Begin typing your search above and press return to search.

మరో డీల్ క్లోజ్.. మీడియాలో మరింత పట్టు దిశగా రిలయన్స్!

టీవీ వ్యాపారంలో వయాకామ్ 18లో రిలయన్స్ కు వాటా ఉన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 March 2024 7:30 AM GMT
మరో డీల్ క్లోజ్.. మీడియాలో మరింత పట్టు దిశగా రిలయన్స్!
X

ఒకటి తర్వాత ఒకటి చొప్పున వివిధ రంగాల్లోకి దూసుకెళుతున్న రిలయన్స్ సంస్థ.. తాను ఇప్పటికే ఉన్న రంగాల్లోని వ్యాపారాల్లో తన పట్టును మరింత పెంచుకోవటంతో పాటు.. వాటాలను విస్తరిస్తోంది. తాజాగా అలాంటి డీల్ ఒకటి క్లోజ్ చేసింది. మీడియాలోనూ రిలయన్స్ బలమైన వాటా ఉన్న సంగతి తెలిసిందే. టీవీ వ్యాపారంలో వయాకామ్ 18లో రిలయన్స్ కు వాటా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 57 శాతం వాటా ఉండగా.. తాజాగా ఇదే సంస్థలో అమెరికాకు చెందిన పారామౌంట్ గ్లోబల్ కు చెందిన 13.01 శాతం వాటాను కొనుగోలు చేయటానికి వీలుగా ఆ కంపెనీకి చెందిన రెండు అనుబంధ కంపెనీలతో ఒప్పందంపై సంతకాలు చేసినట్లుగా రిలయన్స్ సంస్థ స్టాక్ ఎక్స్జేంజీకి సమాచారం ఇచ్చింది.

దీంతో వయాకామ్ 18లో రిలయన్స్ వాటా 70.49 శాతంగా మారింది. ఈ డీల్ విలువ రూ.4,286 కోట్లు. ఈ మొత్తాన్ని పారామౌంట్ గ్లోబల్ సంస్థకు చెందిన అనుబంధ సంస్థలకు రిలయన్స్ చెల్లించనుంది. వయాకామ్ 18 పరిధిలో ఉండే టీవీ చానళ్లను చూస్తే.. కామెడీ సెంట్రల్.. నికెల్ ఓడియన్.. ఎం టీవీ లాంటి ప్రఖ్యాత బ్రాండ్లతో సహా మొత్తం 40టీవీ చానళ్లను వయాకామ్ 18 నిర్వహిస్తోంది. ఈ డీల్ పూర్తి అయ్యాక కూడా వయాకామ్ 18కు తన కంటెంట్ ఇవ్వటానికి పారామౌంట్ కట్టుబడి ఉన్నట్లుగా పేర్కొంది. దీంతో.. రిలయన్స్ మరింత బలోపేతం అవుతుందని చెప్పాలి.

నెట్ వర్క్ 18 ను 2014లో అప్పటి ప్రమోటర్ రాఘవ్ బాల్ తదితరుల నుంచి రిలయన్స్ కొనుగోలు చేసింది. ఈ డీల్ లో భాగంగానే వయాకామ్ 18 కూడా రిలయన్స్ కిందకు వచ్చేసింది. 2018లోనూ పారామౌంట్ గ్లోబల్ నుంచి అదనపు వాటాను రిలయన్స్ కొనుగోలు చేసి తన వాటాను పెంచుకుంది. సోనీతో ఒప్పందం ఫెయిల్ అయ్యాక.. జీతో వయాకామ్ 18ను విలీనం చేయాలని పారామౌంట్ భావించింది. అయితే.. ఇది జరగలేదు. స్టార్ ఇండియా.. వయాకామ్ 18 విలీన ఒప్పందం విషయంలో విజయం సాధించింది.

ఇదిలా ఉంటే డిస్నీ.. రిలయన్స్ సంస్థలు భారత్ లోని తమ మీడియా వ్యాపారాల్ని విలీనం చేస్తామని గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో.. రూ.70వేల కోట్లకు పైగా విలువ ఉన్న సంయుక్త సంస్థగా జేవీ అవతరించనుంది. ఇందులో రిలయన్స్ కు 63.16 మెజార్టీ వాటా ఉండనుంది. మొత్తంగా దేశీయంగా బలమైన మీడియా చానళ్లు ఉన్న సంస్థగా రిలయన్స్ మారనుంది. తాజా డీల్ ద్వారా సోనీ.. నెట్ ఫ్లిక్స్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు రిలయన్స్ సిద్ధమవుతోంది.

ప్రస్తుతం రిలయన్స కు చెందిన మీడియా వెంచర్స్ మొత్తం నెట్ వర్కు 18 కింద ఉన్నాయి. ఇది టీవీ 18 బ్రాండ్ పేరిట న్యూస్ చానళ్లు.. ఇతరత్రా స్పోర్ట్స్.. ఎంటర్ టైన్ మెంట్ చానళ్లను నిర్వహిస్తోంది. ఇవి మాత్రమే కాదు మనీకంట్రోల్ డాట్ కామ్.. బుక్ మై షో లాంటి సంస్థల్లోనూ నెట్ వర్క్ 18కు వాటాలు ఉన్నాయి. వీటితో పాటు రిలయన్స్ కు జియో స్టూడియోస్ అనే సినిమా నిర్మాణ సంస్థ ఉంది. రెరండు లిస్టెడ్ కేబుల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల్లోనూ మెజార్టీ వాటా ఉంది. డెన్.. హాథ్ వే సంస్థల్లో రిలయన్స్ కు వాటాలున్నాయి. మొత్తంగా మీడియా రంగంలో రిలయన్స్ మరింత బలోపేతం కానుందని చెప్పాలి.