Begin typing your search above and press return to search.

ఏపీ రాజకీయాల్లో కలకలం... టీడీపీ ఎన్నారై వీడియో వైరల్!

ఈ వ్యవహారంపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసేందుకు వైసీపీ నేతలు సిద్ధమవుతున్నారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   22 April 2024 7:34 AM GMT
ఏపీ రాజకీయాల్లో కలకలం... టీడీపీ ఎన్నారై వీడియో వైరల్!
X

ఇటీవల టీడీపీకి సంబంధించిన ఒక వీడియో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ వైసీపీ 147 స్థానాల్లో బలంగా ఉందంటూ ఆ వీడియోలో వినిపించింది! ఈ క్రమంలో టీడీపీకి సంబంధించిన వీడియో మరొకటి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసేందుకు వైసీపీ నేతలు సిద్ధమవుతున్నారని అంటున్నారు.

అవును... తాజాగా టీడీపీ ఆఫీసులో ఆ పార్టీ ఎన్నారై విభాగం కో-ఆర్డినేటర్‌ కోమటి జయరాం పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చి హల్ చల్ చేస్తుంది. ఇందులో... ఓటర్లకు డబ్బులు ఎలా పంచాలో ఆయన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చూద్దాం...!

"ఇప్పుడు మనం అంతా ఫోకస్డ్ గా వెళ్తేనే పని జరుగుతాది. 5 నుంచి 10 కుటుంబాలను ఫోకస్ చేయాలి. మనం మన ఊరెళ్తే ఈ వెదవ మనకు ఓటు వేయడనేది మనకు తెలుసు. వాడిని మార్చడంలో మన నైపుణ్యం ఉపయోగించాలి. వాడిని ఏరకంగానైనా మనకున్న ఎబిలిటీతో... వాడికున్న అవసరం ఏమిటో తెలుసుకుని మనం ట్యూన్ చేసుకోగలిగితే.. నాలుగైదు ఓట్లు మారతాయి" అని అన్నారు.

"ప్రతీ నియోజకవర్గంలో వెయ్యి ఓట్లు మార్చగలిగినా కూడా.. మనం అంతదూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు న్యాయం చేసినవారం అవుతాము.. దీనిపై పనిచేయడానికి ఇదే సమయం! ఒక వేళ డబ్బుతోనే మార్చగలిగినా కూడా రెండు మూడు లక్షలతో ఆ పది కుటుంబాలను మార్చగల కెపాసిటీ మనకుంది.. ఈ రూంలో ఉన్నవారికి రెండు మూడు లక్షలు ఖర్చుపెట్టడం పెద్ద విషయం కాదు" అని స్పష్టం చేశారు.

దీంతో ప్రస్తుతం ఈ వీడియో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఓటర్లను పట్టుకుని వెదవ, వాడూ వీడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు... ప్రజలపై వారికున్న ఉద్దేశ్యాన్ని బయటపెట్టిందని అంటున్నారు!