Begin typing your search above and press return to search.

28 వ‌య‌సు గాయ‌కుడి దారుణ హత్య‌పై సినిమా!

ఇటీవ‌లే పంజాబీ గాయ‌కుడు సిద్ధూ మూసేవాలా హ‌త్యోదంతం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   29 March 2024 5:12 AM GMT
28 వ‌య‌సు గాయ‌కుడి దారుణ హత్య‌పై సినిమా!
X

ఇటీవ‌లే పంజాబీ గాయ‌కుడు సిద్ధూ మూసేవాలా హ‌త్యోదంతం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. ఇంత‌లోనే ఇప్పుడు 28 ఏళ్ల పంజాబీ గాయకుడు అమర్ సింగ్ చమ్కిలా హ‌త్యోదంతంపై సినిమా తెర‌కెక్కి విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ప్రఖ్యాత దర్శకుడు ఇంతియాజ్ అలీ తెర‌కెక్కించిన ఈ చిత్రం టైటిల్‌-అమర్ సింగ్ చమ్కిలా. 2022లో గాయకుడు సిద్ధూ మూస్ వాలా దిగ్భ్రాంతికర మరణం, మాఫియా ఉదంతంపై చ‌ర్చ సాగుతున్న క్ర‌మంలో 80ల‌లో మేటి గాయ‌కుడు అమ‌ర్ సింగ్ చ‌మ్కీలా ఎలా చ‌నిపోయాడు? అన్నది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

సిద్ధూ మూస్ వాలాను కాల్చి చంపడానికి దశాబ్దాల ముందు, ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా పంజాబీ హృదయాన్ని ఏలిన జానపద గాయకుడు అమర్ సింగ్ చమ్కిలా పంజాబ్‌లోని మెహసంపూర్‌లో ప్రదర్శన ఇవ్వడానికి బయలుదేరిన స‌మ‌యంలో కాల్చి (గ‌న్ షాట్) చంపబడ్డాడు. గురువారం (మార్చి 28) అమ‌ర్ సింగ్ చ‌మ్కీలా చిత్రానికి సంబంధించిన అధికారిక ట్రైలర్‌ను విడుదల చేశారు. దిల్జిత్ దోసాంజ్ - పరిణీతి చోప్రా ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన ఈ చిత్రం పంజాబీ కుర్రాడు అమర్ సింగ్ చమ్కిలా రాగ్స్-టు-రిచ్ కథను చెబుతుంది.

80ల నాటి నేపథ్యంలో, పంజాబీలు ఎక్కువగా ఇష్టపడే తన అసభ్యమైన గానం గురించి అమర్‌ని అడగడంతో ట్రైల‌ర్ ప్రారంభమైంది. క‌ట్ చేస్తే... ప్రేక్షకులకు పాట‌గాడైన‌ ఒక సాధారణ బాలుడి నేపథ్యం గురించి తెలుస్తుంది. ఈ ట్రైట‌ర్ అమర్ జీవితానికి సంబంధించిన చాలా క్లుప్త పరిచయాన్ని అందించింది. అతని భార్య అమర్‌జోత్ (పరిణీతి), అతని బ్యాండ్‌లో కలిసి ప‌ని చేసేందుకు సంతకం చేస్తుంది. అతడు అత్యంత ప్రభావవంతమైన గాయకులలో ఒకడు కావడానికి ముందు ఎలా భారీ ఎదురుదెబ్బను ఎదుర్కొన్నాడు? అన్న‌ది తెర‌పైనే చూడాలి.

అమర్ సింగ్ చమ్కిలా కుటుంబ‌ నేపథ్యం

21 జూలై 1960 న ధన్నీ రామ్‌గా అత‌డు జన్మించారు. `ఎల్విస్ ఆఫ్ పంజాబ్`గా కీర్తినందుకున్నాడు. భారతదేశంలోని పంజాబ్‌లోని లూథియానా సమీపంలోని దుగ్రి గ్రామంలో అమ‌ర్ సింగ్ జన్మించారు. అతను కర్తార్ కౌర్ -హరి సింగ్ శాండిలా దంప‌తుల‌కు చిన్న సంతానం. చిన్నప్పటి నుంచి అమర్ సింగ్ చమ్కిలాకు పాడ‌టంలో గొప్ప‌ నైపుణ్యం ఉండేది. చిన్న వయస్సులో, అతడు ఎలక్ట్రీషియన్ కావాలనుకున్నాడు. కానీ అతడు సాక్స్ తయారు చేసే గుడ్డ మిల్లులో పని చేసాడు. సంగీతంపై తనకున్న నిజమైన అంకితభావంతో చమ్కిలా చిన్న చిన్న వేదికలపై ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా మెల్లగా ప్రాంతీయ సంగీత రంగానికి వెళ్లాడు.

హార్మోనియం, ఢోల్కీ వాయించడంలో నిష్ణాతుడైన చమ్కిలా తన సంగీత వృత్తిని చాలా చిన్న వయస్సులోనే ప్రారంభించాడు. దానిని పెద్దదిగా చేయాలనే తపనతో అమర్ ఒకసారి సైకిల్‌పై పంజాబీ గాయకుడు సురీందర్ షిండాను అనుసరించాడు. 18 సంవత్సరాల వయస్సులో అతడు ప్రసిద్ధ పంజాబీ కళాకారులైన షిండా, కె. దీప్ - మహ్మద్ సాదిక్‌లతో పాడటం ప్రారంభించాడు.

