండు ఎంపీ సీట్లు అయినా బీజేపీ నష్టపోతుందని అంటున్నారు. అలాగే హర్యానాలో నాలుగు సీట్లు బీజేపీ ఓడిపోతుందని చెబుతున్నారు. ఢిల్లీలో ఏడు ఎంపీ సీట్లు ఉంటే అందులో ఏడింటికి ఏడూ 2019లో బీజేపీ ఖాతాలో పడ్డాయి. కానీ ఈసారి చూస్తే కనుక బీజేపీకి అయిదు దాకా వస్తాయని అంటున్నారు. అంటే రెండు ఎంపీ సీట్లు నష్టపోక తప్పదని వెల్లడి అవుతోందిట.

కర్నాటకలో 28 ఎంపీ సీట్లు ఉంటే 2019లో ఏకంగా పాతిక దాకా బీజేపీ గెలుచుకుంది. ఈసారి పది ఎంపీ సీట్లు బీజేపీ నష్టపోతుందని అంచనాలు ఉనాయి అంటున్నారు. కర్నాటలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. దాంతో కాంగ్రెస్ కూడా గట్టిగా పోరాడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీకి ఏకపక్ష విజయాలు అయితే దక్కేది ఉండదని అంటున్నారు.

ఇక ఉత్తర భారతాన బీజేపీ ఇంతలా యాభైకి పైగా ఎంపీ సీట్లు నష్టపోవడానికి కారణాలు చూస్తే కనుక అక్కడ చాలా రాష్ట్రాలలో బలంగా ఉన్న రాజ్ పుట్ లు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అని అంటున్నారు. బీజేపీకి ఒకనాడు రాజ్ పుట్ లు బలంగా మద్దతు ఇస్తూ ఉండేవారు. ఈసారి వారు మనసు మార్చుకున్నారు అని అంటున్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలను వారు వ్యతిరేకిస్తున్నారు అని అంటున్నారు.

ఇక యూపీ బీహార్ వంటి పెద్ద స్టేట్స్ లో అత్యంత కీలకమైన భూమిక రాజకీయంగా పోషించే జాట్లు కూడా బీజేపీ పట్ల వ్యతిరేకంగా ఉన్నారు అని అంటున్నారు. ఈ సామాజిక వర్గం దన్నుతోనే గతంలో బీజేపీ రికార్డు స్థాయి విజయాలను సొంతం చేసుకుందని గుర్తు చేస్తున్నారు. మరి బీజేపీ కనుక యాభై ఎంపీ సీట్లు నష్టపోవడమే నిజం అయితే అధికారంలోకి రావడానికి మిత్రుల మీద ఆధారపడవలసి ఉంటుందని అంటున్నారు.