Begin typing your search above and press return to search.

కొత్త సినిమాలు - పాత టైటిల్లు!

సినిమాకు హైప్ రావాలన్నా, అందరూ దాని గురించి మాట్లాడుకోవాలన్నా ముందుగా హెల్ప్ అయ్యేది టైటిలే.

By:  Tupaki Desk   |   24 April 2024 7:43 AM GMT
కొత్త సినిమాలు - పాత టైటిల్లు!
X

సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించడానికి, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి ఏ సినిమాకైనా ఒక మంచి 'టైటిల్' ఎంపిక చేయడం ఎంతో అవసరం. సినిమాకు హైప్ రావాలన్నా, అందరూ దాని గురించి మాట్లాడుకోవాలన్నా ముందుగా హెల్ప్ అయ్యేది టైటిలే. ఎలాంటి మూవీ అయినా జనాల్లోకి వెళ్ళేది టైటిల్ తోనే కాబట్టి, ఫిలిం మేకర్స్ ఎంతో ఆలోచించి పేర్లు ఫిక్స్ చేస్తుంటారు. సినిమా కంటెంట్‌కు అద్దం పట్టే 'క్యాచీ టైటిల్స్' రిజిస్టర్ చేయించడానికి మల్లగుల్లాలు పడుతుంటారు. దర్శక ధీరుడు రాజమౌళి 'RRR' అనే వర్కింగ్ టైటిల్ నే తన సినిమాకి 'టైటిల్' గా పెట్టారంటేనే వాటి ప్రాధాన్యత ఏంటనేది అర్థం చేసుకోవచ్చు.

ఒక్కోసారి ఎంత మంచి కంటెంట్ తో రూపొందించిన చిత్రమైనా, వందల కోట్లు ఖర్చు చేసి తీసిన సినిమా అయినా సరైన 'టైటిల్' లేకపోతే అది ఆడియన్స్ కు అంత త్వరగా రీచ్ అవ్వదు. అదే ఓ మాంచి క్యాచీ టైటిల్ పెడితే, ఆటోమేటిక్‌గా ఆ మూవీ గురించి జనాలు మాట్లాడుకుంటారు. ఇప్పుడు మన టాలీవుడ్ లో కొందరు దర్శక నిర్మాతలు తమ చిత్రాలకు అచ్చ తెలుగు పేర్లనే టైటిల్స్ గా పెడుతుంటే, మరికొందరు పాన్ ఇండియా మేకర్స్ గమ్మత్తైన ఇంగ్లీష్ టైటిల్స్ ను, తెలుగు-ఇంగ్లీష్ కలబోసిన 'టింగ్లిష్' టైటిల్స్ ను ఫిక్స్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు మేకర్స్ మాత్రం కొత్త టైటిల్స్ జోలికి వెళ్లకుండా, పాత పేర్లనే తమ సినిమాకి పెడుతూ జనాల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

లేటెస్టుగా సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న #Thalaivar171 చిత్రానికి ''కూలీ'' అనే టైటిల్ ను ఖరారు చేసారు. తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో ఒకే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ, పవర్ ఫుల్ టీజర్ ను రిలీజ్ చేసారు. అయితే ఇదే పేరుతో గతంలో అనేక సినిమాలు వచ్చాయి. 1991లో విక్టరీ వెంకటేష్ హీరోగా 'కూలీ నెం. 1' సినిమా తీస్తే, 1995లో బాలీవుడ్ హీరో గోవిందా అదే టైటిల్ తో ప్రేక్షకులను అలరించారు. వీరి కంటే ముందు అమితాబ్ బచ్చన్ హిందీలో 'కూలీ' (1983) అనే మూవీ చేసారు. ఇక చివరగా వరుణ్ ధావన్ 'కూలీ నెం. 1' అంటూ ఓ డిజాస్టర్ చిత్రాన్ని అందించారు.

