Begin typing your search above and press return to search.

జ‌న‌సేన‌ను కుదిపేస్తున్న 'ఒక్క ఫొటో'.. ఏం జ‌రిగింది?

ఇక‌, దీనికి నాగ‌బాబు.. ''నీ ఉద్దేశం ఏదైనా, నీ ఆదేశం ఏదైనా ప్రశ్నించకుండా పాటించే లక్షల మంది జనసైనికుల్లో నేను కూడా ఒకడిని.

By:  Tupaki Desk   |   24 April 2024 8:06 AM GMT
జ‌న‌సేన‌ను కుదిపేస్తున్న ఒక్క ఫొటో.. ఏం జ‌రిగింది?
X

ఏపీలో కూట‌మి క‌ట్టి.. వైసీపీపై అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజాగా చిక్కుల్లో ప‌డ్డారు. ఆయ‌న మ‌ద్ద‌తు దారులు కూడా.. విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. దీనికి కార‌ణం.. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న నాగ‌బాబు.. తాజాగా ఓ ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. దీనికి ఆయ‌న కొన్ని కామెంట్లు కూడా జోడించారు. ఇవి.. క‌ల‌కలం రేపుతున్నాయి. కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ జ‌న‌సేన‌పై చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు ఇవి బ‌లాన్నిచ్చేవిగా ఉండ‌డంతో నెటిజ‌న్లు కూడా.. అదే రేంజ్‌లో ఫైర‌వుతున్నారు.

ఏం జ‌రిగింది?

జ‌న‌సేన పార్టీలో నాగ‌బాబు కీల‌కంగా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న విశాఖ జిల్లా అన‌కాపల్లి పార్ల‌మెంటు స్థానం నుంచి పోటీ చేయాల‌ని అనుకున్నారు. దీనికి సంబంధించి ఆయ‌న గ్రౌండ్ వ‌ర్క్ కూడా చేసుకున్నారు. మండ‌ల స్థాయిలో వారం రోజులు మ‌కాం వేసి మ‌రీ.. త‌న గెలుపుపై అంచ‌నాలు స‌రిచూసుకున్నారు. అంతా బాగానే ఉంద‌ని.. తాను ఇక్క‌డ నుంచి బ‌రిలో ఉన్నాన‌ని నాగ‌బాబు సంకేతాలు ఇచ్చారు. కానీ, కూట‌మి ఎఫెక్ట్‌తో ఈ సీటు బీజేపీ ప‌ట్టుకుపోయింది. త‌ర్వాత‌.. వేరే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని అనుకున్నా.. కుద‌ర‌లేదు.

ఈ నేప‌థ్యంలో నాగ‌బాబుపైకి బాగానే క‌నిపించినా.. లోలోన మాత్రం వైసీపీ చేసిన విమ‌ర్శ‌లు ఆయ‌న‌ను క‌ల‌చి వేసిన మాట వాస్త‌వం. అయిన‌ప్ప‌టికీ..ఇప్ప‌టి దాకా నాగ‌బాబు బ‌య‌ట‌ప‌డ‌లేదు. కానీ, తాజాగా ఆయ‌న జ‌నసేన కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సాహం నింపాల‌ని అనుకున్నారో.. లేక‌.. టికెట్‌లు ద‌క్క‌ని నాయ‌కులను ప‌రోక్షంగా ఓదార్చాల‌ని అనుకున్నార‌నో.. ప‌వ‌న్ తో ఉన్న ఫొటోను ఒక‌టి పోస్టు చేశారు. దీనిలో ప‌వ‌న్‌.. నాగ‌బాబు కుడి భుజంపై త‌న కుడి చేతిని వేసి ఉంది. అంటే ఏదో ధైర్యం చెబుతున్న‌ట్టుగా అర్ధం చేసుకోవ‌చ్చు.

ఇక‌, దీనికి నాగ‌బాబు.. ''నీ ఉద్దేశం ఏదైనా, నీ ఆదేశం ఏదైనా ప్రశ్నించకుండా పాటించే లక్షల మంది జనసైనికుల్లో నేను కూడా ఒకడిని. ఎందుకంటే ఆ నిర్ణయం నా భుజం మీద నీ చేయిలాంటిది. అది బలాన్ని, భరోసాను ఇస్తుందే తప్ప బరువును, బాధను ఇవ్వదు'' అని రాశారు. దీనిపై నెటిజ‌న్లు స‌హా.. అసంతృప్త జ‌న‌సేన నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అస‌లు ప్ర‌శ్నించేందుకే పార్టీ పెట్టిన ప‌వ‌న్‌ను ప్ర‌శ్నించ‌న‌ని చెబుతున్న నాగ‌బాబు.. రేపు ప్ర‌జ‌ల కోసం ఏం ప్ర‌శ్నిస్తార‌న‌న్నది దాదాపు వంద‌మందికి పైగా అడిగిన ప్ర‌శ్న‌ల సారాంశం. ఇదే విష‌యాన్న కొన్నాళ్లుగా వైసీపీ కూడా చెబుతోంది. దీంతో తాజాగా చేసి ఫొటో పోస్టు.. పార్టీలో క‌ల‌క‌లం రేపుతోంది. దీనిపై ఎలాంటి వివ‌ర‌ణ ఇస్తారో చూడాలి.