మొదటి హిట్ .. సోలో కెరీర్.

ఇతర గాయకులతో క‌లిసి ప‌ని చేయ‌డం సంగ‌తి పక్కన పెడితే, అమర్ సింగ్ చమ్కిలా మొదట మహిళా గాయకురాలు సురీందర్ సోనియాతో భాగస్వామిగా క‌లిసి ప‌ని చేసారు. 80వ దశకంలో ఈ జంట కలిసి అనేక పాటలు ఆల్బమ్‌లను రికార్డ్ చేసింది. చమ్కిలా మొదటి రికార్డ్ చేసిన పాట `టాకు తే టకువా` ఇన్‌స్టంట్ హిట్. పంజాబ్ యావ‌త్తూ అత‌డికి పేరొచ్చింది.

అమ‌ర్‌సింగ్ నెమ్మ‌దిగా పంజాబ్ సరిహద్దుల్లోనే కాకుండా విదేశాలలో కూడా పాపుల‌ర‌య్యాడు. ఒకానొక స‌మ‌యంలో చమ్కిలా తన సోలో కెరీర్‌ను ఒంటరిగా కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. అతడు సొంత‌ బ్యాండ్‌ను ఏర్పాటు చేశాడు. తన కొత్త బ్యాండ్‌మేట్ గాయని, స‌హ‌చ‌రి అమర్‌జోత్ ని అతడు తరువాత వివాహం చేసుకున్నాడు.

చమ్కీలా- అమర్‌జోత్‌ల కలయిక బ్లాక్ బ‌స్ట‌ర్. వారి విలక్షణమైన గానం ఆ సమయంలో ప్రజల దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షించింది. పాటలు వారి భాగస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పంజాబీ ప్రజలను వేగంగా ఆకట్టుకుంది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నివసించే పంజాబీలలో వారి ప్రత్యక్ష ప్రదర్శనలకు ప్రజాదరణ త్వరగా పెరిగింది . వారి షోల‌కు బుకింగ్ సంఖ్యలు నెల రోజుల కంటే ఎక్కువగా ఉన్నాయని కూడా క‌థ‌నాలొచ్చాయి. గుల్జార్ సింగ్ షౌంకీ రాసిన చమ్కిలా జీవిత చరిత్ర అవాజ్ మర్ది నహిన్ ప్రకారం, చమ్కిలా 365 రోజుల్లో 366 షోలు చేసిన సమయం సంద‌ర్భం ఉంది.

చమ్కిలా పాటలు వివాదం

పంజాబీ పాప్ సంస్కృతిలో మొదటి సూపర్‌స్టార్‌గా పేరొందిన చమ్కిలా చాలా వివాదాస్పద వ్యక్తి. మాదకద్రవ్యాల వినియోగం, వివాహేతర సంబంధాలు.. పంజాబ్ లో మ‌గాళ్ల కోపం శ‌త్రుత్వం వ‌గైరా సమస్యలపై అతడి స్పష్టమైన పాటలు సమస్య‌ల్ని క్రియేట్ చేసాయి. స‌మ‌స్యాత్మకమైన సాహిత్యంతో ఎదురెళ్లిన గాయ‌కుడిగా అత‌డికి నిత్యం ఎదురుదెబ్బలను ఎదుర్కొన్నాడు.

అతని పాటల సాహిత్యం మాస్‌లో ప్రతిధ్వనించింది. అతడు పంజాబీలలో కోపానికి కార‌ణ‌మ‌య్యాడు. అతడిని చంపేస్తామంటూ బెదిరింపులు కూడా వచ్చాయి. అత‌డి విజయం ఖలిస్తానీ ఉగ్రవాదుల దృష్టిని కూడా ఆకర్షించింది. వారు డబ్బు డిమాండ్ చేసి బెదిరించారు.

హత్య ఇలా జ‌రిగింది:

8 మార్చి 1988న పంజాబ్‌లోని మెహసంపూర్‌లో చమ్కిలా తన కారులోంచి దిగినప్పుడు అతడి జీవితం విషాదకరమైన మలుపు తిరిగింది. పంజాబ్‌లోని ఉత్తమ లైవ్ స్టేజ్ పెర్ఫార్మర్‌లలో ఒకరిగా పరిగణించబడిన‌ చమ్‌కిలా 9(28), అతడి భార్య అమర్‌జోత్.. ఇద్దరు బ్యాండ్ సభ్యులు మధ్యాహ్నం 2 గంటల సమయంలో వారి వాహనంలోంచి దిగుతుండ‌గా వారిపై కాల్పులు జ‌రిగాయి. ఇప్పటికి దశాబ్దానికి పైగా గడిచినా వారి మరణాల గురించిన మిస్టరీ ఇంకా అపరిష్కృతంగానే ఉంది. ఈ కేసులో ఇంకా అరెస్టులు జరగలేదు. రహస్యం అప‌రిష్కృతంగానే ఉంది. ఈ హ‌త్య‌ల‌ చుట్టూ అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. కొందరు ఖలిస్తానీ ఉగ్రవాదులే చంపేసార‌ని అన్నారు. మరికొందరు చమ్కిలా ప్రత్యర్థులు అతన్ని కాల్చి చంపారని చెప్పారు. కానీ నిజం ఏమిటో ఇప్ప‌టికీ ఎవ‌రికీ తెలియదు. నెట్ ప్లిక్స్ ఈ గాయ‌కుడి బ‌యోపిక్ ని తెర‌కెక్కించింది.