Begin typing your search above and press return to search.

అవుట్ డేటెడ్ జంపింగ్ నేతలతో ఉపయోగం ఉందా ?

రాజకీయాలు బహు చిత్రమైనవి. అందులో నుంచి ఎవరికి వారు రిటైర్ అవరు.

By:  Tupaki Desk   |   27 April 2024 2:30 PM GMT
అవుట్ డేటెడ్ జంపింగ్ నేతలతో ఉపయోగం ఉందా ?
X

రాజకీయాలు బహు చిత్రమైనవి. అందులో నుంచి ఎవరికి వారు రిటైర్ అవరు. వారికి కలసి రాని కాలమే కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చి తీరాలి తప్ప వారుగా మారరు. వయసు మీద పడుతున్నా పదవులు ఎన్నో చేసినా ప్రతీ ఎన్నికల్లోనూ పోటీ చేయాలని అనుకుంటారు. అలాగే ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ మారాలని చూస్తారు.

అయితే వారికి అర్ధం కాని విషయం ఒకటి ఉంది. అదేంటి అంతే తామున్న పార్టీ ఎందుకు ఆదరించడం లేదు అన్నది. తమ స్థితి పరిస్థితి బాగుంటే అక్కడే పెద్ద పీట వేసేవారు కదా అన్న ఆలోచన కూడా చేసుకోవడం లేదు. వారికి తెలియడం లేదు కానీ జనరేషన్ గ్యాప్ లో నలిగి తాము అవుట్ డేటెడ్ అయిపోయామన్న కఠిన సత్యాన్ని నమ్మలేకపోతున్నారు.

అందుకే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వారు మారిపోతున్నారు. అయితే అలా వచ్చిన వారికి కండువాలు కప్పి పార్టీలు ఆహ్వానం పలకడమే చిత్రం. తమ వద్ద ఉన్న అవుట్ డేటెడ్ ని అలా ఉంచేసి కొత్త అవుట్ డేటెడ్ ని తెచ్చుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి అన్నది కూడా అధినేతలకు ఎందుకు పనికి వస్తుందో తెలియడం లేదు అంటున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలో జంపింగులు ఎక్కువ అవుతున్నాయి. నేతలు అటు నుంచి ఇటూ ఇటు నుంచి అటూ మారిపోతున్నారు. వీరిలో చూస్తే బలమైన నేతలు ప్రెజెంట్ రాజకీయాల్లో దిట్టంగా ఉన్న వారు మారడం లేదు. ఎక్కువగా అవుట్ డేటెడ్ నేతలే మారిపోతున్నారు.

ఇలాంటి వారిని స్వాగతించడం వల్ల పార్టీలకు కానీ ఆయా చోట్ల పోటీలో ఉన్న అభ్యర్ధులకు కానీ ఏమి పెద్ద ఉపయోగం లేదు అని అంటున్నారు. వారు ఇచ్చే సలహాలు కానీ సూచనలు కానీ ఏవీ ఉపయోగపడవు. పైగా వారికి ఇగోలు ఎక్కువ. వారు చెప్పిందే జరగాలి అంటారు. ఒకనాటి వారి రాజకీయ వైభోగాన్ని మరచిపోలేక తాము చెప్పినట్లే అంతా జరగాలి అంటారు. తీరా చూస్తే వారి చుట్టు కనీసం నలుగురు మనుషులు కూడా ఉండరు.

మరి ఎందుకు వీరిని చేర్చుకోవడం అంటే జనాలను మభ్యపెట్టేందుకు పార్టీలు వేసే ఎత్తుగడలలో ఇదొక భాగమని అంటున్నారు. తమ పార్టీలోకి వెల్లువలా నేతలు వస్తున్నారు అని చెప్పుకోవడానికి అని కూడా అంటున్నారు. అలా కండువాలు కప్పి వారిని పక్కన పెడతారే తప్ప వారి వల్ల ఏమీ లాభం లేదని అధినాయకులకూ తెలుసు అని అంటున్నారు.

ఇక ఎమ్మెల్యే అభ్యర్ధులకు ఆయన నియోజకవర్గాలలో కనీసంగా ఆరేడు శాతం ఓట్లు ఉంటాయి. వాటికి పార్టీ ఓటు బ్యాంక్ తోడు అవుతుంది. ప్రధాన పార్టీలకు నలభై శాతం ఓటు షేర్ ఉంటోంది. ఇలా సాగుతున్న రాజకీయ సమరంలోకి అవుట్ డేటెడ్ పొలిటీషియన్లు వచ్చి కొత్తగా జత చేసే ఓట్లు ఎన్ని అన్న చర్చ సాగుతోంది.

వారి వల్ల ఓట్లు పడకపోగా పాత గొడవలు కొత్తగా మొదలయ్యే పరిస్థితి కూడా చాలా చోట్ల ఉండవచ్చు అంటున్నారు. ఎందుకంటే గతంలో వారు పనిచేసిన సందర్భంలో కట్టిన వర్గాలు ఇపుడు మళ్ళీ రేగే అవకాశం ఉంది అని అంటున్నారు. అలా చాలా చోట్ల జరుగుతోంది కూడా.

కండువాలు కప్పే సీన్ అన్నది ప్రతీ పార్టీ రాజకీయ వ్యూహంలో భాగమైంది. అందుకే మీడియా అటెన్షన్ కోసం అలాగే జనాలకు తాము గెలుపు గుర్రాలమే అని చెప్పడం కోసం చేస్తున్న విన్యాసంగానే అంతా చూస్తున్నరు.

ఏది ఏమైనా ఒక్క మాట ఇక్కడ ఉంది. జనాలు తెలివి మీరారు ఎంతలా అంటే ఒకే ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటే ఆ నాలుగూ కూడా ఒకే పార్టీకి పడనంతగా. అంటే ఇంటి పెద్ద మాటనే వినని పరిస్థితి ఉంది అన్న మాట. అలాంటపుడు చేర్చుకునే నేతలు ఎందరిని ఓట్లగా మారుస్తారు. అందులో పాత తరం నాయకులకు ఉండే పరిచయాలు ఎంత. అవి ఇపుడు ఈ స్పీడ్ యుగంలో వర్కౌట్ అవుతాయా అన్నది కూడా చూడాలని అంటున్నారు.