Begin typing your search above and press return to search.

వైసీపీ లోకి భారీ క్యూ... రికార్డ్ స్థాయిలో చేరికలు దేనికి సంకేతం?

రాజకీయాల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా పార్టీల నుంచి.. గెలిచే పార్టీ అనే అభిప్రాయానికి వచ్చిన పార్టీలోకి చేరికలు ఉండటం అత్యంత సహజం

By:  Tupaki Desk   |   27 March 2024 8:00 AM GMT
వైసీపీ లోకి భారీ క్యూ... రికార్డ్ స్థాయిలో చేరికలు దేనికి సంకేతం?
X

రాజకీయాల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా పార్టీల నుంచి.. గెలిచే పార్టీ అనే అభిప్రాయానికి వచ్చిన పార్టీలోకి చేరికలు ఉండటం అత్యంత సహజం. అధికారంలోకి వచ్చే పార్టీ టిక్కెట్ దక్కితే చాలని చాలా మంది భావించి ఆ నిర్ణయం తీసుకుంటుంటారు. ఇప్పటికే ఉన్న పార్టీలో టిక్కెట్ దక్కనివారూ ఆ తరహా నిర్ణయం చేస్తుంటారు. అలానే చేరుతుంటారు. ఇక్కడ టిక్కెట్టే ప్రధానం!

అయితే...వైసీపీ లో మాత్రం తాజాగా సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. అన్ని నియోజకవర్గాలకూ అభ్యర్థులను ప్రకటించేసి, ఇక ఒక్క టిక్కెట్ కూడా లేదని తెలిసినా కూడా నేతలు క్యూ కడుతున్నారు. అంటే ఇక్కడ టిక్కెట్ ప్రధానం కాదు.. క్రెడిబిలిటీ కలిగిన నేతతో కలిసి ప్రయాణించడం ప్రధానం అని వీరు భావించి ఉండొచ్చు! ఇదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అన్ని విషయాల్లోనూ పెద్ద పీట వేయడం కూడా మరో కారణం అని చెబుతున్నారు!

అవును... న భూతో న భవిష్యతి అన్నట్లుగా రాజకీయాల్లో సరికొత్త చరిత్రను ఆవిష్కరిస్తున్నారు వైఎస్ జగన్. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో 2019 ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటు.. ఇచ్చిన హామీల్లో 95శాతానికిపైగా హామీలు నెరవేర్చానని, తన వల్ల మీమీ కుటుంబాలకు మేలు జరిగితేనే ఓటు వేయమని చెబుతూ.. సరికొత్త రాజకీయానికి తెరలేపారు. ఇచ్చిన మాట తప్పితే తనకు ఓటు వేయొద్దని చెబుతున్నారు.. దీన్ని ధమ్మున్న రాజకీయం అని పలువురు విశ్లేషిస్తున్నారు!

అదేవిధంగా... రాజ్యాధికారంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను భాగస్వాములను చేస్తూ... 50శాతం టిక్కెట్లు వారికి కేటాయించారు. ఈ సమయంలో.. రానున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా " మేమంతా సిద్ధం" అంటూ బస్సు యాత్ర మొదలుపెట్టారు! అయితే.. ఈ బస్సు యాత్రకు ఒక్క రోజు ముందు సీఎం క్యాప్ ఆఫీస్ కళకళలాడిపోయింది. ఇందులో భాగంగా ఏకంగా ఒకేరోజు 8 నియోజకవర్గాలకు చెందిన నేతలు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు!

ఇందులో భాగంగా... మంగళవారం ఒక్కరోజే సుమారు 8 నియోజకవర్గాల నేతలు సీఎం జగన్ ని కలిశారు. క్యాంప్ ఆఫీసులో వారంతా జగన్ సమక్షంలో వైసీపీ కండువాలు కప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయానికి తమవంతు కృషి చేస్తామని తెలిపారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమే అని ఘంటాపథంగా చెప్పారు! పాయకరావుపేట, విశాఖపట్నం, ఏలూరు, నూజివీడు, విజయవాడ, వెంకటగిరి, రాజంపేట, సూళ్లూరు పేట నేతలు వైసీపీలో చేరారు.

ఈ క్రమంలో... వైసీపీలో చేరిన నేతల వివరాలు ఇలా ఉన్నాయి!

నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య, ఆయన కుమారుడు చిన్నం చైతన్య

పాయకరావుపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి

టీడీపీ ఏలూరు పార్లమెంట్‌ ఇన్ ఛార్జ్ గోరుముచ్చు గోపాల్‌ యాదవ్‌

సూళ్ళూరుపేట టీడీపీ సీనియర్‌ నేత వేనాటి రామచంద్రారెడ్డి

వెంకటగిరి నియోజకవర్గం టీడీపీ సీనియర్‌ నేత డాక్టర్‌ మస్తాన్‌ యాదవ్‌

రాజంపేట పార్లమెంట్ టీడీపీ ఎంపీ ఇన్ ఛార్జ్ గంటా నరహరి

జైభారత్‌ నేషనల్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు గొరకపూడి చిన్నయ్యదొర

విశాఖపట్నంకు చెందిన పలువురు సీనియర్‌ నాయకులు జి.వి.రవిరాజు (సీనియర్‌ నాయకులు), బొగ్గు శ్రీనివాస్, బొడ్డేటి అనురాధ (జనసేన నాయకులు).

విజయవాడకు చెందిన పలువురు టీడీపీ మాజీ కార్పొరేటర్లు, జనసేన నాయకులు. వీరిలో... బత్తిన రాము (జనసేన విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్ ఛార్జ్), గండూరి మహేష్, నందెపు జగదీష్‌ (మాజీ కార్పొరేటర్లు), కొక్కిలిగడ్డ దేవమణి (మాజీ కోఆప్షన్‌ మెంబర్‌), కోసూరు సుబ్రహ్మణ్యం (టీడీపీ రాష్ట్ర బీసీ సెల్‌ సెక్రటరీ), గోరంట్ల శ్రీనివాసరావు (మాజీ డివిజన్‌ అధ్యక్షులు) ఉన్నారు.

దీంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ మరింత బలపడిందని ఒకరంటే... ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు పక్కకెళ్లి ఆడుకోవడమే అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.

కాగా.. "మేమంతా సిద్ధం" అంటూ సీఎం వైఎస్ జగన్ నేటి నుంచి బస్సుయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ మొత్తం 21 రోజులపాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రలో కూడా పలు నియోజకవర్గాల్లో కీలక చేరికలు ఉండొచ్చని తెలుస్తోంది.