Begin typing your search above and press return to search.

తొలిసారి సౌదీ అందం..ప్రపంచ పోటీ బరిలోకి దిగనుంది

ఎవరూ ఊహించని విధంగా మద్య నిషేధం విషయంలోనూ కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.

By:  Tupaki Desk   |   27 March 2024 5:57 AM GMT
తొలిసారి సౌదీ అందం..ప్రపంచ పోటీ బరిలోకి దిగనుంది
X

మార్పు అనివార్యం. కాలం దీనికి ప్రత్యక్ష్య సాక్ష్యం. ప్రపంచంలోని పలు దేశాల్లో మాదిరే ఇస్లాం సంప్రదాయానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే సౌదీ అరేబియా తనను తాను మార్చుకునే క్రమాన్ని మరింత వేగవంతంగా చేస్తోంది. మొన్నటి వరకు ఆంక్షల చట్రంలోని అక్కడి మహిళల జీవితాల్లోకి కొత్త మార్పులు శరవేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు కఠిన ఆంక్షల్ని ఎదుర్కొన్న ఆ దేశ మహిళలు ఇప్పుడు కొత్త స్వేచ్ఛను సొంతం చేసుకుంటున్నాయి. మహిళలకు డ్రైవింగ్ కు అనుమతించటం.. పురుషుల పార్టీల్లోకి పొల్గొనేందుకు మహిళలకు అనుమతులు ఇవ్వటం.. పురుషుల సంరక్షణ లేకున్నా పాస్ పోర్టుకు దరఖాస్తు చేసుకోవటం లాంటి నిర్ణయాలు ఒకటి తర్వాత ఒకటి చొప్పున చోటు చేసుకుంటున్నాయి.

ఎవరూ ఊహించని విధంగా మద్య నిషేధం విషయంలోనూ కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. పూర్తిగా మద్య నిషేధం అమలయ్యే సౌదీలో.. దౌత్య కార్యాలయాలు ఉండే ప్రాంతంలో మద్యం అమ్మకాలకు అనుమతులు ఇవ్వటం తెలిసిందే. ఒక క్రమ పద్దతిలో సౌదీలోని ఆంక్షలను తొలగిస్తున్నారు ఆ దేశ యువరాజు 38 ఏళ్ల మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్. ఆయన ఏలుబడిలో సౌదీ సంస్కరణల బాట పడుతోంది.

ఈ క్రమంలో తాజాగా.. చరిత్రలో తొలిసారి సౌదీ అరేబియాకు చెందిన అందాల భామ ఒకరు విశ్వ సౌందర్య వేదిక మీద తన సత్తా చాటేయనుంది. అవును.. సౌదీకి చెందిన ముద్దుగుమ్మ ఒకరు మిస్ యూనివర్స్ పోటీల బరిలో దిగనున్నారు. చరిత్రలో ఇలా జరగటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. త్వరలో మలేషియాలో జరిగే అందాల పోటీలకు సౌదీ నుంచి ఒక సుందరి ప్రాతినిధ్యం వహించనుంది. ఇంతకు ఆమె పేరు ఏమంటారా? అక్కడికే వస్తున్నాం. ఆమె పేరు.. రూబీ అల్భతానీ. మోడల్ గా రాణిస్తున్న ఆమె స్వస్థలం సౌదీలోని రియాద్. ఇప్పటికే పలు అందాల పోటీల్లో పాల్గొన్న ఆమెకు పలు టైటిళ్లను (మిస్ సౌదీ అరేబియా, మిస్ మిడిల్ ఈస్ట్, మిస్ అరబ్ వరల్డ్ పీస్, మిస్ ఉమెన్) సొంతం చేసుకున్నారు.

కొద్ది వారాల క్రితం మలేషియాలో జరిగిన మిస్ అండ్ మిసెస్ గ్లోబల్ ఏషియన్ లో పాలు పంచుకున్నారు. తాజాగా మి్ యూనివర్స్ పోటీల్లో సౌదీ తరపున ఆమె బరిలోకి దిగనున్నారు. ప్రపంచ సంస్క్రతులపై అవగాహన పెంచుకుంటూనే.. తమ సౌదీ సంప్రదాయాలను.. వారసత్వాన్ని విశ్వ వేదికలపై వివరించనున్నట్లుగా ఆమె చెబుతున్నారు. ఆమెకు ఇన్ స్టాలో లక్షలాది మంది ఫాలోయర్లు ఉన్నారు. ఏది ఏమైనా.. పార్టీలో పాల్గొనటం ద్వారా ఆమె చరిత్రను స్రష్టిస్తున్నారని మాత్రం చెప్పక తప్పదు.