Begin typing your search above and press return to search.

శాటిలైట్ రైట్స్.. ఇంకా అంతే సంగతి!

ఒకప్పుడు టీవీలో సినిమా వస్తుందని తెలిస్తే చాలు. కచ్చితంగా గుర్తుపెట్టుకుని ఆ మూవీని చూసేవాళ్లం.

By:  Tupaki Desk   |   6 May 2024 10:11 AM GMT
శాటిలైట్ రైట్స్.. ఇంకా అంతే సంగతి!
X

ఒకప్పుడు టీవీలో సినిమా వస్తుందని తెలిస్తే చాలు. కచ్చితంగా గుర్తుపెట్టుకుని ఆ మూవీని చూసేవాళ్లం. మన ఫ్రెండ్స్ కు కూడా చెప్పేవాళ్లం. ఇప్పుడంతా ట్రెండ్ మారిపోయింది. థియేటర్లలో రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఓటీటీల్లోకి సినిమాలు వచ్చేస్తున్నాయి. దీంతో టీవీలో మూవీలను చూసేవాళ్లను ఈజీగా వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు.

ఓటీటీలు బాగా పాపులర్ కాని సమయంలో.. అంటే కొవిడ్ కు ముందు థియేటర్లలో సినిమాలు విడుదలైన కొన్ని నెలల తర్వాత టీవీల్లో వచ్చేవి. దీంతో అంతా ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూసేవారు. కానీ కరోనా సమయంలో అంతా ఓటీటీలకు అలవాటు పడిపోయారు. తమకు నచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ అయిన కొన్ని గంటల్లోనే చూసేస్తున్నారు. మరికొందరు పైరసీ కాపీలను డౌన్లోడ్ చేసి మరీ చూసేస్తున్నారు.

ఇక ఓటీటీల నిర్వాహకులు కూడా సినీ ఆడియన్స్ కు మరింత దగ్గరవుతున్నారు. పోటీపడి మరీ సినిమాలు కొనుగోలు చేస్తున్నారు. భారీ బడ్జెట్ పెట్టి మూవీలు, వెబ్ సిరీసులు తెరకెక్కిస్తున్నారు. దీంతో టీవీల్లో సినిమాలు చూసే ఆడియన్స్ తగ్గిపోయారు. ఇంకేముంది.. శాటిలైట్ రైట్స్ బిజినెస్ కూడా బాగా తగ్గిపోయింది. కొన్నేళ్లుగా తగ్గుతూ వస్తున్న శాటిలైట్ రైట్స్ డీల్స్.. ఇప్పుడు మరింత తగ్గిపోయాయి.

ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే.. ఇటీవల విడుదలైన కొన్ని తెలుగు చిత్రాల శాటిలైట్ రైట్స్ పూర్తిగా అమ్ముడుపోలేదు. బాక్సాఫీస్ వద్ద సినిమా హిట్ అయితే.. ఏదో ఒక ఛానల్ ఆ మూవీ శాటిలైట్ రైట్స్ ను కొనుగోలు చేస్తుంది. లేకుంటే ఆయా చిత్రాల హక్కులు అన్ సోల్డ్ లోనే ఉంటున్నాయి. బడా హీరోలు నటిస్తున్న భారీ మూవీల పరిస్థితి కూడా ఇదే. ప్రేక్షకుల ముందుకు వచ్చాకే ఆలోచిస్తున్నాయి టీవీ ఛానల్ యాజమాన్యాలు.

కొన్ని టీవీ ఛానళ్లు.. స్ట్రీమింగ్ అయ్యాక వచ్చే లాభాలను పంచుకునే డీల్ కోసం నిర్మాతలతో చర్చలు జరుపుతున్నాయి. వాటి వల్ల మేకర్స్ కు పెద్ద లాభం ఉండదు. దీంతో మేకర్స్ అంతా.. డిజిటల్ రైట్స్ ద్వారానే పెద్ద మొత్తాన్ని ఆర్జించాలని చూస్తున్నారట. శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోకపోయినా పర్లేదన్నట్లు ఫీల్ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది. మరి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చూడాలి.