Begin typing your search above and press return to search.

తాజా గణాంకాలు చెబుతున్న నిజం.. మాల్దీవులకు భారతీయుల షాక్!

ఇదిలా ఉంటే.. భారత్ తో దౌత్యవివాదానికి తెర తీసిన ఆ దేశానికి తగిన శాస్తి జరిగినట్లుగా చెప్పాలి.

By:  Tupaki Desk   |   31 Jan 2024 6:20 AM GMT
తాజా గణాంకాలు చెబుతున్న నిజం.. మాల్దీవులకు భారతీయుల షాక్!
X

అవసరం లేకుండానే అక్కసు వెళ్లగక్కటం.. ఇరుగు దేశం మీద నోటికి వచ్చినట్లుగా మాటలు తూలటం లాంటి పనులు చేసిన మల్దీవులకు తగిన శాస్తి తగిలింది. లౌకికవాదుల పేరుతో నోటికి వచ్చినట్లు మాట్లాడే వారిని మినహాయిస్తే.. మాల్దీవుల విషయంలో సామాన్యుల తీరు ఒకలా.. అపర లౌకికవాదుల వాదన మరోలా ఉండటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. భారత్ తో దౌత్యవివాదానికి తెర తీసిన ఆ దేశానికి తగిన శాస్తి జరిగినట్లుగా చెప్పాలి.

నిత్యం భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లే వారు.. ఇప్పుడా దేశానికి వెళ్లటానికి పెద్దగా ఆసక్తి చూపటం లేదు. దీంతో మాల్దీవులను సందర్శించే భారతీయుల ర్యాంకు భారీగా పడిపోవటమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ ఏడాది ఆరంభంలో సాహసాలు చేసే వారు దేశంలోని లక్షద్వీప్ కు రావాలంటూ ప్రధాని మోడీ పిలుపునివ్వటం.. దీనిపై మాల్దీవుల మంత్రులు ముగ్గురు విషం కక్కుతూ.. భారత్ ను చులకన చేసేలా.. తమ మనసులోని విషాన్ని వెళ్లగక్కటం.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావటం తెలిసిందే.

ఈ క్రమంలో బాయ్ కాట్ మాల్దీవ్ అన్న ఉద్యమం పెద్ద ఎత్తున సాగింది. ఇందుకు తగ్గట్లే పలువురు తమ మాల్దీవుల టూర్నను రద్దు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆ దేశాన్ని పర్యటించే భారతీయుల సంఖ్య భారీగా తగ్గింది. ఇందుకు తాజాగా వెల్లడైన గణాంకాలే నిదర్శనం. గత ఏడాది డిసెంబరు 31 వరకు భారత్ నుంచి 2.09 లక్షలకు పైనే పర్యాటకలు మాల్దీవుల్ని సందర్శించారు. ఆ దేశ పర్యాటకంలో 11 శాతం వాటాతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.

రష్యా రెండో స్థానంలో.. చైనా మూడోస్థానంలో ఉండేది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది మొదటి మూడు వారాల లెక్కనే తీసుకుంటే.. భారత్ నుంచి 13,989 మంది మాత్రమే సందర్శించారు. ఆ దేశాన్ని సందర్శించిన విదేశీయుల్లో భారతీయులు ఐదో స్థానంలో నిలవగా.. రష్యన్లు మొదటి స్థానంలో నిలిచారు. రెండోస్థానంలో ఇటలీ నిలవగా.. మూడోస్థానంలో చైనా.. నాలుగో స్థానంలో బ్రిటన్ నిలిచింది. మొత్తంగా విదేశీ పర్యాటకుల ద్వారా భారీగా విదేశీ మారకద్రవ్యాన్ని పొందే ఆ దేశం భారతీయ టూరిస్టులను కోల్పోవటం ద్వారా గట్టి షాకే తగిలిందన్న మాట వినిపిస్తోంది.