Begin typing your search above and press return to search.

జపాన్ బాధే వేరప్పా.. రికార్డు స్థాయికి అకియా ఇళ్లు!

జపాన్ గురించి మాట్లాడుకునేది ఎక్కువ. అక్కడి వాస్తవ పరిస్థితుల గురించి తెలిసింది తక్కువగా ఉంటుంది

By:  Tupaki Desk   |   9 May 2024 8:30 AM GMT
జపాన్ బాధే వేరప్పా.. రికార్డు స్థాయికి అకియా ఇళ్లు!
X

జపాన్ గురించి మాట్లాడుకునేది ఎక్కువ. అక్కడి వాస్తవ పరిస్థితుల గురించి తెలిసింది తక్కువగా ఉంటుంది. సాధారణంగా జపాన్ లో ప్లేస్ అన్నది తక్కువగా ఉంటుందని.. అక్కడి ఇళ్లు సైతం చాలా చిన్నవిగా ఉంటాయని చెబుతుంటారు. మరి.. అలాంటి జపాన్ లో ఇప్పుడు 90 లక్షల ఇళ్లు ఖాళీగా ఉన్నాయని.. వాటిల్లో నివాసం ఉండేందుకు ఆ దేశంలో ప్రజలు లేరని చెబుతున్న వార్తలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. క్యాలెండర్ లో ఏడాది గడిచేసరికి ఆ దేశ జనాభా అంతకంతకూ తగ్గిపోవటమే తప్పించి.. పెరుగుతున్న దాఖలాలు లేవు. ఇప్పుడు జపాన్ లో ఖాళీగా ఉన్న ఇళ్లను పంచేస్తే.. న్యూయార్క్ జనాభా మొత్తానికి సరిపోతాయని చెబుతున్నారు.

ఇన్ని ఇళ్లు ఖాళీగా ఎందుకు ఉన్నట్లు? అన్నది ప్రశ్న. దీనికి సమాధానం జనాభా తగ్గిపోవటమే ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఖాళీగా ఉండే ఇళ్లను అకియాలుగా పిలుస్తుంటారు. జపాన్ లోని ప్రధాన నగరాలుగా పేరున్న టోక్యో.. క్యోటోల్లో ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య ఎక్కువ అవుతున్నాయని చెబుతున్నారు. ఇప్పుడా దేశంలో జనాభా తగ్గిపోవటం ఒక ప్రధాన సమస్యగా మారింది. దేశంలో పెద్ద వయస్కులు పెరిగిపోవటం.. జననాల సంఖ్య తగ్గిపోవటంతో జనాభా నిష్పత్తిలో వ్యత్యాసం చాలా ఎక్కువైంది. ఖాళీగా ఉన్న ఇళ్లను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు.

ఖాళీగా ఉన్న ఇళ్లు.. విపత్తులు చోటు చేసుకున్నప్పుడు సహాయక చర్యలకు అడ్డంకిగా మారుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ దేశంలోని యువత నగరాల్లో స్థిరపడుతున్నారే కానీ.. పట్టణాల్లో ఉండేందుకు ఆసక్తిని చూపటం లేదు. ఇక.. పాత ఇళ్లను పడగొట్టి కొత్తగా కట్టటం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావటంతో.. పాత ఇళ్లను వదిలేస్తున్నారు. ఇక.. ఖాళీగా ఉండే కాలనీలు.. ప్రాంతాలకు నడిపే బస్సులు.. రవాణా సదుపాయాలు తగ్గిపోవటంతో అక్కడ ప్రజలు ఉండేందుకు ఆసక్తి చూపటం లేదు.

జపాన్ లో ఖాళీగా ఉన్న ఇళ్ల గురించి తెలిసిన విదేశీయులు వీటిని కొనేందుకు ఆసక్తిని చూపుతున్నారు. అయితే.. వాటిని కొనుగోలు చేసిన తర్వాత అక్కడి వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకొని ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయామని భావిస్తున్నారు. ఎందుకంటే, మన దేశంలో మాదిరి ఇళ్లను కొనుగోలు చేయటం.. వాటికి మార్పులు చేసి అమ్మేయటం అంత సులువు కాదు. ఇక.. జనాభా తగ్గిపోతున్న జపాన్ ఇప్పటికే పలు సమస్యల్ని ఎదుర్కొంటోంది. ఇప్పుడీ అకాయ్ ల సమస్య పెద్ద తలనొప్పిగా మారిందంటున్నారు.