లోకేష్ కనగరాజ్ ఇంతకముందు తీసిన చిత్రాలకు కూడా పాత తెలుగు సినిమా పేర్లనే పెట్టిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగార్జున డెబ్యూ మూవీ 'విక్రమ్' టైటిల్ తో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తో మూవీ చేసారు. అలానే 'ఖైదీ' 'మాస్టర్' వంటి మెగాస్టార్ చిరంజీవి టైటిల్స్ ను కార్తీ, విజయ్ సినిమాలకు పెట్టారు. ఇప్పుడు రజనీకాంత్ ను 'కూలీ'గా ప్రెజెంట్ చేస్తున్నారు. ఇందులో టాలీవుడ్ కింగ్ నాగ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ చిత్రం 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

రీసెంట్ గా ప్రియదర్శి, నభా నటేష్ కాంబినేషన్ లో 'డార్లింగ్' అనే చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇది 2010లో రెబల్ స్టార్ ప్రభాస్, కాజల్ అగర్వాల్ కలిసి నటించిన సూపర్ హిట్ మూవీ టైటిల్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే పేరుతో కన్నడలోనూ ఓ సినిమా ఉంది. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ స్వీయ నిర్మాణంలో 'డార్లింగ్స్' అనే హిందీ చిత్రం వచ్చింది. గతంలో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన 'ఆ ఒక్కటీ అడక్కు' టైటిల్ తో ఇప్పుడు ఆయన కుమారుడు అల్లరి నరేష్ హీరోగా సినిమా చేసారు. ఇది మే 3న థియేటర్లలో విడుదల కాబోతోంది.

నారా రోహిత్ హీరోగా ఈ మధ్యన 'సుందరకాండ' అనే సినిమాని ప్రకటించారు. అదే పేరుతో 1992లో తమిళ్ లో భాగ్యరాజ్ ఓ మూవీ చేస్తే, ఆ ఏడాదే దాన్ని వెంకటేశ్ హీరోగా సేమ్ టైటిల్ తో తెలుగులోకి రీమేక్ చేశారు. 2008లో బాపు దర్శకత్వంలో అల్లరి నరేష్ - ఛార్మీ కౌర్ జంటగా 'సుందరకాండ' సినిమా రూపొందింది. మే 3న రిలీజ్ కాబోతున్న 'శబరి' మూవీ పేరుతో గతంలో విజయ్ కాంత్ హీరోగా ఓ తమిళ చిత్రం ఉంది. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో 'కుబేర' మూవీ తెరకెక్కుతోంది. అయితే ఈ టైటిల్ తో 1999లో ఓ కన్నడ సినిమా వచ్చింది.

ప్రభాస్ కథానాయకుడిగా 'కల్కి 2898 AD' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫాంటసీ మూవీ త్వరలోనే విడుదల కానుంది. అయితే 2019లో డా. రాజశేఖర్ హీరోగా హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ 'కల్కి' అనే మూవీ తీశారు. ఆ ఏడాదే అదే పేరుతో టోవినో థామస్ మలయాళంలో ఓ సినిమా చేసారు. వీటి కంటే ముందు 1996లో కె. బాలచందర్ డైరెక్షన్ లో 'కల్కి' చిత్రం వచ్చింది. 'టెనెంట్' 'తంత్ర' పేర్లతో గతంలో ఇతర భాషల్లో కొన్ని చిత్రాలు వచ్చాయి. అడవి శేష్ చేసిన 'గూఢచారి' టైటిల్ తో కూడా అనేక చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు దానికి సీక్వెల్ గా 'గూఢచారి 2' రానుంది.

దళపతి విజయ్, డైరెక్టర్ వెంకట్ ప్రభు కాంబోలో 'గోట్' (GOAT - Greatest Of All Time) అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోంది. అదే పేరుతో సుడిగాలి సుధీర్, దివ్య భారతి జంటగా ఓ సినిమా రూపొందుతోంది. 2016 లో ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్ 'GOAT' అనే హాలీవుడ్ మూవీలో నటించాడు. అజయ్ దేవగన్ హిందీలో 'భగత్ సింగ్' బయోపిక్ లో నటించగా.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా చేస్తున్నారు. అఖిల్ నెక్స్ట్ మూవీకి 'ధీర' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఆ పేరుతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. చిరంజీవి వాయిస్ ఓవర్ తో 'హనుమాన్' అనే కార్టూన్ సినిమా రాగా, అదే టైటిల్ తో ప్రశాంత్ వర్మ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. దీనికి సీక్వెల్ గా 'జై హనుమాన్' మూవీ చేస్తున్నారు.