Begin typing your search above and press return to search.

ఐటీ సెక్టార్ నుంచి మరో బ్యాడ్ న్యూస్... టాప్‌-5 కంపెనీలు చెప్పిందిదే!

అవును... సాధారణంగా ఐటీ సెక్టార్ లో ఉద్యోగుల సంఖ్య పెరగడమే కానీ తగ్గడం చాలా అరుదని చెబుతుంటారు

By:  Tupaki Desk   |   27 April 2024 11:30 PM GMT
ఐటీ సెక్టార్ నుంచి మరో బ్యాడ్ న్యూస్... టాప్‌-5 కంపెనీలు చెప్పిందిదే!
X

ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని.. ఆ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఐటీ రంగం పుంజుకుంటుందని గతకొన్ని రోజులుగా కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. మళ్లీ ఇంతలోనే ఒక బ్యాడ్ న్యూస్ తెరపైకి వచ్చింది! ఈ బ్యాడ్ న్యూస్ ప్రకారం... దేశంలోని ప్రధాన ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య నానాటికీ క్షీణిస్తోందంట.. టాప్ 5 కంపెనీలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయని అంటున్నారు!

అవును... సాధారణంగా ఐటీ సెక్టార్ లో ఉద్యోగుల సంఖ్య పెరగడమే కానీ తగ్గడం చాలా అరుదని చెబుతుంటారు. అయితే... ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారిందని అంటున్నారు. ఈ క్రమంలో.. ఒక్క హెచ్.సీ.ఎల్. టెక్నాలజీస్‌ మినహా మిగిలిన ప్రధాన ఐటీ కంపెనీల్లో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 69 వేల మేరకు ఉద్యోగుల సంఖ్య క్షీణించిందని చెబుతున్నారు. ఇటీవల ఆయా కంపెనీలు వెలువరించిన త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఈవిషయం తెరపైకి వచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే... టీసీఎస్, ఇన్ఫోసిస్‌, హెచ్‌.సీ.ఎల్. టెక్నాలజీస్‌, విప్రో, టెక్‌ మహీంద్రా ఇటీవల త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. ఈ క్రమంలో... ఆయా సంస్థల లాభనష్టాలతో పాటు ఉద్యోగుల సంఖ్యను కూడా ప్రకటించాయి. ఆ గణాంకాల ప్రకారం... మొత్తంగా 69,167 మంది ఉద్యోగులు తగ్గినట్లు తెలుస్తోంది! దీంతో... ఈ విషయం వెలుగులోకి వచ్చింది!

ఇందులో భాగంగా... అత్యధికంగా ఇన్ఫోసిస్ లో 25,994 ఉద్యోగులు తగ్గగా.. విప్రోలో 24,516.. టీసీఎస్‌ లో 13,249 .. టెక్‌ మహీంద్రాలో 6,945 మేర ఉద్యోగుల తగ్గుదల నమోదైందని తెలిసింది! ఈ టాప్ 5 కంపెనీల్లో ఒక్క హెచ్‌.సీ.ఎల్‌. టెక్నాలజీస్‌ లో మాత్రమే ఉద్యోగుల సంఖ్య 1,537 మేర పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో తాజా షాకింగ్ న్యూస్ ఉద్యోగార్థులను కలవరపెడుతోందని తెలుస్తోంది!