Begin typing your search above and press return to search.

రుణమాఫీ : బస్తీమే సవాల్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు.

By:  Tupaki Desk   |   24 April 2024 11:18 AM GMT
రుణమాఫీ : బస్తీమే సవాల్
X

తెలంగాణలో రైతుల రుణమాఫీ వ్యవహారం సవాళ్లు, ప్రతి సవాళ్లకు తెరలేపింది. ఏకంగా రాజీనామాలు, పార్టీలు రద్దు చేయాలన్న డిమాండ్ వరకు వెళ్లింది. పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలుపు అనివార్యమైన నేపథ్యంలో ఆగస్ట్ 15 లోపు రైతుల 2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని, రుణాలు, రుణాలు మాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటారా ? అని ముఖ్యమంత్రి రేవంత్ రెండు రోజులుగా సవాల్ విసురుతున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ముఖ్యమంత్రి సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని, ఆగస్ట్ 15 లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేయకుంటే తన పదవికి రాజీనామా చేస్తాడా ? అని హరీష్ రావు ప్రశ్నించాడు.

హరీష్ రావు సవాల్‌పై రేవంత్ స్పందించాడు. తాను ఈ సవాల్‌ను స్వీకరిస్తున్నానని, రుణమాఫీ చేయకుంటే తాను రాజీనామా చేస్తానని, మరి హామీని అమలు చేస్తే హరీశ్ రావు పార్టీని మూసేసుకుంటారా? అని ప్రతి సవాల్ చేశారు. రేవంత్ సమాధానంపై ఈరోజు హరీశ్ రావు స్పందించారు.

‘’ఇచ్చిన హామీలను అధికార పార్టీ చేత అమలు చేయించే బాధ్యత ప్రతిపక్షంగా తమపై ఉందని, శుక్రవారం అసెంబ్లీ ఎదుట ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు వస్తానని, రేవంత్ రెడ్డి కూడా అక్కడకు వచ్చి ఆగస్ట్ 15 లోగా రుణమాఫీని పూర్తిగా చేస్తానని ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ తన హామీని నిలబెట్టుకుంటే తాను సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, తిరిగి ఉపఎన్నికల్లోనూ తాను పోటీ చేయనని అన్నాడు. రుణమాఫీ చేయకుంటే ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఇచ్చిన హామీలు అమలు చేయమంటే కాంగ్రెస్ నేతలు పార్టీలు రద్దు చేసుకుంటారా అని అంటున్నారని, డిసెంబర్ 9లోగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఆ తర్వాత మాట తప్పిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి 120 రోజులైనా గ్యారంటీల అమలు ఏమయిందని ప్రశ్నించారు. రూ.15000 రైతుభరోసా, మహిళలకు రూ.2500 భృతి, నిరుద్యోగ భృతి ఏమయిందని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత ఈ సవాళ్లపై ఎవరు మాట మీద నిలబడతారో వేచిచూడాలి.