Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం ఇదే!

దీంతో ఎలక్టోరల్‌ బాండ్స్‌ కొనుగోలు చేసిన కంపెనీలు, వాటిని అందుకున్న పార్టీల వివరాలను ఎస్బీఐ ఇటీవల వెల్లడించింది

By:  Tupaki Desk   |   29 March 2024 9:26 AM GMT
ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం ఇదే!
X

ప్రస్తుతం దేశ రాజకీయాలను ఎలక్టోరల్‌ బాండ్స్‌ వ్యవహారం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) జారీ చేసిన ఈ ఎలక్టోరల్‌ బాండ్స్‌ ను కొనుగోలు చేసిన వివిధ వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు, కంపెనీలు.. వివిధ పార్టీలకు కోట్లాది రూపాయలు విరాళం రూపంలో ఇచ్చాయి. అయితే ఇవన్నీ ఇటీవల వరకు రహస్యంగా ఉండగా.. ఎలక్టోరల్‌ బాండ్స్‌ వివరాలను వెల్లడించాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా వీటిని ఏ కంపెనీలు కొనుగోలు చేశాయో, ఏ పార్టీలకు ఎంత విరాళంగా ఇచ్చాయో వెల్లడించాల్సిందేనని విస్పష్టంగా ఆదేశించింది. దీంతో ఎలక్టోరల్‌ బాండ్స్‌ కొనుగోలు చేసిన కంపెనీలు, వాటిని అందుకున్న పార్టీల వివరాలను ఎస్బీఐ ఇటీవల వెల్లడించింది.

రాజకీయ పార్టీలకు దొంగ దారిలో నిధులను మళ్లించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఎలక్టోరల్‌ బాండ్‌ స్కీమ్‌ ను ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు చెల్లదని స్పష్టం చేసింది. ఎలక్టోరల్‌ బాండ్ల జారీని తక్షణమే నిలిపివేయాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ)కు ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో ఎలక్టోరల్‌ బాండ్స్‌ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణమని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ భర్త పరకాల ప్రభాకర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఒక టీవీ చానల్‌ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఎలక్టోరల్‌ బాండ్‌ ఇష్యూ ఇప్పుడున్న దానికంటే మరింత ఊపందుకుంటుందని పరకాల ప్రభాకర్‌ తెలిపారు. ఇది పెద్ద సమస్యగా మారుతుందన్నారు. ఇది దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతి పెద్ద కుంభకోణమని ఇప్పుడు అందరికీ అర్థమవుతోందని తెలిపారు. ఇప్పుడు పోటీ రెండు కూటముల మధ్య కాదని.. బీజేపీకి, భారత ప్రజలకు మధ్య ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలక్టోరల్‌ బాండ్స్‌ వ్యవహారంలో బీజేపీని ప్రజలు కఠినంగా శిక్షిస్తారని పరకాల ప్రభాకర్‌ వ్యాఖ్యానించారు.

ఎలక్టోరల్‌ బాండ్స్‌ పార్లమెంటు ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతాయని పరకాల ప్రభాకర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఓట్లను కొనేందుకు, అభ్యర్థులను తారుమారు చేసేందుకు ఈ నిధులు దోహద పడతాయన్నారు.

కాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తన అధికారిక పోర్టల్‌ లో ఎలక్టోరల్‌ బాండ్లకు సంబంధించిన డేటాను ఉంచింది.

ఈ క్రమంలో 2019 ఏప్రిల్‌ 12 నుంచి 2024 ఫిబ్రవరి 15 మధ్య ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా రూ.6,986.5 కోట్లు బీజేపీ పొందింది. పశ్చిమబెంగాల్‌ లో అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ కు రూ.1,397 కోట్లు, కాంగ్రెస్‌ కు రూ.1,334 కోట్లు, భారత్‌ రాష్ట్ర సమితికి రూ.1,322 కోట్లు, వైసీపీకి రూ.1250 కోట్లు, టీడీపీకి రూ.850 కోట్లు ఎలక్టోరల్‌ బాండ్స్‌ ద్వారా దక్కాయి.

కాగా ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా బీజేపీ భారీ ఎత్తున పొందిందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కార్పొరేట్, ప్రైవేటు కంపెనీలతో కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ క్విడ్‌ ప్రోకో ఒప్పందాలు కుదుర్చుకుంటోందని మండిపడుతున్నాయి. ఎలక్టోరల్‌ బాండ్లను చట్టబద్ధం చేసిన అవినీతిగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఎలక్టోరల్‌ బాండ్స్‌ ద్వారా ఎవరైనా సరే.. తమ పేరును వెల్లడించకుండా.. పార్టీలకు విరాళాలు ఇవ్వొచ్చు. 2019లో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దీన్ని తీసుకువచ్చింది. ఈ అంశాన్ని ప్రజల్లో చర్చకు రానీయకుండా పక్కదారి పట్టించడానికే విపక్ష నేతలను వివిధ కేసుల్లో ఈడీ ద్వారా అరెస్టు చేయిస్తోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరకాల ప్రభాకర్‌ చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి.