Begin typing your search above and press return to search.

జగన్‌ పై రాళ్ల దాడి కేసు.. ఏ1 విషయంలో కోర్టు కీలక నిర్ణయం!

ఈ మేరకు సతీష్ ని వారం రోజులు కస్టడీలోకి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు కేవలం మూడు రోజులపాటు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

By:  Tupaki Desk   |   24 April 2024 10:48 AM GMT
జగన్‌  పై రాళ్ల దాడి కేసు.. ఏ1 విషయంలో కోర్టు కీలక నిర్ణయం!
X

ఎన్నికల వేళ రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్ పై రాళ్లదాడి అంశం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. "మేమంతా సిద్ధం" లో భాగంగా చేపట్టిన బస్సు యాత్ర విజయవాడలోని సింగ్‌ నగర్‌ కు చేరుకోగానే వైసీపీ అధ్యక్షుడు, ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాళ్లదాడి జరిగింది. దీంతో ఈ విషయం రాజకీయంగానూ తీవ్ర కలకలం రేపింది. ఈ సమయంలో... ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉండగా.. తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.

అవును... సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు సతీష్ ని ప్రధాన నిందితుడిగా తేల్చిన నేపథ్యంలో... ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న సతీష్ ని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుంటున్నారు! ఈ మేరకు సతీష్ ని వారం రోజులు కస్టడీలోకి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు కేవలం మూడు రోజులపాటు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

కుట్రకోణంపై నిందితుణ్ని మరింత లోతుగా విచారించాల్సి ఉందని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కమ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో పోలీసులు పిటిషన్‌ దాఖలు చేయగా... సతీష్‌ ను 3 రోజుల కస్టడీకి అనుమతిస్తూ న్యాయాధికారి రమణారెడ్డి ఆదేశాలిచ్చారు. ఈ సమయంలో... సతీష్ తరుపు న్యాయవాది, అతడి తల్లిదండ్రుల సమక్షంలోనే విచారించాలని కోర్టు తెలిపింది.

ఇదే క్రమంలో... ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరపవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదే సమయంలో... నిందితుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దని ఆదేశించినట్లు తెలుస్తుంది. విచారన తర్వాత తెలుసుకొన్న అంశాలను కోర్టు ముందు ఉంచాలని సూచించింది! దీంతో గురువారం నుంచి శనివారం వరకు నిందితుడిని పోలీసులు విచారించనున్నారు.