Begin typing your search above and press return to search.

వెంకయ్య హితబోధలు బాబూ జగన్ వింటారా ?

ఉచితాల పేరిట ఖజానాకు భారం చేసే చర్యలు వద్దు అని అన్నారు. ఉచిత పధకాల వల్ల ఖజానాకు కష్టం అవుతుందని అన్నారు

By:  Tupaki Desk   |   24 April 2024 3:00 AM GMT
వెంకయ్య హితబోధలు బాబూ జగన్ వింటారా ?
X

తల పండిన రాజకీయ నేత ముప్పవరపు వెంకయ్యనాయుడు. దేశంలోనే రెండవ అత్యున్నత పదవి అయిన ఉప రాష్ట్రపతిని చేపట్టి ఆ పదవికి వన్నె తెచ్చిన వారు. అంతే కాదు దేశంలో రెండవ పౌర పురస్కారం అయిన పద్మవిభూషణ్ ని అందుకున్నారు. ఆయన ఈ సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ అధినేతలకు కూడా మంచి సూచనలుగానే ఉన్నాయి. ఉచితాల మీద వెంకయ్యనాయుడు కీలక కామెంట్స్ చేశారు.

ఉచితాల పేరిట ఖజానాకు భారం చేసే చర్యలు వద్దు అని అన్నారు. ఉచిత పధకాల వల్ల ఖజానాకు కష్టం అవుతుందని అన్నారు. పైగా అప్పుల కుప్పగా రాష్ట్రాలు మారుతాయని ఆయన అన్నారు. కేవలం విద్య వైద్యం వంటి వాటికే ఉచితాలను వాడాలని అవి తప్ప మిగిలినవి ఉచితాలుగా ఇస్తే మాత్రం ఇబ్బందులు వస్తాయని ఆయన హిత బోధ చేశారు.

ఈ విషయంలో ఎన్నికల ప్రణాళికను తయారు చేసేటప్పుడే రాజకీయ పార్టీలు ఆలోచించాల్సిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు నొక్కి చెప్పారు. అందువల్ల ప్రజలకు ఉచితంగా ఇచ్చే పథకాలపై ప్రభుత్వాలు పునరాలోచించాలని కోరారు.

ఇక ప్రజలు కూడా ఉచిత పథకాలపై ప్రభుత్వాలను ప్రశ్నించాలని అన్నారు. అంతే కాదు తాము ఏదైతే అమలు చేసేందుకు వీలు అవుతుందో అలా సాధ్యమైన పథకాలను మాత్రమే రాజకీయపార్టీలు తమ మ్యానిఫెస్టోలో చేర్చాలని సూచించారు.

ఇవన్నీ ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలకు విలువైన సూచనలే అని అంటున్నారు. ఏపీలో ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉచిత పధకాల గురించి మాట్లాడుతున్నారు. సూపర్ సిక్స్ అని అంటున్నారు, అంతకంటే మరిన్ని రెట్లు అంటున్నారు. దీని వల్ల ఓట్ల పంట పండించుకుని అధికారంలోకి రావడం వరకూ బాగానే ఉంటుంది కానీ వచ్చిన తరువాత అమలు కోసం తిరిగి అప్పులే చేయాల్సి ఉంటుందని అంటున్నారు.

అదే విధంగా చూస్తే ఒక పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మాత్రమే వేరొక పార్టీలో చేరే సాంప్రదాయం రావాలని ఎన్నికలలో గెలుపొందేందుకు తరచూ పార్టీలు మారడం సరికాదని వెంకయ్యనాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది కూడా మంచి సూచనగానే ఉంది. ఎందుకంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి చేరిపోవడం అలవాటు అవుతోంది.

ఇది వారూ వీరూ చేస్తున్నారు. దాంతో దీనికి సర్వామోద ముద్ర పడిపోతోంది. ఇలాంటి చెడు పోకడల పట్ల వెంకయ్యనాయుడు వంటి పెద్దలు ఖండిస్తున్నారు. ఇది మంచి సంప్రదాయం కాదని అంటున్నారు. మరి ఫిరాయింపుల చట్టాన్ని మరింత పదును ఎక్కేలా చేయాలని కూడా సూచనలు వస్తున్నాయి.