Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు కౌంటర్ లో రేవంత్ సర్కార్ ఫెయిల్యూర్?

తన చేతిలో అధికారం ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరోలా వ్యవహరించే విషయంలో గులాబీ బాస్ కేసీఆర్ లెక్కే వేరుగా ఉంటుందని చెప్పాలి

By:  Tupaki Desk   |   9 May 2024 6:30 AM GMT
కేసీఆర్ కు కౌంటర్ లో రేవంత్ సర్కార్ ఫెయిల్యూర్?
X

తన చేతిలో అధికారం ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరోలా వ్యవహరించే విషయంలో గులాబీ బాస్ కేసీఆర్ లెక్కే వేరుగా ఉంటుందని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన మొదటి రెండేళ్లు.. ఎవరైనా ఏదైనా విమర్శ చేసే ప్రయత్నం చేసినంతనే.. ఇప్పుడే పుట్టిన తెలంగాణ బిడ్డ గొంతు నులమాలని ప్రయత్నిస్తారా? ఎంత దుర్మార్గం? అంటూ తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని సంధించేవారు. ఆ తర్వాత ప్రభుత్వం కుదురుకొని విపక్షాలను ఏరివేసి.. తనకు వ్యతిరేకంగా గళం విప్పే గొంతుల్ని నొక్కేసే ప్రయత్నం చేసిన వేళలో దాన్ని నిలువరించి ప్రశ్నించే వారిపై తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తావా? నీకెన్ని గుండెలు? ఆంధ్రోళ్ల మోచేతి నీళ్లు తాగుతూ కుట్రలు పన్నుతావా? అంటూ ఫైర్ అయ్యేవారు.

అలా మొదటిసారి అధికారం పూర్తి అయ్యే వరకు నోరెత్తి తమ పాలన మీద కించిత్ మాట అనేందుకు అవకాశం ఇవ్వని నైపుణ్యం కేసీఆర్ లో కనిపించేది. అంతేనా.. తాను తెర తీసిన ఆపరేషన్ ఆకర్ష్ కు సైతం తెలంగాణ అంశాన్ని ముడిసరుకుగా వాడుకోవటం తెలిసిందే. తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములం కావాలన్న ఉద్దేశంతో ఇతర పార్టీల నేతలు గులాబీ కారులోకి ఎక్కుతుంటే.. వారిపై ఫిరాయింపుల మాట మాట్లాడతారా? నీకెంత ధైర్యం? తెలంగాణకు అన్యాయం చేసే ఈ ద్రోహుల భరతం పట్టాలంటూ నిప్పులు చెరిగేవారు. నోరెత్తి మాట్లాడేందుకు సాహసించలేనంతగా భయపెట్టేవారు.

అయితే.. కేసీఆర్ తీరును రెండో దఫా అధికారంలోకి వచ్చిన ఏడాదికే ప్రజలు అర్థం చేసుకోవటం.. రెండో ఏడాది నుంచి ఆయన చెప్పే మాటలకు స్పందించటం మానేశారు. అదే సమయంలో తమకు అవకాశం వచ్చిన ప్రతిసారీ.. ‘‘దొర.. తీరు మార్చుకో. లేదంటే తిప్పలు తప్పవు’’ అన్న హెచ్చరికల్ని ఓటుతో చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ప్రతి ఓటమిలోనూ ఏదో ఒక వాదనను వినిపిస్తూ.. తమకు తామే తెలంగాణ చాంఫియన్లుగా అభివర్ణించుకునేవారు. ఈ తీరుతోనే గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

అధికారం చేజారి.. విపక్షంలో కూర్చున్న తొలి వారంలోనే రేవంత్ సర్కారు పడిపోవటం ఖాయమని.. ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోతుందని.. ఆర్నెల్లలో అధికార బదిలీ ఖాయమన్న ప్రచారాన్ని జోరుగా వినిపించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీకి మించి కాసిన్ని సీట్లు మాత్రమే ఉండటం.. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కావటంతో గులాబీ బాస్ అండ్ కో వినిపించే వాదనకు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో.. ప్రభుత్వం స్థిరంగా ఉంటుందా? లేదా? అన్నది ప్రశ్నగా మారింది.

తమ ప్రభుత్వంపై జరుగుతున్న దాడి మొత్తం వ్యూహాత్మకమేనని.. తమను బలహీనపర్చటానికి.. తెలంగాణకు అండగా నిలిచే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ను దెబ్బ తీసే కుట్రను కాస్త ఆలస్యంగా గుర్తించారు రేవంత్ రెడ్డి. నష్ట నివారణ చర్యలు చేపట్టే క్రమంలో రేవంత్ నోటి నుంచి వచ్చిన కొన్ని మాటలు కొత్త సందేహాలు వ్యక్తమయ్యేలా చేశాయి. మొత్తంగా రేవంత్ ప్రభుత్వ స్థిరత్వం మీద యావత్ తెలంగాణలో చర్చ జరిగేలా చేయటంలో కేసీఆర్ అండ్ కో సక్సెస్ అయ్యిందని చెప్పాలి.

