Begin typing your search above and press return to search.

ల్యాండ్ టైటిలింగ్ చట్టం మీద విష ప్రచారం

Vicious campaign on Land Titling Act

By:  Tupaki Desk   |   6 May 2024 2:28 AM GMT
ల్యాండ్ టైటిలింగ్ చట్టం మీద విష ప్రచారం
X

ల్యాండ్ టైటిలింగ్ చట్టం మీద ఇపుడు ఏపీలో వాడిగా వేడిగా రాజకీయం సాగుతోంది. ఎన్నికలలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఏపీలో చూస్తే మరో వారంలో పోలింగ్ ఉంది. దాంతో ఈ చట్టం మీద టీడీపీ కూటమి అయితే అయిదు కోట్ల మంది ప్రజలలో భయాలు నింపుతూ నల్ల చట్టం అంటోంది. అంతే కాదు మీ భూమి మీది కాదు అని టీడీపీ అనుకూల మీడియా వార్తలు వండి వారుస్తోంది.

నిజానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఏమిటి దీని కధా కమామీషూ ఏంటి అంటే ఇది కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సిఫార్సులను పరిగణలోకి తీసుకుని తెస్తున్న అతి పెద్ద భూ సంస్కరణగా చూడాలని అంటున్నారు. దేశంలో ఏ భూమికీ కూడా ఈ రోజుకీ రికార్డులు లేవు. దీని మీద ఎవరైనా క్లెయిం చేసినా కోర్టుల చుట్టూఒ తిరగాల్సిందే. భూమి మీద అంతిమ యజమాని ఎవరు అంటే ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంది.

ఈ నేపధ్యంలో నుంచి చూసినపుడు ఈ దేశంలో భూ యాజమాన్య హక్కు చట్టం తీసుకుని రావాలని సమగ్రంగా దానిని రూపొందించాలనికూదా అంతా డిమాండ్ చేస్తూ వచ్చారు. 1989 నుంచి దేశంలో ఈ విధమైన ఆలోచనలు ఉన్నాయి. అప్పట్లో ప్లానింగ్ కమిషన్ కూడా తగిన సూచనలు చేసింది. అయితే ఎట్టకేలకు దీని మీద మోదీ ప్రభుత్వం అడుగులు వేసింది.

ఇక 2024 డిసెంబర్ నాటికి దేశంలో అన్ని రాష్ట్రాలు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయాలని డెడ్ లైన్ పెట్టి మరీ కేంద్రం అతి పెద్ద భూ సంస్కరణలను తెచ్చింది. దీని ప్రకారం చూస్తే భూమి మీద పూర్తి అంతిమ హక్కులు యజమానికి కల్పించడం వాటిని ఆన్ లైన్ ద్వారా భద్రపరచడం, ఆధార్ కార్డు మాదిరిగానే ఒక శాశ్వత నంబర్ ఇచ్చి అందులో హద్దులు సర్వే నంబర్, భూమి విస్తీర్ణం హక్కుదారుల వివరాలు నిక్షిప్తం చేయడం వంటి వాటితో ఈ చట్టాన్ని రూపొందించారు. ఇది కానీ అమలు అయితే ఎవరి భూమి ఏమిటి అన్నది తెలిసిపోతుంది.

అదే విధంగా ఈ భూమి మీద హక్కులు పూర్తిగా ఉండడమే కాకుండా అమ్ముకోవడానికి కొనడానికి స్వేచ్చగా వీలు అవుతుంది. అదే టైం లో భూమి విషయంలో ఏమైనా నష్టపోయినా బీమా సదుపాయం కూడా ఉంటుంది. ఇలా అన్నీ పక్కాగా రూపొందించి కేంద్రమే దేశవ్యాప్తంగా ఒక సంస్కరణ తేవాలని చూస్తోంది.

అయితే ఇపుడు వైసీపీ భూ రక్ష పేరుతో భూ యాజమాన్య హక్కులను వారికే ఇవ్వాలని కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఏపీలో 17 వేల రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఆరు వేల గ్రామాలలో రీ సర్వే జరిగింది. ఇదంతా పూర్తి కావడానికి మరో రెండేళ్ళు పడుతుంది. ఆ మీదట ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయం తీసుకుని చట్టం చేస్తారు.

కానీ ఇవన్నీ దాచేసి టీడీపీ కూటమి ఎన్నికల వేళ కేవలం రాజకీయ లబ్ది కోసం విష ప్రచారం చేస్తోంది అన్న విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబుతో పాటు టీడీపీ అనుకూల మీడియా అధిపతి కూడా దీని మీద తప్పుడు వార్తలు రాస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం అవుతోంది. గతంతో అదే టీడీపీ మీడియాలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం మంచిదని ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేశారు.

ఇపుడు దానికి పూర్తి ఉల్టాగా మార్చి విషం చిమ్మే కార్యక్రమం చేస్తున్నారు అని అంటున్నారు. నిజానికి చూస్తే ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ మంచిదని మేధావులు అంతా చెబుతున్నారు. ఈ చట్టం కనుక అమలు అయితే రాష్ట్రంలో ప్రజలకు భూ సమస్యలు ఉండవని భరోసా ఇస్తున్నారు.

ఇక ఏపీలోని మొత్తం రైతులకు మేలు జరుగుతుంది అంటూ గతంలో టీడీపీ అనుకూల మీడియా అధిపతి తన మీడియా చానలోనే ఒక కార్యక్రమాన్ని ఇచ్చిన సంగతిని గుర్తు చేస్తున్నారు. ఇపుడు చూస్తే ఇప్పుడు అదే పచ్చ మీడియా ల్యాండ్ టైటిలింగ్ చట్టం రించి తప్పుడు ప్రచారాలు చేయడం కంటే దారుణం అని అంటున్నారు.

దీంతో ఇక్కడే అర్థమవుతుంది దీని వెనకాల భారీ రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. ఏపీలో ఎన్నికలు సందర్భంగా ప్రజలను భయాందోళన చేయడానికి టీడీపీ దాని అనుకూల మీడియా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని ఒక అస్త్రంగా వాడుతున్నారు. కేవలం రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ చట్టం పైన ప్రజలను తప్పు దోవ పట్టించడం చాలా బాధాకరమనే మేధావులు కూదా అంటున్నారు.

ఇక ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇదంతా తప్పుడు ప్రచారం అని. మీడియా ప్రచారం పట్ల టీడీపీ చేస్తున్న ఆరోపణల పట్ల ప్రజలు చాలా అప్రమతంగా ఉంటూ విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ప్రజలు దీని మీద బాగానే అవగాహన కలిగి ఉన్నారని అంటున్నారు. దాంతో టీడీపీ అండ్ బ్యాచ్ పప్పులు ఉడికే చాన్స్ లేదని అంటున్నారు.