Begin typing your search above and press return to search.

ముంబైకి బైబై.. ఆ చాంపియన్ ప్లేయర్ కొత్త ఫ్రాంచైజీకి?

హార్దిక్ కోసం రోహిత్ శర్మను కెప్టెన్ గా తప్పించింది ముంబై. అతడి కోసం కామెరూన్ గ్రీన్ వంటి ఆల్ రౌండర్ నూ వదులుకుంది. ఈ దెబ్బ మామూలుగా పడలేదు

By:  Tupaki Desk   |   13 May 2024 2:30 PM GMT
ముంబైకి బైబై.. ఆ చాంపియన్ ప్లేయర్ కొత్త ఫ్రాంచైజీకి?
X

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 70 మ్యాచ్ ల లీగ్ దశ దాదు ముగింపునకు వచ్చింది. అహ్మదాబాద్ లో సోమవారం గుజరాత్ టైటాన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ 63వది. కోల్ కతా ఇప్పటికే పాయింట్ల పట్టికలో టాప్ లో ఉంటూ ప్లేఆఫ్స్ అర్హత కొట్టేసింది. రెండేళ్ల కిందట చాంపియన్ గా నిలిచి, నిరుడు రన్నరప్ గా మిగిలిన గుజరాత్ మాత్రం లీగ్ దశలోనే వెనుదిరగడం ఖాయమైంది. అయితే, ఒకే ఒక్క మార్పు ఈ సీజన్ లో మూడు జట్లను ప్రభావితం చేసింది. అదే గుజరాత్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కు మారడం. హార్దిక్ కోసం రోహిత్ శర్మను కెప్టెన్ గా తప్పించింది ముంబై. అతడి కోసం కామెరూన్ గ్రీన్ వంటి ఆల్ రౌండర్ నూ వదులుకుంది. ఈ దెబ్బ మామూలుగా పడలేదు.

ముంబై ఇక ఇంటికే..

ప్రస్తుత 17వ సీజన్ ను వదిలేస్తే.. 16 సీజన్లలో ఐదుసార్లు టైటిల్ కొట్టింది ముంబై. అసలు రోహిత్ శర్మ 2013లో ముంబైకి వచ్చాకనే ఆ జట్టు రాత మారిందని చెప్పాలి. కాగా, ప్రస్తుతం మాత్రం 13 మ్యాచ్ లకు గాను నాలుగే గెలిచి పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో ఉంది. ఈ సీజన్ కు ముండు రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ కెప్టెన్‌ గా తొలగించి హార్దిక్ ను నియమించింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు, కామెంటేటర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పుడే రోహిత్ ముంబైని వీడతాడని ఊహాగానాలు వచ్చాయి. ఐపీఎల్ కొత్త సీజన్ మొదలుకు ముందూ.. ముగింపు సందర్భంగానూ అదే వాదన వినిపిస్తుండడం గమనార్హం.

హార్దిక్ హ్యుమిలియేషన్

ముంబై నుంచే ఎదిగి జాతీయ జట్టుకూ ఆడిన హార్దిక్ గుజరాత్ కు వెళ్లి ఆ జట్టును చాంపియన్ గా నిలిపాడు. అయితే, కెప్టెన్ గా తిరిగొచ్చాక అతడి తీరు మాత్రం జట్టుకు సరిపడలేదు. మొదటి మ్యాచ్ లోనే రోహిత్ ను అతడు రెగ్యులర్ గా ఫీల్డింగ్ చేసే చోట కాక వేరేచోట ఉండడం విమర్శలకు తావిచ్చింది. దీంతో హార్దిక్ ను ముంబై అభిమానులు హేళన చేయసాగారు. హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ విషయంలోనూ హార్దిక్ ప్రవర్తన సరిగా లేదని.. అసలు ఆ జట్టు రెండుగా చీలిపోయిందనే కథనాలు వస్తున్నాయి.

రోహిత్ కొనసాగడం కష్టమే..?

వచ్చే సీజన్ నుంచి రోహిత్ ముంబైకి కొనసాగడం కష్టమేనని తెలుస్తోంది. మొన్న కోల్ కతాతో మ్యాచ్ కు ముందు అతడు ఈడెన్ గార్డెన్ లో ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తో రోహిత్ ముచ్చటించాడు. ఆ వీడియో బయటకు వచ్చింది. ‘‘అన్నీ మారిపోతున్నాయి. అదంతా (తనను కొనసాగించడం) వారిపైనే ఆధారపడి ఉంది. ఏదేమైనా నేను పట్టించుకోను. అది నా ఇల్లు. నేను నిర్మించిన దేవాలయం’’ అన్నట్లుగా అందులో ఉంది. దీన్నిబట్టి రోహిత్ మాట్లాడింది ముంబై జట్టు గురించేనని తెలుస్తోంది. అంతేకాదు.. ‘‘ఏదేమైనా ఇది నాకు చివరిది’’ అనడం అతడు ఇక ముంబైకి ఆడనని చెబుతున్నట్లుగా ఉంది.

మరి ఏ జట్టుకు వెళ్తాడో..?

ఒక సెంచరీ కొట్టినప్పటికీ ప్రస్తుత సీజన్ లో పెద్దగా ఫామ్ లో లేని రోహిత్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్‌ కు ముందు కూడా చర్చనీయాంశం అయ్యాడు. హిట్‌ మ్యాన్ ముంబై మేనేజ్‌మెంట్ నిర్ణయం పట్ల సంతృప్తిగా లేడని.. 2025 ఐపీఎల్ కోసం మెగా వేలంలో పాల్గొని.. ఎవరూ ఊహించని విధంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి వెళ్తాడనే ఊహాగానాలు వచ్చాయి. రోహిత్ గనుక వచ్చే ఏడాది మెగా వేలంలోకి వెళ్తే అత్యంత భారీ ధరకు ఫ్రాంచైజీలు అతడిని కొనడం ఖాయం. కెప్టెన్సీ కూడా అప్పగించడం ఇంకా ఖాయం.