Begin typing your search above and press return to search.

'మంజుమ్మెల్ బాయ్స్' నిర్మాతలపై చీటింగ్ కేసు

అయితే భాగస్వాముల న‌డుమ గొడ‌వ ఇప్పుడు చీటింగ్ కేసుకు దారి తీయ‌డం హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   24 April 2024 10:31 AM GMT
మంజుమ్మెల్ బాయ్స్ నిర్మాతలపై చీటింగ్ కేసు
X

ఇటీవ‌లి కాలంలో మీడియా హెడ్ లైన్స్ లో ఎక్కువ‌గా నిలిచిన పేరు 'మంజుమ్మెల్ బాయ్స్'. ట్రేడ్ వివ‌రాల‌ ప్రకారం, మంజుమ్మెల్ బాయ్స్ తమిళనాడు సహా ఇరుగు పొరుగు భాష‌ల్లో భారీ థియేట్రికల్ విజయం సాధించ‌డంతో రూ.200 కోట్లకు పైగా వసూలు చేసింది. తమ చిత్రం అద్భుతమైన విజయం సాధించి భారీ క‌లెక్ష‌న్స్ సాధించ‌డంతో టీమ్ ఆనందంగా ఉంది. అయితే భాగస్వాముల న‌డుమ గొడ‌వ ఇప్పుడు చీటింగ్ కేసుకు దారి తీయ‌డం హాట్ టాపిక్ గా మారింది. బ్లాక్‌బస్టర్ మంజుమ్మెల్ బాయ్స్ నిర్మాతలు తమ‌ వాగ్ధానానికి క‌ట్టుబ‌డ‌లేద‌ని భాగస్వామ్య ఒప్పందంలో విఫలమయ్యారనే ఫిర్యాదుపై కేరళలోని మారడు పోలీస్ స్టేష‌న్ లో వారిపై చీటింగ్‌ కేసు నమోదు చేసారు.

నిర్మాణ సంస్థ‌ పరవ ఫిల్మ్స్ నిర్మాత‌లు 40 శాతం లాభాల్లో వాటా ఇవ్వాల్సి ఉన్నా మోసం చేసార‌ని సిరాజ్ వలియతార హమీద్ ఆరోపించడంతో ఎర్నాకులం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల మేరకు ఏప్రిల్ 23న పోలీసులు కేసు నమోదు చేశారు. వాగ్ధానం ప్ర‌కారం 7 కోట్ల మేర త‌మ‌ పెట్టుబ‌డికి త‌గ్గ‌ట్టుగా లాభాల్లో వాటాలివ్వాలి.. కానీ వారు ఇవ్వ‌లేదు. దీంతో నిర్మాతల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని కోర్టు ఆదేశించింది. నటుడు-నిర్మాత పరవ ఫిల్మ్స్ భాగస్వామి సౌబిన్ షాహిర్- బాబు షాహిర్‌లను నిందితులుగా పోలీసులు ప్రవేశపెట్టారు. FIR వివ‌రాల ప్రకారం.. పరవా ఫిల్మ్స్ ... ఫిర్యాదుదారునికి రూ.22 కోట్ల నిర్మాణ వ్యయంతో కూడిన మంజుమ్మెల్ బాయ్స్ నిర్మాణంలో పెట్టుబడి పెడితే 40 శాతం లాభాల వాటాను ఆఫర్ చేసింది. తదనంతరం 30 నవంబర్ 2022న మిస్టర్ ఆంటోనీ , ఫిర్యాదుదారు మధ్య ఒప్పందం కుదిరింది.

ఆ తర్వాత ఫిర్యాదుదారుడు (భాగ‌స్వామిగా చేరిన వ్య‌క్తి) మొదట రూ.5.99 కోట్లను బ్యాంక్‌లోని కడవంత్ర బ్రాంచ్‌లో నిర్వహిస్తున్న పరవ ఫిల్మ్స్ (ఒరిజిన‌ల్ నిర్మాత‌) ఖాతాకు బదిలీ చేశాడు. ఆ తర్వాత రూ.50 లక్షలు మిస్టర్ ఆంటోని ఖాతాకు బదిలీ చేశాడు. అంతేకాకుండా కొంత‌ కాల వ్యవధిలో మరో రూ.51 లక్షలు నగదు రూపంలో నిర్మాణ సంస్థ‌కు ముట్టింది. తద్వారా ప‌ర‌వా ఫిల్మ్స్ నిర్మాత‌లు ఏకంగా రూ.7 కోట్లు అప్పుగా తీసుకున్నారు. వాగ్దానం చేసిన ప్ర‌కారం.. రూ.40 కోట్ల లాభాల వాటాతో పాటు అసలు మొత్తం చెల్లించలేదు. దీంతో ఫిర్యాదుదారుడిని ఏకంగా రూ.47 కోట్ల వరకు మోసం చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

పోలీసులు నిందితులపై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 120b (నేరపూరిత కుట్ర), 406 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన), 420 (మోసం చేయడం , నిజాయితీగా ఆస్తుల పంపిణీని ప్రేరేపించడం) 468 (మోసం చేయడం కోసం ఫోర్జరీ) .. 34 ( ఉమ్మడి ఉద్దేశం కోసం అనేక మంది వ్యక్తులు చేసిన చర్యలు) .. ప్ర‌కారం.. శిక్ష‌ను అమ‌లు చేయ‌నున్నారు.