Begin typing your search above and press return to search.

పిఠాపురం కింగ్ మేకర్ ఆయనే ?

మొత్తం మీద చూస్తే వర్మ కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ అవుతారు అని అంటున్నారు ఆయన తిప్పే చక్రం తోనే పిఠాపురం ఫలితాలు ఎటు నుంచి ఎటైనా మారుతాయని కూడా అంటున్నారు.

By:  Tupaki Desk   |   24 April 2024 8:46 AM GMT
పిఠాపురం కింగ్ మేకర్ ఆయనే ?
X

వర్మ పేరు ఇపుడు పిఠాపురంలో మారుమోగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ పత్రాలను ఆయన వెంటే ఉండి వర్మ కూడా అందజేయడం విశేషం. ఇక పవన్ ప్రతీ సభలో వర్మను పొగుడుతున్నారు. ఆయన త్యాగం అంటూ కితాబు ఇస్తున్నారు.

వర్మకు ఉన్నత పదవి తొందరలో దక్కుతుందని కూడా చెబుతున్నారు. ఇప్పటికే వర్మకు చంద్రబాబు ఎమ్మెల్సీ సీటు హామీ ఇచ్చారు. మరి ఉన్నత పదవి అంటే అంతకంటే ఎక్కువా తక్కువా అన్న చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే పిఠాపురంలో టీడీపీ అంటే వర్మ మాత్రమే అన్న భావన ఉంది. అక్కడ క్యాడర్ మొత్తం వర్మ చెప్పినట్లే నడుస్తుంది.

వర్మ కనుక కనుసైగ చేస్తే వారు మద్దతు ఎటు వైపు అయినా తిప్పుతారు అన్న మాట ఉంది. అందుకే వేలాది మందితో నామినేషన్ వేసినా కూడా జనసేనకు గెలుపు ధైర్యం చిక్కడం లేదు. వర్మను నిరంతరం మంచి చేసుకునే పనిలోనే ఉంది.

పవన్ అయితే తన పక్కన వర్మ లేకపోతే కనీసం అడుగు బయటకు తీయడం లేదు. వర్మకు ఈ రకమైన ప్రయారిటీ ఇవ్వడం జనసేన వారికి నచ్చడం లేదు అన్న ప్రచారం కూడా ఉంది. మరో వైపు చూస్తే పిఠాపురంలో లోకల్ లీడర్స్ చాలా మంది ఉన్నారు. కానీ టీ టైం ఉదయ్ కి జనసేన బాధ్యతలు అప్పగించడం పట్ల జనసేన వర్గాలు రగులుతున్నాయి.

దాంతో పాటు వర్మ పెత్తనం ఎక్కువ అవుతోందని వారు గుస్సా అవుతున్నారు. జనసైనికులకు పవన్ దేవుడుతో సమానం. పవన్ తలచుకుంటే ఆయన గెలుపు ఎవరూ ఆపలేరు అన్నది వారి విశ్వాసం. వర్మ జపం ఎందుకు అని వారు మధనపడుతున్నారుట. ఇవన్నీ ఇలా ఉంచితే తరచూ వర్మది త్యాగం అని పవన్ పొగుడుతూంటే టీడీపీలో ఆయన అనుచరులు ఎందుకొచ్చిన త్యాగం రాజు గారు అని చికాకు పడుతున్నారుట.

వారిని దారిలో పెట్టి జనసేనకు మద్దతుగా ఓట్లు వేయించడం ఇపుడు వర్మ చేతిలోనే ఉంది. వర్మ నిలబడతారు అని ఈసారి కచ్చితంగా ఎమ్మెల్యే అవుతారు అని ఆయన అనుచరులు బలంగా నమ్మారు. కానీ పొత్తుతో రాజకీయం కాస్తా వేరే రూట్ పట్టింది. మరో వైపు చూస్తే వర్మను పొగుడుతూనే జనసేన తమ పనిలో తాము ఉందని అంటున్నారు.

అంటే ఎటు నుంచి ఎటు వచ్చినా తమ జాగ్రత్తలు తాము తీసుకోవాలని చూస్తోంది అని అంటునారు. జనసేన తరఫున నాగబాబు పెద్దరికం పాత్ర పోషిస్తున్నారు ఆయన మొత్తం కో ఆర్డినేట్ చేస్తున్నారు. అయితే ఎవరు వచ్చినా ఎందరు డైరెక్షన్ చేసినా పిఠాపురం మొత్తం రాజకీయం వర్మకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు అని అంటున్నారు. దాంతోనే వర్మ కీ రోల్ పోషించడం ఖాయం అంటున్నారు.

ఇక జనసేన గెలిస్తే వర్మకు లాభమా నష్టమా అన్న యాంగిల్ లో కూడా సాగుతోంది. పవన్ గెలిచి జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పవన్ కచ్చితంగా మంత్రి అవుతారు. అపుడు వర్మ పరిస్థితి ఏమిటి ఆయనకు ఇపుడు ఎన్నికల వేళ ఇస్తున్న ప్రాధాన్యత ఒడ్డుకు చేరాక ఇస్తారా అన్న డౌట్లు కూడా వస్తున్నాయట. పైగా ఇక్కడే తన నివాసం ఏర్పాటు చేసుకుంటాను పిఠాపురం తన సొంత నియోజకవర్గంగా చేసుకుంటాను అని పవన్ చెబుతున్నారు.

దీంతో పవన్ గెలిస్తే వర్మకు రాజకీయంగా కష్టకాలమేనా అన్న చర్చ కూడా మరో వైపు వస్తోంది. మకుటం లేని మహరాజుగా టీడీపీలో పిఠాపురంలో వెలిగిన వర్మ ఇపుడు పవన్ ని గెలిపించిన తరువాత తన రాజకీయం ఏమిటి అని కూడా ఆలోచించుకోవాలని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే పవన్ ని ఎలాగైనా ఓడించాలని చూస్తున్న వైసీపీ కూడా వర్మ వైపే చూస్తోందని అంటున్నారు.

ఎన్నికల వేళకు ఏమైనా మార్పులు జరుగుతాయని దాంతో పిఠాపురం ఫలితం అనూహ్యంగా ఉన్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు. మొత్తం మీద చూస్తే వర్మ కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ అవుతారు అని అంటున్నారు ఆయన తిప్పే చక్రం తోనే పిఠాపురం ఫలితాలు ఎటు నుంచి ఎటైనా మారుతాయని కూడా అంటున్నారు. దాంతో పిఠాపురం రాజకీయం హాట్ హాట్ గా మారింది. ఆసక్తిని కూడా కలిగిస్తోంది.