Begin typing your search above and press return to search.

టెన్షన్ తో అనారోగ్యమైతే క్లెయిమ్ కు నో.. హెచ్ డీఎఫ్ సీ షాక్!

టెన్షన్ తో అనారోగ్యానికి గురైతే తాము క్లెయిమ్ ఇవ్వలేమంటూ చెప్పిన తీరును ఆమె ప్రశ్నించటంతో సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్టుపై పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది.

By:  Tupaki Desk   |   24 April 2024 4:24 AM GMT
టెన్షన్ తో అనారోగ్యమైతే క్లెయిమ్ కు నో.. హెచ్ డీఎఫ్ సీ షాక్!
X

వైద్యం ఖరీదు కావటంతో.. డబ్బులు ఉన్నా లేకున్నా.. హెల్త్ పాలసీలు తీసుకుంటున్న పరిస్థితి. అనారోగ్యమైతే చాలు రూ.లక్షలు ఖర్చు అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ముందస్తు జాగ్రత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ లు కడుతుంటారు.సదరు బీమా కంపెనీలు సైతం ఇదే తరహాలో వాణిజ్య ప్రకటనలు ఇస్తుంటాయి. తాజాగా ఒక మాజీ జర్నలిస్టుకు షాకింగ్ అనుభవం ఎదురైంది. దీనికి కారణంగా ప్రముఖ బీమా సంస్థగా పేరున్న హెచ్ డీఎఫ్ సీ ఈఆర్ జీవో (HDFC ERGO) తీరే. టెన్షన్ తో అనారోగ్యానికి గురైతే తాము క్లెయిమ్ ఇవ్వలేమంటూ చెప్పిన తీరును ఆమె ప్రశ్నించటంతో సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్టుపై పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. అసలేం జరిగిందంటే?

అనారోగ్యానికి గురైన మాజీ జర్నలిస్టు ప్రీతి బోబే ఏప్రిల్ 21న ఇంట్లో కళ్లు తిరిగి.. స్ప్రహ కోల్పోయిన ఉదంతంలో ఆమెను ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆమెకు ఐసీయూలో గుండెకు సంబంధిత చికిత్సను అందించారు. ఆమెకు HDFC ERGOలో హెల్త్ పాలసీ ఉంది. దీంతో.. క్లెయిమ్ కోసం ఆమె పెట్టారు. ఇందుకు సదరు బీమా సంస్థ క్లెయిమ్ ను రిజెక్టు చేసింది. దీనికి కారణం తెలుసా? ఆమె టెన్షన్ కు గురయ్యారని.. టెన్షన్ కారణంగా అనారోగ్యానికి గురైతే..హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించదని స్పష్టం చేయటంతో అవాక్కు అయ్యారు.

ఈ నేపథ్యంలో ఆమె తనకు ఎదురైన షాకింగ్ అనుభవాన్ని ఎక్స్ లో పోస్టు చేశారు. దీనిపై దాదాపు 15 లక్షలకు పైగా నెటిజన్లు స్పందించారు. హెచ్ డీఎఫ్ సీ తీరును తీవ్రంగా తప్పు పట్టటమే కాదు.. తిట్టి పోశారు. టెన్షన్ కారణంగా అనారోగ్యానికి గురైతే.. క్లెయిం ఇవ్వమని ముందే చెప్పాలని మండిపడుతున్నారు. అయినా.. ఇవాల్టి పరిస్థితుల్లో అన్ని రోగాలకు మూలం టెన్షన్ గా వైద్య నిపుణులు చెబుతుంటే.. హెచ్ డీఎఫ్ సీ ఇలా స్పందించటం ఏమిటి? అంటూ ప్రశ్నిస్తున్నారు. హెచ్ డీఎఫ్ సీ తీరును తీవ్రస్థాయిలో తప్పు పడుతున్నారు. ఒకవేళ.. ఒత్తిడి కారణంగా అనారోగ్యానికి గురైతే.. క్లెయిం ఇవ్వమన్నది సదరు సంస్థ పాలసీ అయితే.. ఆ విషయాన్ని ఓపెన్ గా చెబితే.. తమ నిర్ణయాన్ని తాము తీసుకుంటామని డిమాండ్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెగిటివిటీ వస్తున్న వేళ.. హెచ్ డీఎఫ్ సీ స్పందించింది. ప్రీతికి ఇలా జరగటం బాధాకరమని.. పాలసీ నెంబర్ ను వ్యక్తిగతంగా తమ సిబ్బందికి ఇవ్వాలని పేర్కొంది. కొసమెరుపు ఏమంటే.. 2022, 2023 సంవత్సరాల్లో హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ లో టాప్ 5లో ఉన్న కంపెనీల్లో HDFC ERGO ఒకటంటూ దానికి అవార్డు కూడా ఇచ్చారు. అలాంటి కంపెనీ ట్రాక్ ఈ రీతిలో ఉండటం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.