Begin typing your search above and press return to search.

కొత్త మార్పు: తొలిసారి రేవంత్ హైలెట్ మిగిలినోళ్లంతా ఒక్కటే

పెద్దపెద్ద చర్చలు జరగవు. ఆ మాటకు వస్తే కొన్ని అంశాల్ని ప్రజల వరకు వెళ్లవు కూడా.

By:  Tupaki Desk   |   9 May 2024 5:30 AM GMT
కొత్త మార్పు: తొలిసారి రేవంత్ హైలెట్ మిగిలినోళ్లంతా ఒక్కటే
X

పెద్దపెద్ద చర్చలు జరగవు. ఆ మాటకు వస్తే కొన్ని అంశాల్ని ప్రజల వరకు వెళ్లవు కూడా. కానీ.. అలాంటి కొన్ని అంశాలు లోలోన పెద్ద చర్చకు .. కొత్త పరిణామాలకు కారణంగా మారుతుంటాయి. తాజాగా అలాంటి పరిణామమే తెలంగాణ రాష్ట్ర అధికార పక్షమైన కాంగ్రెస్ లో చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత రేవంత్ అధిక్యతను ప్రశ్నించిన కొందరి ఉత్సాహానికి అధినాయకత్వం పుణ్యమా అని తగ్గటం.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం తెలిసిందే. మిగిలిన పార్టీలకు భిన్నంగా అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ పార్టీలోని నేతలంతాఎవరికి వారు తోపులన్నట్లుగా వ్యవహరించటం తెలిసిందే.


చేతిలో అధికారం ఉన్నప్పుడు ప్రతి ఒక్క నేత చెలరేగిపోవటం కాంగ్రెస్ కు అలవాటే. రేవంత్ రెడ్డి సర్కారు సైతం ఇందుకు మినహాయింపు కాదు. రేవంత్ ముఖ్యమంత్రిగా ఫిట్ అన్న విషయంపై ఎవరికి ఎలాంటి సందేహాలు లేనప్పటికీ.. తమకు అవకాశం దక్కితే ఎంత బాగుండన్న భావన లోలోన ఉన్న వారు దాదాపు ఐదారుగురు వరకు ఉండటం తెలిసిందే. అలా అని బాహాటంగా తమ అభిప్రాయాన్ని చెప్పటం కనిపించదు కానీ.. ఛాన్సు దక్కాలే కానీ.. ఆ సందర్భాన్ని సద్వినియోగం చేయటం కనిపిస్తూ ఉంటుంది. దీనికి ఉదాహరణగా ఒక రోజు క్రితం జరిగిన ప్రస్తావనను

మంగళవారం పలు దినపత్రికల్లో కాంగ్రెస్ పార్టీ ఫుల్ పేజీ యాడ్ ఇచ్చింది. రేవంత్ సర్కారు కొలువు తీరిన తర్వాత ప్రభుత్వం కానీ పార్టీ ఇచ్చే ప్రకటనల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెద్దదిగా ఉండటం.. దానికి ఎదురుగా ఉప ముఖ్యమంత్రి భట్టి ఫోటో కాస్త తక్కువగా ఉన్నా.. సమ ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవటం తెలిసిందే. కట్ చేస్తే.. తాజాగా (మంగళవారం) ప్రముఖ దినపత్రికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున యాడ్స్ ఇచ్చింది. మొదటి పేజీ మొత్తంలో పార్టీ ఇచ్చే హామీల్ని ప్రస్తావించటం.. ఆ ప్రకటనలో ముఖ్యమంత్రి రేవంత్ ఫోటో ఉండటంలో పెద్ద ఆశ్చర్యం లేదు కానీ.. దాని ఎదురుగా ఎప్పుడూ ఉండేలా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫోటో లేకపోవటం షాకింగా మారింది.

భట్టికి బదులుగా మరో మంత్రి పొంగులేటి ఫోటో ప్రాధాన్యంగా పబ్లిష్ కావటం పలువురినిఆశ్చర్యానికి గురి చేసింది. అధికార కాంగ్రెస్ లో ఈ వ్యవహారం నేతల మధ్య కొత్త వాదనకు తెర తీసింది. కాంగ్రెస్ లోని అధిపత్య పోరులో కొత్త ఎపిసోడ్ షురూ అయినట్లుగా చర్చ జరిగింది. ఈ విషయంపై ముఖ్యమంత్రి సీరియస్ కావటమే కాదు.. ఎవరికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మరో ఫుల్ పేజీ యాడ్ ను ఈ రోజు ఇచ్చారు. ఈ రోజు ఇచ్చిన యాడ్ లో.. ‘‘మార్పు మొదలైంది.. ప్రజాపాలన వచ్చింది..’’ అన్న పేరుతో ఉన్న ప్రకటనను పబ్లిష్ చేశారు.

ఆసక్తికరమైన అంశం ఏమంటే.. తాజా యాడ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మినహా మిగిలిన ముఖ్యనేతలందరి ఫోటోలు ఒకే సైజులో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదంతా చూస్తే.. మంగళవారం నాటి ప్రకటనలో పొంగులేటికి ఇచ్చిన ప్రాధాన్యతను ఇవ్వటం.. దాని కారణంగా జరిగిన రచ్చను రెండో రోజుకే సెట్ చేయటం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ జోక్యం ఉందంటున్నారు. కీలకమైన ఎన్నికల వేళ.. ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాన్ని స్పష్టం చేయటంతో పాటు.. తప్పులకు అవకాశం ఇవ్వొద్దని సీరియస్ గా ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. ఇదేదో ముందు నుంచి ఉండి ఉంటే.. ఇప్పటికి జరిగిన డ్యామేజ్ జరిగి ఉండేది కాదు కదా? అన్న మాట వినిపిస్తోంది.