తమ ప్రభుత్వ స్థిరత్వం మీద దాడికి ప్రతిదాడి మొదలు పెట్టిన రేవంత్ తీరుతో వ్యూహాన్ని మార్చేసింది పింక్ క్లబ్. తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కరెంటు సమస్య ఉండేది కాదని.. రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చినంతనే కరెంటు కోతలు మొదలైనట్లుగా ప్రచారం మొదలు పెట్టారు. అయితే.. ఇలాంటి ప్రచారాలకు చెక్ పెట్టేందుకు అవసరమైన నైపుణ్యం.. శక్తిసామర్థ్యాలు రేవంత్ సర్కారు అందిపుచ్చుకోవటంలో జరిగిన ఆలస్యం కొంత నష్టం వాటిల్లేలా చేసింది. దీన్ని కంట్రోల్ చేసినంతనే.. హైదరాబాద్ లో మంచినీళ్ల సమస్య పెరిగిందని.. తాము ప్రభుత్వాన్ని నడిపినప్పుడు నీళ్ల ట్యాంకర్లు అన్నవే లేదన్నట్లుగా ప్రచారం మొదలెట్టారు. అయితే.. వీటిని ఎదుర్కొనేందుకు అవసరమైన యంత్రాంగం రేవంత్ సిద్ధం చేసుకోకపోవటం ఒక సమస్యగా మారింది.

ఒక క్రమపద్దతిలో తమ ప్రభుత్వంపై సాగుతున్న దాడిని గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదురుదాడి షురూ చేశారు. ఇలాంటి వేళలోనే.. లోక్ సభ ఎన్నికలు రావటంతో పాలన మీద కాకుండా ఎన్నికల మీద ఫోకస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది రేవంత్ కు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ గెలుపు గాలివాటంగా వచ్చింది కాదని.. తమ మీద నమ్మకంతోనే ప్రజలు ఓటేశారన్న విషయాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం రేవంత్ మీద పడింది. దీంతో.. ఆయన ఫోకస్ మొత్తం ఎన్నికలు.. వాటికి సంబంధించిన అంశాల మీద పెట్టేశారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవటానికి వీలుగా అడుగులు వేస్తున్న రేవంత్ కు పాలన మీద పట్టు చిక్కని పరిస్థితి.

ఈ అంశాన్ని గుర్తించిన గులాబీ దళం కొత్త ప్రచారానికి తెర తీసింది. బ్రాండ్ హైదరాబాద్ ను ఘోరంగా దెబ్బ తీశారని.. రాష్ట్రానికి రావాల్సిన కంపెనీలు వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతున్నట్లుగా ప్రచారం మొదలు పెట్టారు. అంతేకాదు.. పదేళ్లు తాము అధికారంలో ఉండి కూడా పూర్తి చేయని హామీలను వదిలేసి.. ప్రభుత్వం కొలువు తీరిన ఐదు నెలలు (అందులో దాదాపు నెల కంటే ఎక్కువగా లోక్ సభ ఎన్నికలకే సరిపోయింది) అసలేం జరగలేదన్నట్లుగా ప్రచారం మొదలుపెట్టారు. తాజాగా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ మహానగరం చిగురుటాకులా వణికిపోయిన వైనాన్ని కొత్తగా ప్రస్తావిస్తూ.. ఆ తప్పు రేవంత్ సర్కారు ఖాతాలో వేశారు.

తాము అధికారంలో ఉన్న పదేళ్లలో హైదరాబాద్ మహానగరం మీదా.. దాని సమస్యల మీదా ఫోకస్ చేసి ఉంటే ఈ రోజు ఈ సమస్యలు ఉండేవి కావన్న ప్రశ్న రేవంత్ సర్కారు నోటి నుంచి రావాల్సిన అవసరం ఉంది. ఇదంతా చూసినప్పుడు ఏ తెలంగాణ అస్త్రాన్ని సంధించి ప్రత్యర్థుల నోటి నుంచి మాట రాకుండా కేసీఆర్ పాలన సాగించారో.. ఇప్పుడు అదే వ్యూహాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రేవంత్ మీద ఉంది. తప్పుడు ప్రచారంతో బ్రాండ్ తెలంగాణను దెబ్బ తీయటమే కాదు.. బ్రాండ్ హైదరాబాద్ కు నష్టం వాటిల్లేలా చేస్తున్న కేసీఆర్ అండ్ కో కుట్రను బద్ధలు కొట్టే అస్త్రాన్ని సంధించాల్సిన అవసరం రేవంత్ కు ఉంది. లేకుంటే.. అధికారంలో ఉండి కూడా అస్త్రాన్ని సంధించలేని అపకీర్తిని రేవంత్ మూటగట్టుకునే ప్రమాదముంది.