Begin typing your search above and press return to search.

టెన్షన్ లో యూపీ.. 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గ్యాంగ్ స్టర్ జైల్లో మృతి

ఈ నేపథ్యంలో యూపీలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

By:  Tupaki Desk   |   29 March 2024 6:52 AM GMT
టెన్షన్ లో యూపీ.. 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గ్యాంగ్ స్టర్ జైల్లో మృతి
X

అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. తిరుగులేని అధిక్యతను ప్రదర్శిస్తూ.. తనకు ఎదురు ఉండే వారే లేరన్నట్లుగా వ్యవహరించే కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ కం వివాదాస్పద యూపీ రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ జైల్లో మృతి చెందారు. అనారోగ్యంతో ఆయన మరణించినట్లుగా పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో యూపీలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో 144 సెక్షన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన అన్సారీ బీజేపీ ఎమ్మెల్యే హత్య కేసులో పదేళ్ల జైలుశిక్ష ను అనుభవిస్తున్నాడు. జైల్లో అనారోగ్యానికి గురైన అతను.. తాజాగా వాంతులు చేసుకొని మరణించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల తన సోదరుడ్ని జైల్లో చంపేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లుగా అన్సారీ సోదరుడు ఆరోపించారు. ఇదిలా ఉంటే.. జైలు అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం యూపీలోని బాందా జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్సారీ గురువారం రాత్రి 8.25 గంటల వేళలో ఒక్కసారి తీవ్ర అస్వస్థతకుగురయ్యారని.. వాంతులు చేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లుగా పేర్కొన్నారు. దీంతో ఆయన్ను జైలుకు సమీపంలోని దుర్గావతి మెడికల్ కాలేజీకి తరలించారని.. వెవెంటనే వైద్యులు చికిత్స షురూ చేసినప్పటికీ ప్రాణాలుకాపాడలేకపోయినట్లుగా పేర్కొన్నారు.

2005 నుంచి జైల్లో ఉన్న ఆయనపై తీవ్రమైన నేరాలు బోలెడన్ని ఉన్నాయి. ఆయన మరణం నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు వీలుగా 144 సెక్షన్ ను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బాందా.. మౌ.. ఘాజీపుర్.. వారణాసి జిల్లాల్లో అదనపు పోలీసు బలగాలతో పాటు.. సెంట్రల్ రిజర్వ్ బలగాలను మోహరించినట్లుగా ఉత్తరప్రదేశ్ డీజీపీ ప్రశాంత్ కుమార్ వెల్లడించారు.

అన్సారీ విషయానికి వస్తే.. మొత్తం 61 కేసులు నమోదయ్యాయి. ఇందులో 15 హత్య కేసులు ఉండటం గమనార్హం. 1980ల్లో గ్యాంగుల్లో సభ్యుడిగా చేరిన అతను 1990 నాటికి గ్యాంగ్ స్టర్ అయ్యాడు. మౌ.. ఘాజీపూర్.. వారణాసి ప్రాంతాల్లో ఈ గ్యాంగ్ దోపిడీ.. కిడ్నాప్ లకు పాల్పడేవారు. 2004లో అన్సారీ వద్ద మెషీన్ గన్ ను గుర్తించారు. దీంతో ఆయన్ను ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. బీజేపీ ఎమ్మెల్యే క్రిష్ణానంద్ రాయ్ హత్య కేసులో గత ఏడాది ఏప్రిల్ లో ఆయనకు పదేళ్లు జైలు విధిస్తూ కోర్టు తీర్పును ఇచ్చింది.

ఇదిలా ఉంటే మరో పాత కేసు (నకిలీ పిస్టల్ కలిగి ఉన్నారన్న కేసు 1990లో నమోదైంది)లో ఆయనకు కోర్టు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. రెండుసార్లు బీఎస్పీ తరఫున ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే తన సోదరుడ్ని చంపేయటానికి జైల్లో విషాహారం ఇచ్చినట్లుగా ఆయన సోదరుడు కం ఘాజీపూర్ ఎంపీగా వ్యవహరిస్తున్న అఫ్జల్ అన్సారీ ఆరోపించారు. అయితే.. కాలు జారి బాత్రూంలో పడిపోవటంతో ఆయన అస్వస్థతకు గురయ్యారని జైలు అధికారులు చెబుతున్నారు. దీంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఈ మధ్యనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన కొద్ది రోజులకే ప్రాణాలు విడవటంపై పలు విమర్శలు వస్తున్నాయి.