Begin typing your search above and press return to search.

తాజా రిపోర్టు; ఆఫీస్ స్పేస్ లీజులోనూ హైదరాబాద్ టాప్!

దేశ వ్యాప్తంగా మొత్తం ఆఫీసు స్థలం అద్దె లావాదేవీల్లో దక్షిణాదికి చెందిన హైదరాబాద్.. చెన్నై.. బెంగళూరు నగరాల వాటా ఏకంగా 61 శాతం ఉండటం గమనార్హం.

By:  Tupaki Desk   |   28 April 2024 2:30 PM GMT
తాజా రిపోర్టు; ఆఫీస్ స్పేస్ లీజులోనూ హైదరాబాద్ టాప్!
X

దేశంలోని మహానగరాలు అన్నంతనే గుర్తుకు వచ్చేవి దేశ ఆర్థిక రాజధాని ముంబయి.. దేశ రాజధాని ఢిల్లీ.. కోల్ కతా.. చెన్నై. ఐటీ పుణ్యమా అని బెంగళూరు ఆ జాబితాలో చేరిపోయింది. ఇటీవల కాలంలో ఈ మెట్రో సిటీలకు ధీటుగా ఎదిగింది హైదరాబాద్ మహానగరం. మిగిలిన మెట్రో నగరాల్లోని లేని ఎన్నో ప్రత్యేకతలు భాగ్యనగరిలో ఉండటం.. దీనికి తోడు కలిసి వచ్చిన రాజకీయ అంశాలతో ఇప్పుడు హైదరాబాద్ అందరికి అనువైన.. ఆమోదయోగ్యమైన మహా నగరంగా మారింది. ఇదే విషయాన్ని ఇప్పటికే పలు నివేదికలు.. రిపోర్టులు స్పష్టం చేశాయి. తాజాగా మరో రిపోర్టు హైదరాబాద్ సత్తా ఎంతన్న విషయాన్ని వెల్లడించింది.

స్థిరాస్తి సేవల్ని అందించే వెస్టియన్ సంస్థ ఈ కొత్త ఏడాదిలో మొదటి మూడు నెలల్లో (జనవరి - మార్చి) ఆఫీసు స్పేస్ కు సంబంధించి లావాదేవీలపై అధ్యయనం చేసింది. దేశంలోని మిగిలిన మహానగరాలతో పోలిస్తే హైదరాబాద్ ముందున్న విషయాన్ని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం భయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ.. దేశీయ ఆఫీస్ స్పేస్ లో గిరాకీ ఉండటం ఆసక్తికర అంశంగా చెప్పాలి.

ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో ఆఫీసుల అద్దె లావాదేవీల్లో 13 శాతం వృద్ధి రేటు నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి దేశవ్యాప్తంగా 1.18 కోట్ల చదరపు అడుగులు ఉండగా.. ఈ ఏడాది అది కాస్తా 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరుకుంది. దేశంలోని ఏడు మహానగరాల్లోని ఆఫీస్ లీజింగ్ అంశాలపై తాజాగా విడుదల చేసిన రిపోర్టులో.. దేశ రాజధాని ఢిల్లీలో లీజింగ్ లావాదేవీలు 25 శాతం తగ్గగా.. బెంగళూరులోనూ తక్కువగా నమోదు కావటం గమనార్హం. గత ఏడాది మొదటి మూడు నెలల్లో 33 లక్షల చదరపు అడుగులు ఉండగా.. ఈ ఏడాది 26.2 లక్షల చదరపు అడుగులకే పరిమితైంది.

దేశ వ్యాప్తంగా మొత్తం ఆఫీసు స్థలం అద్దె లావాదేవీల్లో దక్షిణాదికి చెందిన హైదరాబాద్.. చెన్నై.. బెంగళూరు నగరాల వాటా ఏకంగా 61 శాతం ఉండటం గమనార్హం. గతంలో ఇది 54 శాతం ఉన్నట్లుగా పేర్కొంది. చెన్నైలో గత ఏడాది 16 లక్షల చదరపు అడుగులు నమోదైతే.. ఈ ఏడాది అంతకు రెట్టింపు 33.5 లక్షల చదరపు అడుగులకు చేరటం విశేషం. హైదరాబాద్ విషయానికి వస్తే.. గత ఏడాది 15 లక్షల చదరపు అడుగులు ఉండగా.. ఈ ఏడాది అది కాస్తా 22.7 లక్షల చదరపు అడుగులకు చేరింది.

ఆఫీస్ స్థలాల లీజింగ్ లో ఐటీ సంస్థలతో పాటు ఐటీఈఎస్ సంస్థలు 47 శాతం ఆఫీసు స్థలాన్ని అద్దెకు తీసుకున్నాయి. ఆర్థిక సేవల రంగంలోని సంస్థలు 11 శాతం వాటాతో రెండో స్థానంలో ఉన్నట్లుగా పేర్కొంది. ఇటీవల కాలంలో ఆఫీసు స్థలాల అద్దెల లీజు విషయంలో వేగం తిరిగి వచ్చిందని.. ఇక ముందు మరింత గిరాకీ ఉంటుందని చెబుతున్నారు. ఏమైనా.. ప్రతి రంగంలో మాదిరే ఆఫీసు లీజింగ్ అంశంలోనూ హైదరాబాద్ ముందు ఉండటం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.