Begin typing your search above and press return to search.

అత్యధిక ప్రకృతి విపత్తుల ఆసియా... రికార్డ్ బ్రేకింగ్ ఇయర్ అంట!

ఐక్యరాజ్య సమితి ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూ.ఎం.ఓ).. తన వాతావరణ నివేదిక 2023ని విడుదల చేసింది

By:  Tupaki Desk   |   23 April 2024 4:12 PM GMT
అత్యధిక ప్రకృతి విపత్తుల ఆసియా... రికార్డ్ బ్రేకింగ్ ఇయర్ అంట!
X

ఐక్యరాజ్య సమితి ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూ.ఎం.ఓ).. తన వాతావరణ నివేదిక 2023ని విడుదల చేసింది. గ్లోబల్ వార్మింగ్ ప్రమాదకర స్థాయికి చేరుకుందని చాలా మంది పరిశీలకుల భయాలను ధృవీకరించడమే కాకుండా, వాతావరణ మార్పు, దాని సహాయక ప్రభావాలు పురోగమిస్తున్నాయనడానికి చాలా సాక్ష్యాలను ఇది అందిస్తుందని అంటున్నారు. అనుకున్నదానికంటే ముందుగానే పరిస్థితితులు తీవ్రమవుతున్నాయని హెచ్చరిస్తుందని చెబుతున్నారు!

అవును... 2023లో వాతావరణం, శీతోష్ణస్థితి మరియు నీటి సంబంధిత ప్రమాదాల నుండి ఆసియా ప్రపంచంలోనే అత్యంత విపత్తు, బాధిత ప్రాంతంగా మిగిలిపోయిందని ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించింది. వరదలు మరియు తుఫానులు అత్యధిక సంఖ్యలో ప్రాణ, ఆర్థిక నష్టాలను కలిగించాయని, అదే సమయంలో హీట్‌ వేవ్‌ ల ప్రభావం మరింత తీవ్రంగా మారిందని ఈ కొత్త నివేదిక తెలిపింది.

గ్లోబల్ వార్మింగ్ మరియు శీతోష్ణస్థితి మార్పులకు ప్రధాన కారణమైన గ్రీన్‌ హౌస్ వాయువులు, ప్రధానంగా కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ ల వాతావరణ సాంద్రతలు కూడా రికార్డు స్థాయిలో ఉండటంలో ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఇందులో భాగంగా... కార్బన్ డయాక్సైడ్ సాంద్రత 417.9 పార్ట్స్ పర్ మిలియన్ (పీపీఎం), మీథేన్ 1923 పీపీఎం, నైట్రస్ ఆక్సైడ్ 335.8 పీపీఎం లుగా ఉంటూ వరుసగా... 154%, 264%, 154% ఎక్కువగా పెరుగుదల రేటును కలిగి ఉన్నాయని అంటున్నారు.

వీటివల్ల సముద్ర మట్టాలు పెరగడం మాత్రమే కాకుండా, మునుపటి కంటే చాలా వేగంగా ఇప్పటివరకు నమోదైన అత్యధిక రేట్లు వద్ద పెరుగుతున్నాయని చెబుతున్నారు. 1993-2002లో 2.13 మిమీ/సంవత్సరంతో పోలిస్తే 2014-23 గత దశాబ్దంలో సగటు సముద్ర మట్టం సంవత్సరానికి 4.77 మిమీ చొప్పున పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయంలో... క్రియోస్పియర్.. అంటే ధ్రువ మంచు, మంచు పలకలు, శాశ్వత మంచు కవచం, ఇతర చోట్ల హిమానీనదాలు, వాతావరణ మార్పుల వల్ల తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని.. ఇవి ప్రాంతీయ వాతావరణంలో పెద్ద మార్పులను ప్రేరేపించే అంచున ఉన్నాయని అంటున్నారు. ఈ మార్పులు వందల మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని చెబుతున్నారు.

ఈ క్రమంలో సంభవిస్తున్న ప్రకృతి విపత్తుల కారణంగా... ప్రపంచంలో, ఆసియా ఖండం అత్యధికంగా ప్రభావితం అవుతోందని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ నివేదిక తెలిపింది. తుఫాన్లు, వరదలే ఈ విపత్తుల్లో అత్యధికమని వెల్లడించింది. వీటి వలన ఈ ప్రాంతంలో సుమారు 2వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. ఇలా ప్రకృతి విపత్తులు ఎక్కువగా ఆసియా దేశాలపై విరుచుకుపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.