Begin typing your search above and press return to search.

సమీక్షకో హాల్ అబ్బో.. సారు ఫాంహౌస్ గేట్లు బాగానే తెరిచారు

తెలంగాణ ఉద్యమ మలి దశ కీలక సమయంలో అక్కడినుంచే పకడ్బందీ వ్యూహాలను రచించారు.

By:  Tupaki Desk   |   24 March 2024 1:30 PM GMT
సమీక్షకో హాల్ అబ్బో.. సారు ఫాంహౌస్ గేట్లు బాగానే తెరిచారు
X

ఆయన ఫాం హౌస్ వైపు మూడు నెలల కిందటి వరకు సామాన్యులు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు.. ఆయన హైదరాబాద్ నుంచి ఫాం హౌస్ కు బయల్దేరారంటే ఆ మార్గమంతా బ్లాక్.. నగరంలో ఆయన కాన్వాయ్ కోసం వందలాది వాహనాలను ఆపేసేవారు. ఇక ఆ ఫాం హౌస్ లో ఇతరులకు ప్రవేశమే లేదు. కానీ, ఇప్పుడు తరచూ గేట్లు తెరుస్తున్నారు.

అందరికీ ఆహ్వానం..

2010-11 సమయంలో అప్పడి ఉమ్మడి మెదక్ జిల్లా జగదేవ్ పూర్ మండలం ఎర్రవెల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫాంహౌస్ నిర్మించుకున్నారు. తెలంగాణ ఉద్యమ మలి దశ కీలక సమయంలో అక్కడినుంచే పకడ్బందీ వ్యూహాలను రచించారు. నిజం చెప్పాలంటే ఆ సమయంలో కేసీఆర్ ఏం ఆలోచించారో కానీ.. రాదు అనుకున్న తెలంగాణ సాకారమైంది. అంతకుముందు వరకు ఏమో కానీ.. కేసీఆర్ సీఎం అయ్యాక ఫాం హౌస్ చుట్టూ సహజంగా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక ఇతరులు ఎవరూ వెళ్లలేని స్థాయిలో దుర్బేధ్యంగా మార్చారు. అయితే, ఇదే సమయంలో ఫాం హౌస్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఊహించని స్థాయిలో డెవలప్ మెంట్ జరిగింది. అంతకుముందు కనీసం రోడ్లు కూడా లేనిచోట డబుల్ లైన్ రోడ్లు వేశారు. ఇంకా అనేక రకాల వసతులు కల్పించారు. ఈ విషయంలో క్రెడిట్ అంతా కేసీఆర్ దే.

రాజకీయ విమర్శలు..

కేసీఆర్ ఫాంహౌస్ వ్యవహారంపై రాజకీయంగా ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఆయన అక్కడినుంచే పాలన సాగిస్తారని.. సచివాలయానికి అయితే అసలు రారని ప్రత్యర్థులు విమర్శించేవారు. ఇక కేసీఆర్ ఫాంహౌస్ కు తరచూ వెళ్తుండడం పైనా ధ్వజమెత్తేవారు. ప్రజలను పట్టించుకోకుండా, ఆఖరికి ప్రగతి భవన్ లోనూ అందుబాటులో లేకుండా అక్కడకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించేవారు. ఇదే సమయంలో ఫాంహౌస్ లో ఇతరులకు ప్రవేశం లేని విషయాన్ని ప్రస్తావించేవారు.

గేట్లు తెరిచారు..

డిసెంబరులో వెలువడిన అసెంబ్లీ ఫలితాల అనంతరమే కేసీఆర్ ఉన్నపళంగా ప్రగతి భవన్ ను ఖాళీ చేసి ఫాంహౌస్ కే వెళ్లారు. ఆ తర్వాత అక్కడికి పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వెళ్లి పలకరించారు. ఇదే సమయంలో ఎర్రవెల్లితో పాటు కేసీఆర్ స్వగ్రామం చింతమడక ప్రజలను ఫాంహౌస్ కు పిలిచారు. కాగా.. వీటి మధ్య మరో ఘటన జరిగింది. అదే.. ఫాంహౌస్ లో కేసీఆర్ కిందపడి తుంటిఎముక విరగడం. ఇలా మొదటినుంచి చర్చనీయాంశంగా ఉన్న ఫాంహౌస్ లో కేసీఆర్ సమీక్ష సమావేశాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకంగా హాల్ వేసి 300 మందితో సమావేశం అయ్యేలా ఏర్పాట్లు చేశారు. లోక్ సభ ఎన్నిలకు కేసీఆర్ ఇక్కడినుంచే సన్నాహాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పాల్గొన్నవారు అందరికీ వినిపించేలా సౌండ్ సిస్టంను నెలకొల్పారు. భోజనాలకు హాల్, వీడియో కాన్ఫరెన్స్ ల కోసం మరో హాల్ ను సిద్ధం చేశారు.