Begin typing your search above and press return to search.

చంద్రబాబు హామీలు మరీ ఇంత పేలవంగానా...!?

ఏపీ రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ లీడర్ చంద్రబాబు. ముమ్మారు సీఎంగా ఉన్నారు.

By:  Tupaki Desk   |   28 March 2024 9:30 AM GMT
చంద్రబాబు హామీలు మరీ ఇంత పేలవంగానా...!?
X

ఏపీ రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ లీడర్ చంద్రబాబు. ముమ్మారు సీఎంగా ఉన్నారు. మరో మూడు సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ గా పేరు గడించారు. అలాంటి చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలలో ఇస్తున్న హామీలు చూస్తే మరీ పేలవంగా ఉంటున్నాయని అంటున్నారు.

స్వర్గీయ ఎన్టీఆర్ ది సంపూర్ణ మద్య పాన నిషేధం నినాదం. ఆయన 1995లో అధికారంలోకి వచ్చినపుడు దానిని అమలు చేసి చూపించారు. ఆ తరువాత సీఎం అయిన బాబు దశల వారీగా నిషేధం అమలు చేస్తామని అంటూనే మొత్తానికి గేట్లు తెరిచారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఆఖరుకు బెల్ట్ షాపులు కూడా బాబు హయాంలో ఎక్కువ అయ్యాయని విమర్శలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే వైసీపీ దశల వారీగా సంపూర్ణ మద్య పాన నిషేధం హామీతో ఏపీలో ఎన్నికలను 2019లో ఫేస్ చేసింది. అధికారంలోకి వచ్చి అయిదేళ్ళు గడచింది కానీ అమలు చేయలేదు. అయితే వైసీపీ ప్రభుత్వం మీద చేసే అనేక ఆరోపణలలో భాగంగా నాణ్యత లేని మద్యం సరఫరా చేస్తున్నారు అని కూడా విపక్షాలు విమర్శలు చేస్తాయి. అలాగే చెత్త బ్రాండ్లు ఏపీలో ఉన్నాయని చెబుతారు

ఇక మద్యం ధరలు ఆకాశాన్ని అంటాయని చెబుతారు. చంద్రబాబు పవన్ బీజేపీ ఏపీ నేతలు ఇవే ఆరోపణలు తరచూ చేస్తూ వస్తున్నారు. అయితే వీటినే ఎన్నికల హామీలుగా చంద్రబాబు మర్చుకోవడం చిత్రంగా ఉందని అంటున్నారు. ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనలో పలు సభలలో మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు సరఫరా చేస్తామని హామీ ఇచ్చేశారు.

దీని మీద సెటైర్లు పడుతున్నాయి. ఏడున్నర పదుల వయసులో ఉన్న నేత సీనియర్ నాయకుడు అయిన బాబు ఇలాంటి హామీలు ఇవ్వడమేంటి అని అంటున్నారు. మద్యం నాణ్యతతో సరఫరా చేయడమేంటి అది ఒక చెడు వ్యసనం, దాన్ని దశల వారీగా రద్దు చేస్తామని చెబితే బాబు విలువ పెరిగేది అని అంటున్నారు. అంతే కాదు మద్యం ధరలను తగ్గించే బదులు నిత్యావసర ధరలు తగ్గిస్తామని బాబు హామీ ఇస్తే మొత్తం ఓటర్లు అంతా ఆలోచించే అవకాశం ఉంది అని అంటున్నారు.

జగన్ హయాంలో ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయని చెబుతున్న బాబు తాము వస్తే వాటిని ఆకాశం మీద నుంచి దించుతామని చెప్పడం లేదు అంటున్నారు. దానికి కారణం ధరలు దేశమంతా పెరిగాయి. పెరగడం వాటి సహజ లక్షణం. అందుకే దాన్ని విమర్శలకే పరిమితం చేశారు అంటున్నారు. అన్నా క్యాంటీన్లు తెరిపిస్తాం అక్కడ అయిదు రూపాయలే భోజనం అని బాబు మరో హామీ ఇస్తున్నారు. అయిదేళ్ళ క్రితం ఈ హామీని కొన్ని నెలల పాటు టీడీపీ నెరవేర్చింది. అసలు ఈ హామీ ఇచ్చింది 2014లో. అంటే ఇపుడు పదేళ్లు అయింది.

