Begin typing your search above and press return to search.

అంజలిని జర్నలిస్ట్ అని పరిచయం చేసిన సచిన్... ఎవరికి, ఎప్పుడు, ఎందుకు?

ప్రస్తుతం 51 వ వసంతంలో అడుగుపెడుతున్న సచిన్‌ టెండుల్కర్‌ తాను ఎంచుకున్న రంగంలో సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు

By:  Tupaki Desk   |   24 April 2024 2:30 PM GMT
అంజలిని జర్నలిస్ట్ అని పరిచయం చేసిన సచిన్... ఎవరికి, ఎప్పుడు, ఎందుకు?
X

సచిన్ రమేష్ టెండుల్కర్.. ప్రపంచానికి పెద్దగా పరిచయం అవసరం లేని పేర్లలో ఒకటని చెప్పొచ్చు! ఇండియాలో క్రికెట్ ఒక మతం అయితే.. అందులో ఆ మతానికి సంబంధించిన దేవుళ్లలో సచిన్ ఒకరని చెబుతుంటారు ఫ్యాన్స్. ఆ స్థాయిలో క్రికెట్ లో సచిన్ ఎదిగాడు. ప్రస్తుతం 51 వ వసంతంలో అడుగుపెడుతున్న సచిన్‌ టెండుల్కర్‌ తాను ఎంచుకున్న రంగంలో సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ప్రపంచ క్రికెట్ చరిత్రలో బ్యాటింగ్ విభాగానికి సంబంధించి ఏ రికార్డ్ తీసినా.. ఆ రికార్డులో టాప్ 10 పేర్లలో సచిన్ పేరు తప్పకుండా ఉంటుందని చెప్పినా అతిశయోక్తి కాదు. ఆ స్థాయిలో తాను ఎంచుకున్న క్రికెట్ రంగంలో సచిన్ ఉన్నత శిఖరాలను అదిరోహించాడు. ఈ సమయంలో ఆయనలో సగం గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..! అసలు అంజలి... సచిన్ కి ఎప్పుడు, ఎక్కడ, ఎలా పరిచయం అయ్యింది.. అనంతరం వారి స్నేహం ఎలా మొదలైంది, ప్రేమగా ఎలా పరిణమించింది అనేది చూద్దాం!

సచిన్ - అంజలి... తనకంటే పెద్ద వయసున్న అమ్మాయిని ప్రేమించే అబ్బాయిలు దాదాపుగా చెప్పే ఉదాహరణల్లో ఇదొకటి.. ఇదే క్రమంలో... తనకంటే చిన్న అబ్బాయిని ప్రేమించే అమ్మాయిలు కూడా ఆదర్శంగా చెప్పే జంట సచిన్ - అంజలి అనే చెప్పుకోవచ్చు. అవును... సచిన్ కంటే అంజలి వయసు సుమారు ఐదేళ్లు పెద్ద! ప్రేమకు వయసుతో సంబంధం లేదు అనేది తెలిసిన విషయమే అయినా.. అదృష్టం కొద్దీ వీరి పెళ్లికి కూడా అది సమస్యగా మారలేదు!

17 ఏళ్ల వయసులో 1989లో అంతర్జాతీయ క్రికెట్‌ లో అడుగుపెట్టిన సచిన్... పాకిస్తాన్‌ పర్యటనలో టెస్టు సిరీస్‌ లో భాగంగా నాలుగు మ్యాచ్‌ లను ముగించుకుని జట్టుతో పాటు భారత్‌ కు బయలుదేరాడు. ఈ సమయంలో స్వదేశానికి చేరుకుని.. ముంబైకి వెళ్లే క్రమంలో ఎయిర్‌ పోర్టులో తొలిసారి ఓ అమ్మాయి తన దృష్టిని ఆకర్షించింది.. ఆమె పేరు అంజలి! ఈ సమయంలో తన తల్లిని తీసుకువెళ్లేందుకు అక్కడికి వచ్చిన అంజలి కూడా సచిన్‌ చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిందంట!

ఈ క్రమంలో కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా సచిన్‌ - అంజలి మరోసారి కలుసుకోవడం.. అనంతరం క్లోజ్ ఫ్రెండ్స్ గా మారడం జరిగిపోయింది. ఈ క్రమంలో స్నేహం ప్రేమగా మారినా... అప్పుడప్పుడే క్రికెటర్‌ గా ఎదుగుతున్నాడు సచిన్‌ ఆటను.. మరోవైపు మెడిసిన్‌ చదువుతోన్న అంజలి చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఈ సమయంలో సచిన్ అంజలిని తన తల్లితండ్రులకు పరిచయం చేయాలనుకున్నాడు.

ఈ సమయంలో ఆమెను ఇంటికి తీసుకెళ్లిన సచిన్... తన తల్లిదండ్రులతో... జర్నలిస్టు అని పరిచయం చేశాడు. భయంతో ఏం చెప్పాలో తెలియకే సచిన్ కంగారులో ఇలా పరిచయం చేశాడంట. మెడిసిన్ చదువుతున్న అమ్మాయితో స్నేహం అంటే ఏమ్నుకుంటారని అనుకున్నాడో ఏమో... జర్నలిస్ట్ అని చెబితే ప్రొఫెషన్ లో భాగం అని అనుకుంటారని భావించి ఉండొచ్చు!

ఆ తర్వాత కాల క్రమంలో మెల్లగా సచిన్‌ కుటుంబంతో అంజలికి అనుబంధం పెరిగింది. ఈ సమయంలో తమ ప్రేమ విషయం గురించి తల్లిదండ్రులకు చెప్పేందుకు సచిన్‌ మొహమాట పడటంతో... అంజలినే స్వయంగా వారితో మాట్లాడి ఒప్పించింది! దీంతో... 1994లో న్యూజిలాండ్‌ టూర్‌ లో ఉన్న సమయంలో సచిన్‌ - అంజలిల నిశ్చితార్థం జరిగింది. ఆ మరుసటి ఏడాది మే 24న వీరి వివాహం కూడా జరిగిపోయింది.

ఈ సమయంలో అటు డాక్టర్‌ గా, ఇటు ఇల్లాలిగా రెండు పడవల మీద ప్రయాణం చేయలేక అంజలి ఇంటి బాధ్యతల వైపే మొగ్గుచూపుతూ.. తన కెరీర్‌ ను త్యాగం చేసింది. ఈ క్రమలో... 1997లో వారికి తొలి సంతానంగా కుమార్తె సారా జన్మించగా, 1999లో కుమారుడు అర్జున్‌ జన్మించాడు. ప్రస్తుతం సారా మోడల్‌ గా, అర్జున్‌ క్రికెటర్‌ గా రాణించేందుకు కృషి చేస్తున్నారు.