Begin typing your search above and press return to search.

అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య.. అసలేం జరిగిందంటే!

ఆంధ్రప్రదేశ్‌ లోని గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంకు చెందిన పరుచూరి అభిజిత్‌ దారుణ హత్యకు గురయ్యాడు.

By:  Tupaki Desk   |   16 March 2024 8:59 AM GMT
అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య.. అసలేం జరిగిందంటే!
X

అమెరికాలో వరుసగా చోటు చేసుకుంటున్న భారతీయుల మరణాలు కలకలం రేపుతున్నాయి. ప్రమాదాల్లో మరణిస్తున్నవారితోపాటు ఇటీవల కాలంలో హత్యలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత నెలలో భారతీయ కుటుంబం హత్యకు గురయింది. ఇటీవల ఒక భారతీయ సంగీతకారుడిని కాల్చిచంపారు. అలాగే ఒక విద్యార్థిని ఆశ్రయం ఇవ్వనందుకు ఒక దేశదిమ్మరి దారుణంగా కొట్టి హత్య చేశాడు. కొద్ది రోజుల క్రితం ప్రముఖ భరతనాట్య, కూచిపూడి కళాకారుడు అమర్‌ నాథ్‌ ఘోష్‌ ను గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. మూడు రోజుల క్రితం పిట్టల వెంకట రమణ అనే విద్యార్థి ఒక ప్రమాదంలో కన్నుమూయడం అందరిలో విషాదాన్ని నింపింది.

ఇలా అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయుల వరుస మరణాలను మరిచిపోకముందే మరో విషాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ లోని గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంకు చెందిన పరుచూరి అభిజిత్‌ దారుణ హత్యకు గురయ్యాడు.

బుర్రిపాలెంకు చెందిన అభిజిత్‌ చిన్నతనం నుంచి అమెరికాలో చదువుకోవాలని కలలు కనేవాడు. ఉన్నత చదువులు అభ్యసించి మంచి ఉద్యోగాన్ని సాధించాలనుకునేవాడు. ఈ క్రమంలో అమెరికాలో ఉన్నత చదువుల నిమిత్తం పరుచూరి అభిజిత్‌ వెళ్లాడు. అక్కడి బోస్టన్‌ వర్సిటీలో ఇంజినీరింగ్‌ లో చేరాడు.

ఈ క్రమంలో మార్చి 11న యూనివర్సిటీ క్యాంపస్‌ లో దారుణంగా హత్యకు గురయ్యాడు. కొందరు ఉన్మాదులు కళాశాలలోనే అభిజిత్‌ ను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆతర్వాత అతడి మృతదేహాన్ని కారులో పెట్టేసి అడవిలో వదిలిపెట్టి పోయారు. కొందరు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అతడు ఉన్నట్టుండి మిస్‌ కావడంతో అభిజిత్‌ స్నేహితులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడి సెల్‌ ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా అతడి మృతదేహాన్ని కనిపెట్టారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే నిందితులను ఇంకా గుర్తించలేదని సమాచారం.

కాగా అభిజిత్‌ మృతదేహాన్ని అతడి స్వగ్రామం బుర్రిపాలెం తీసుకొచ్చారు. ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్లిన తమ కుమారుడు శవంగా మారి తిరిగి రావడంతో అభిజిత్‌ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.