Begin typing your search above and press return to search.

వైసీపీ వేటలో చిక్కే నేతలు...!?

పైగా ఈ మూడు పార్టీల బలం ఎక్కువగా కోస్తా జిల్లాలోనే ఉంది.

By:  Tupaki Desk   |   29 March 2024 4:05 AM GMT
వైసీపీ వేటలో చిక్కే నేతలు...!?
X

ఏపీలో వైసీపీ వేట సాగిస్తోంది. ఆ పార్టీ అభ్యర్ధులను ప్రకటించేసింది. అంతకు ముందు ఇంచార్జిలను మారుస్తూ జాబితాలను విడుదల చేసిన సమయంలో చాలా మంది పార్టీలు మారారు. వైసీపీలో ఇపుడు ఉన్న వారు ఉన్నారు వారు వెళ్ళేది లేదు. ఎక్కడో ఒకటి రెండు తప్ప అంతా సెట్ చేసుకున్నారు. దాంతో ప్రత్యర్ధి పార్టీల మీద పడ్డారు.

ఏపీలో టీడీపీ జనసేన బీఎజపీ కూటములు కట్టాయి. ఈ మూడు పార్టీలలో ఆశవహులు ఉన్నారు. ఉన్నవి 175 అసెంబ్లీ పాతిక ఎంపీ సీట్లు మాత్రమే. పైగా ఈ మూడు పార్టీల బలం ఎక్కువగా కోస్తా జిల్లాలోనే ఉంది. దాంతో పాటు మూడు పార్టీల పొలిటికల్ ఫిలాసఫీ కూడా ఒక్కటే. అభిమానించే వర్గాలు కూడా దాదాపుగా ఒక్కటే.

దాంతోనే సీట్ల దగ్గర పేచీ వస్తోంది. టికెట్ దక్కని వారు అలుగుతున్నారు. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిపోతామని అంటున్నారు. రెబెల్స్ ఇలా కూటమి గుండెలలో బెల్స్ ని మోగిస్తూంటే వైసీపీ జాగ్రత్తగా ఈ పరిణామాలను గమనిస్తోంది. వచ్చిన వారిని వచ్చినట్లే చేర్చుకోవడానికి గేట్లు తెరుస్తోంది. అదే సమయంలో రాని వారికి రెబెల్స్ గా ఉందామనుకునే వారికి తెర వెనక మద్దతు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది అని అంటున్నారు.

ఇక వైసీపీ వేటకు చిక్కే వారు ఎంతమంది అన్నది చర్చ సాగుతోంది. టీడీపీలో నాలుగు దశాబ్దాలుగా ఉన్న నాయకులు అయితే అసంతృప్తి ఎంత ఉన్నా అణచుకుంటున్నారు తప్ప బయటపడడం లేదు. టీడీపీ జెండాను చూసి వారు గుమ్మం దాటడానికి ఇష్టపడడం లేదు. వారి విషయంలో ఎంత వత్తిడి పెట్టినా వైసీపీ వైపు రావడం లేదు అని అంటున్నారు.

అయితే ఇది రాజకీయం ఒక మాటకు ఒక పిలుపునకు రాని వారు మరిన్ని సార్లు పిలిస్తే వస్తారు అన్న లెక్కలు ఉన్నాయి. దాంతో వైసీపీ వేట సాగిస్తోంది. ఆ వేటకు జనసేన నుంచి నేతలు బాగా స్పందిస్తున్నారు అని అంటున్నారు. ఆ పార్టీలో గోదావరి జిల్లాకు చెందిన కీలక నేత ముమ్మిడివరం టికెట్ ని ఆశించిన పితాని బాలక్రిష్ణ వైసీపీలో చేరేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నారు అని అంటున్నారు.

ఆయన ఈ నెల 30న వైసీపీలో చేరుతారు అని అంటున్నారు. అదే విధంగా విశాఖలో కీలక జనసేన నేతల విషయంలోనూ వైసీపీ వల విసురుతోంది అని అంటున్నారు. అలాగే విజయవాడలో కొంతమంది నిరాశతో ఉన్నారు. వారి విషయంలో కూడా ప్లాన్ బీ ని అమలు చేస్తోంది. ఎక్కువగా ఉత్తరాంధ్రా గోదావరి జిల్లా జనసేన నేతలు అలాగే టీడీపీ నేతల మీద వైసీపీ గురి పెట్టింది అని అంటున్నారు.

పోలింగ్ కి నలభై రోజులకు పైగా సమయం ఉంది. దాంతో కూటమి పెద్దలు అసంతృప్తులను పెద్దవి కాకుండా చూసుకుంటున్నారు. అయితే వైసీపీ కూడా వారి మీద ఆకర్షణ మంత్రాన్నీ ప్రయోగిస్తోంది. ఇందులో బిగ్ షాట్స్ నుంచి కీలక నేతలు ద్వితీయ శ్రేణి నాయకుల దాకా ఉన్నారని అంటున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారో ఇంకా నిర్ధారణ కావడంలేదు. దాంతో ఎక్కడ ఉన్న వారు అక్కడ ఉన్నారని అంటున్నారు. ఆవేశపరులు అటూ ఇటూ జంప్ చేసినా అన్నీ ఆలోచించే వారు మాత్రం సరైన టైం లో డెసిషన్ తీసుకుంటారు అని అంటున్నారు. వేవ్ ని చూసిన తరువాత జంపింగ్స్ ఏ వైపు నుంచి ఏ వైపు నకు ఉంటాయో తెలుస్తుంది అంటున్నారు. అపుడు వైసీపీ వేట స్టార్ట్ చేస్తుందా లేక టీడీపీ ఆట మొదలెడుతుందా అన్నది చూడాలని అంటున్నారు.