Begin typing your search above and press return to search.

ఏంది బాసూ.. బుట్టా రేణుక ఆస్తులు ఇన్నా?

దీనికి కారణం లేకపోలేదు. బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనంటూ చేస్తున్న ప్రచారానికి భిన్నంగా ఆమె ఆస్తులు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   19 April 2024 4:34 AM GMT
ఏంది బాసూ.. బుట్టా రేణుక ఆస్తులు ఇన్నా?
X

మరోసారి వార్తల్లోకి వచ్చారు బుట్టా రేణుక. ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుంచి అధికార వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఆమె.. తాజాగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తిపాస్తుల వివరాల్ని తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో పేర్కొన్న అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. అందరూ ఆమె ఆస్తుల గురించి మాట్లాడుకునేలా మారింది.

దీనికి కారణం లేకపోలేదు. బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనంటూ చేస్తున్న ప్రచారానికి భిన్నంగా ఆమె ఆస్తులు ఉన్నాయి. ఆమె పేదరాలు అన్నట్లుగా ఇచ్చే బిల్డప్పుల్లో ఏ మాత్రం నిజం లేదన్నది అఫిడవిట్ లో పేర్కొన్న లెక్కలు స్పష్టం చేస్తున్న పరిస్థితి. నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం చూస్తే.. బుట్టా రేణుక.. ఆమె భర్త శివ నీలకంఠ పేరుతో ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ.161.21 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో స్థిరాస్తులు రూ.18.75 కోట్లు ఉంటే.. చరాస్తులు రూ.142.46 కోట్లుగా పేర్కొన్నారు. అప్పులు రూ.7.82 కోట్లు.

కాకుంటే.. 2014లో ఆమె పేర్కొన్న ఆస్తులతో పోలిస్తే.. తాజా ఆస్తులు తగ్గినట్లుగా కనిపిస్తోంది. అయితే.. ఆమె పేర్కొన్న ఆస్తుల విలువ మొత్తం అధికారిక లెక్కలు కావటంతో.. మార్కెట్ విలువలు మరింత ఎక్కువగానే ఉంటాయని చెబుతున్నారు. 2014లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం చూస్తే.. మొత్తం ఆస్తులు రూ.242.6 కోట్లు అయితే.. తాజాగా ఆస్తులు రూ.161.21 కోట్లు.

ఐటీ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు రేణుకపై హైదరాబాద్ లో ఆర్థిక నేరాల న్యాయస్థానంలో మూడు కేసులు విచారణలో ఉన్నాయి. కర్నూలులో ఒక కేసు నడుస్తోంది. హైదరాబాద్ లోని మాదాపూర్.. ఇజ్జత్ నగర్ లో ఫ్లాట్లు.. బిల్డింగులు ఉన్నాయి. 2.3కేజీల బంగారం.. వజ్రాహారాలు.. విలువైన రాళ్లతో కూడిన ఆభరణాల మొత్తం విలువ రూ.2.5 కోట్లు కాగా.. రేణుక భర్త పేరుతో 435 గ్రాముల బంగారం ఉంది.

బుట్టా దంపతులకు తేజస్వి జ్యువెలర్స్ లో రూ.11.10కోట్లు.. తేజస్వి మోటార్స్ లో రూ.24 కోట్లు.. బుట్టా హాస్పిటాలిటీ ప్రైవేటు లిమిటెడ్ లో రూ.17.46 కోట్లు.. బుట్టా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ లో రూ.59.68 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. ఆటోమొబైల్స్.. హోటళ్లు.. విద్యా సంస్థలతో పాటు.. హోండా.. టాటా మోటార్స్ వాహనాల డీలర్ షిప్ లు ఉన్నాయి. హైదరాబాద్ లో బుట్టా కన్వెన్షన్ హాలు నడుపుతున్న విషయం అందరికి తెలిసిందే.