Begin typing your search above and press return to search.

4 రోజులు, 5 రాష్ట్రాలు, 1800 కి.మీ... పారిపోయినా చిక్కిన బాలీవుడ్‌ నటుడు!

అవును... మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కుంభకోణం కేసులో బాలీవుడ్‌ నటుడు సాహిల్‌ ఖాన్‌ తాజాగా అరెస్టయ్యారు.

By:  Tupaki Desk   |   29 April 2024 8:43 AM GMT
4 రోజులు, 5 రాష్ట్రాలు, 1800 కి.మీ... పారిపోయినా చిక్కిన బాలీవుడ్‌  నటుడు!
X

పోలీసులను మనసు పెట్టనివ్వాలే కానీ.. ఏ నిందితుడిని అయినా, ఎంత దూరంలో ఉన్నా, ఏ కలుగులో దాక్కున్నా అరెస్ట్ చేయగలరని.. కాకపోతే వారి కాళ్లకు రాజకీయ ఒత్తిళ్లు అనే బందాలు వేయకూడదని చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఒక బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసులో బాలీవుడ్ నటుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ మేరకు 4 రోజుల్లో సుమారు 1,800 కిలో మీటర్లు పారిపోయిన ఆ నటుణ్ని పోలీసులకు అదుపులోకి తీసుకున్నారు.

అవును... మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కుంభకోణం కేసులో బాలీవుడ్‌ నటుడు సాహిల్‌ ఖాన్‌ తాజాగా అరెస్టయ్యారు. అతడు అరెస్ట్ తప్పించుకోవడానికి సినిమా లెవెల్‌ లో అడ్వెంచర్ చేసినా.. ప్రయోజనం లేకపోయింది. పోలీసులు వేసిన స్కెచ్ ముందు ఆ యాక్టర్ అడ్వెంచర్స్ నిలవలేకపోయాయి. సినిమాల్లో విలన్.. పోలీసులకు చిక్కినట్లు అతడు చిక్కాడు.

వివరాళ్లోకి వెళ్తే... మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న నటుడు సాహిల్ ఖాన్.. అరెస్టు నుంచి రక్షణ కోరుతూ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే... ఈ పిటిషన్‌ ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. దీంతో.. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఏప్రిల్ 25 నుంచి రాష్ట్రాలు దాటడం మొదలుపెట్టారు.

ఇందులో భాగంగా... మొదట మహారాష్ట్ర నుంచి గోవా.. అక్కడి నుంచి కర్ణాటకకు.. అక్కడ నుంచి మళ్లీ తెలంగాణకు.. ఇలా టూర్లు వేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో... తనను గుర్తుపట్టకుండా ఉండేందుకు రకరకాల వేషాలు మార్చారట. ఇందులో భాగంగా.. ముఖాన్ని స్కార్ఫ్‌ తో దాచుకోవడం వంటివి చేశారని చెబుతున్నారు. అనంతరం... ఇక్కడి నుంచి ఛత్తీస్‌ గఢ్‌ పారిపోవాలని ప్లాన్‌ చేశారట.

ఈ నేపథ్యంలో... రాత్రి సమయంలో ఆ రాష్ట్రంవైపు ప్రయాణించడానికి సాహిల్ డ్రైవర్ అంగీకరించకపోవడంతో... తానే రోడ్డు మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. అయితే... అప్పటికే జాడ పసిగట్టిన పోలీసులు.. ఛత్తీస్‌ గఢ్‌ చేరుకున్న అదుపులోకి తీసుకున్నారు! ఇలా నాలుగు రోజుల పాటు ఐదు రాష్ట్రాల మీదుగా సుమారు 1,800 కి.మీ. ప్రయాణించినా... అతడు అరెస్టు నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు.

కాగా... పలు బాలీవుడ్‌ సినిమాల్లో నటించిన సాహిల్‌.. "స్టైల్‌", "ఎక్స్‌ క్యూజ్‌ మీ" సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఫిట్‌ నెస్‌ ట్రైనర్‌ గా పనిచేస్తూ... సొంతంగా ఓ కంపెనీని స్థాపించి, దానిద్వారా ఫిట్‌ నెస్‌ సప్లిమెంట్స్‌ ను విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్‌ కేసులో సాహిల్‌ కు సిట్‌ 2023 డిసెంబరులోనే సమన్లు జారీ చేసింది.