ఇప్పటికి కూడా అయిదు రూపాయలకు భోజనం అంటే ఇంతకంటే దివాళాకోరు పధకం ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున తాగే టీ కూడా పది రూపాయలుగా ఉంది. మరి పేదలకు మంచి భోజనం తక్కువ ధరకు ఇవ్వాలనుకుంటే కనీసం పాతిక రూపాయలు అయినా ధర పెడితే బాబు సంక్షేమ పధకం బాగుంది అని అంటారు.

అసలు దాని కంటే ముందు రేషన్ ద్వారా ఇచ్చే బియ్యాన్ని నాణ్యమైనది ఇస్తామని ధర పాతిక రూపాయలు కిలో అంటే బాబు వైపు మధ్యతరగతి పేద వర్గాలు చూసేవారు అని అంటున్నారు. ఈ అన్నా క్యాంటీన్లు పెట్టడం కూడా అవసరం ఉండదని అంటున్నారు.

ఇరవై వేల ఉద్యోగాలు ఇస్తామని బాబు చెబుతున్నారు. అది బాగానే ఉంది కానీ ప్రభుత్వ రంగంలో అని మాత్రం అనడం లేదు అని నిరుద్యోగులలో చర్చ సాగుతోంది. ప్రైవేట్ ఉద్యోగాలకు పార్టీల హామీలు ఎందుకు అని అంటున్నారు. ఇలాగే ఆర్టీసీ బస్సులలో ఫ్రీ అని బాబు పార్టీ మరో హమీ ఉంది. ఇది కూడా దండుగ మారిదే అంటున్నారు. పైగా ఆటో డ్రైవర్లు ఉపాధికి గండి కొట్టేది అంటున్నారు. ఆర్టీసీ ఆదాయానికి కొంప ముంచేది అని అంటున్నారు.

యాభై ఏళ్ళకే పెన్షన్ అంటున్నారు చంద్రబాబు. అది అవసరమా అని మరో ప్రశ్న వస్తోంది. కాళ్ళూ చేతులూ లేని వారికి ఇస్తే ఓకే కానీ అన్నీ బాగున్న వారిని యాభై ఏళ్ళకే ఇంట్లో కూర్చోబెట్టి పెన్షన్ ఇవ్వడం వల్ల సోమరి పోతులను చేయడమే అంటున్నారు. మరో వైపు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు అరవై రెండేళ్ళుగా ఉంది. అంతవరకూ వారే పనిచేస్తున్నపుడు పని చూపించాలి కానీ పెన్షన్ అంటూ పోషించడం ఖజానాకు భారం తప్ప మరేమీ కాదు అని అంటున్నారు.

ఇలా ఉచిత పధకాలతో అప్పుల కుప్పగా ఏపీ శ్రీలంకగా మారదా అని కూడా మేధావులు అంటున్నారు. వీటన్నిటికంటే బాబు బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి కేంద్రంతో మాట్లాడి ఏపీకి అప్పులు కాకుండా స్పెషల్ గ్రాంట్స్ వచ్చేలా చూస్తాను తొందరగా కేంద్ర నిధులతో పోలవరం పూర్తి అయ్యేలా చేస్తాను, రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం కోరుతామని చెబితే ఆయన అనుభవానికి గీటురాయిగా ఉండేదని అంటున్నారు.

అదే విధంగా ప్రత్యేక హోదా గురించి పోరాడుతామని మాట వరసకు అయినా బాబు అనకపోవడం పట్ల కూడా విమర్శలు వస్తున్నాయి. కేంద్రంలో ప్రభుత్వం బీజేపీదే మళ్లీ వస్తుందని చెబుతున్న బాబు విభజన హామీలు రానున్న రోజులలో నూరు శాతం అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెబితే హుందాగా ఉండేదని అంటున్నారు.

అసలు ఉచిత హామీలు బాబు వంటి సీనియర్ నేత ఇవ్వకూడదనే అంటున్నారు. ఏపీ మూడు దశాబ్దాల వెనక్కి పోయింది చీకటి రాష్ట్రం అయింది అని ఒక వైపు చెబుతూ అదే నోటితో ఇష్టం వచ్చినట్లుగా ఉచిత హామీలు గుప్పిస్తే జనాలు నమ్ముతారా బాబూ అని అడుగుతున్న వారూ ఉన్నారు.