Begin typing your search above and press return to search.

సొంత కారు లేని మాజీ సీఎం కొడుకు.. ఆస్తి రూ. 700 కోట్లు!

ఈ క్రమంలో ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు అఫిడవిట్ ఆసక్తికరంగా మారింది!

By:  Tupaki Desk   |   29 March 2024 4:28 AM GMT
సొంత కారు లేని మాజీ సీఎం కొడుకు.. ఆస్తి రూ. 700 కోట్లు!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులు దాఖలు చేసే అఫిడవిట్ లలో ఆస్తుల వివరాలు వెల్లడించే సమయంలో ఆసక్తికరమైన విషయాలు తెరపైకి వస్తుంటాయి. తన భార్య వందల కోట్లలో చూపిస్తూ.. తనకు రెండు మూడు లక్షల అప్పు ఉందని చూపించడం... వందల కోట్ల అస్తులు ఉన్నా సొంత వాహనం లేదని చెప్పడం... ఇలా రకరకాల సంఘటనలు తెరపైకి వస్తుంటాయి. ఈ క్రమంలో ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు అఫిడవిట్ ఆసక్తికరంగా మారింది!

ఈ క్రమంలో తాజాగా 700 కోట్ల రూపాయల ఆస్తి ఉండి.. సొంత వాహనం లేని మాజీ ముఖ్యమంత్రి కుమారుడి వ్యవహారం తాజాగా తెరపైకి వచ్చింది. అవును... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమరుడు నకుల్ నాథ్.. లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. చింద్వాడా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీచేస్తున్న ఆయన... ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ సమర్పించారు.

ఇందులో భాగంగా తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఈ క్రమంలో తన మొత్తం ఆసుల విలువ సుమారు రూ.700 కోట్లు ఉంటుందని ప్రకటించారు. అయితే తనకు సొంత వాహనం లేదని చెప్పడం గమనార్హం! దీంతో ఈ వ్యవహారంపై ఆసక్తికరమైన చర్చ ఆన్ లైన్ వేదికగా మొదలైపోయింది. ఈ సమయంలో ఆయన సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్న ఆస్తుల వివరాలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం...!

2022-23 ఆర్థిక సంవత్సరంలో తాను రూ. 7.89 కోట్లు, తన భార్య రూ.4.39 కోట్లు సంపాదించినట్లు పేర్కొన్న ఆయన... గత ఐదేళ్ల కాలంలో తన ఆస్తులు సుమారు రూ.40 కోట్లు పెరిగినట్లు పేర్కొన్నారు. ఇక తమవద్ద ఉన్న నగదు, షేర్లు, బాండ్లు వంటి చరాస్తుల విలువ రూ. 641 కోట్లు కాగా.. స్థిరాస్తుల విలువ రూ.48.07 కోట్లు అని వెల్లడించారు. ఇదే క్రమంలో... తన చేతిలో రూ.44.97 లక్షల నగదు ఉండగా.. తన భార్య వద్ద రూ.43 వేలు ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి అయిన తన తండ్రి కమల్ నాథ్ కు రూ. 12 లక్షల అప్పు ఇచ్చినట్లు అఫిడవిట్ లో పేర్కొన్న నకుల్ నాథ్... తన వద్ద 147.58 క్యారెట్ల డైమండ్లు, స్టోన్స్ తో పాటు 1896 గ్రాముల గోల్డ్ బార్ లు, నగలు, 7.630 కిలోల వెండి ఆభరణాలు ఉన్నట్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.2.2 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో... తన భార్య వద్ద 881.31 క్యారెట్ డైమండ్లు, స్టోన్స్ ఉండగా.. వాటి విలువ రూ.2.75 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.

మరోవైపు... గత లోక్ సభ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ లో తనకు రు.660 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు నకుల్ నాథ్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా... మధ్యప్రదేశ్ లో మొత్తం 29 లోక్ సభ స్థానాలకూ నాలుగు విడతల్లో ఎన్నికలు జరగనుండగా... ఏప్రిల్ 19న తొలివిడత పోలింగ్ జరగనుంది!