Begin typing your search above and press return to search.

పిఠాపురం రాజకీయం : వంగా గీత మెజారిటీ ఎంతంటే...!?

పైగా గత ఎన్నికల్లో తనకు వచ్చిన ఓట్ల కంటే ఎక్కువే ఈసారి వస్తాయని ఆశాభావంతో ఉండడం అంటున్నారు.

By:  Tupaki Desk   |   24 April 2024 5:30 PM GMT
పిఠాపురం రాజకీయం : వంగా గీత మెజారిటీ ఎంతంటే...!?
X

పిఠాపురంలో వైసీపీ తరఫున పోటీ చేస్తున్న వంగా గీత గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు. దానికి కారణం వైసీపీ అంతా ఐక్యంగా ఒక్కటిగా పనిచేయడం. పైగా గత ఎన్నికల్లో తనకు వచ్చిన ఓట్ల కంటే ఎక్కువే ఈసారి వస్తాయని ఆశాభావంతో ఉండడం అంటున్నారు. పిఠాపురంలో వంగా గీత నామినేషన్ దాఖలు చేశారు. జనసేన తరఫున పవన్ కళ్యాణ్ కూడా నామినేషన్ వేశారు.

ఇపుడు ఇద్దరు విద్యార్హతల మీద ఇద్దరి రాజకీయ అనుభవం మీద పోలికలు పెడుతూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. వంగ గీత డబుల్ పీజీ హోల్డర్. ఆమె ఉన్నత విద్యావంతురాలు. అంతే కాదు ఆమె దేశంలోనే ఉన్నతమైన రెండు చట్ట సభలు రాజ్యసభ లోక్ సభలలో మెంబర్ గా పనిచేశారు. అలాగే ఎమ్మెల్యేగా కూడా ఒకసారి ఉన్నారు జెడ్పీ చైర్ పర్సన్ గా చేశారు ఇతర పదవులు అనేకం నిర్వహించారు ఆమెది సుదీర్ఘమైన రాజకీయ జీవితం అని ఆమె తరఫున పోస్టులు పెట్టిన వారు చెబుతున్నారు.

అదే పవన్ కళ్యాణ్ పదవ తరగతి మాత్రమే చదివినట్లుగా ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాలలో ఉందని ఎత్తి చూపుతున్నారు. పవన్ గతసారి రెండు చోట్లా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారని ఆయనకు రాజకీయ పాలనా అనుభవం లేదని విమర్శిస్తున్నారు. ఇక గీత అందుబాటులో ఉండే మనిషి అని ఆమెకు ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉందని వాటిని పరిష్కరించే నైపుణ్యం ఓపిక కూడా ఉన్నాయని చెబుతున్నారు.

గతంలో ఆమె ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేయడం వల్ల పిఠాపురంలో అణువణువూ ఆమెకు తెలుసు. ప్రజలకు కూడా ఆమె ఏమిటో తెలుసు ఇవన్నీ ప్లస్ పాయింట్లు అని చెబుతున్నారు ఇంకో వైపు చూస్తే జనాలు అందుబాటులో ఉన్న వారిని తమ ఎమ్మెల్యేగా చేసుకుంటారు తప్ప సెలిబ్రిటీలను చేసుకోరని వైసీపీ నేతలు అంటున్నారు.

వంగా గీత ఇప్పటికి అనేకసార్లు పర్యటించి జనం తో మమేకం అయ్యారు. ఆమెకు జనాలను పేరు పెట్టి పిలిచే ఊళ్ళూ ఎన్నో ఉన్నాయని కూడా అంటున్నారు. ఒక విధంగా ఆమె రియల్ హీరో అని ఆమె విజయం తధ్యమని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే పిఠాపురంలో ఎవరు గెలుస్తారు అన్న దాని గురించి రచ్చ బండ నుంచి టీ కొట్ల దాకా కిల్లీ బడ్డీల దాకా కూడా చర్చ వేడిగా వాడిగా సాగుతోంది.

ఇద్దరు నేతల ప్లస్సులు మైనస్సులు కూడా అక్కడకు చర్చకు వస్తున్నాయి. ఇక చూస్తే జనసేనకు అభిమానంగా ఉన్న వారిలో యూత్ ఎక్కువగా కనిపిస్తున్నారు. పిఠాపురంలో మొత్తం తొంబై వేల దాకా కాపులు ఉంటే యూత్ ఓట్లు అన్నీ దాదాపుగా పవన్ కే పడతాయని అంటున్నారు.ఇక పెద్ద వాళ్ల ఓట్లు మాత్రం కచ్చితంగా వంగా గీతకే అంటున్నారు. ఇలా కాపుల ఓట్లలో వయోభేదంతో పెద్ద చీలిక వస్తోంది.

మిగిలిన కులాలలో ఎస్సీలు, బీసీలు మైనారిటీలలో మాత్రం అత్యధిక శాతం ఓట్లు వైసీపీకి పడతాయని కూడా వైసీపీ లెక్క వేసుకుంటోంది. అదే సమయంలో గత అయిదేళ్లలో ఆయా సామాజిక వర్గాలకు తమ పార్టీ చేసిన మేలు వల్ల కూడా వారు ఓటు వేస్తారు అని నమ్ముతోంది.

ఇవన్నీ పక్కన పెడితే ఈసారి మొత్తం రెండు లక్షల 32 వేల ఓట్లలో లక్షా ఎనభై వేల దాకా పోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. దాంతో కచ్చితంగా లక్ష పైన ఓట్లు గీతకు వస్తాయని వైసీపీ బల్ల గుద్ది చెబుతోంది. యువత కాకుండా మిగిలిన సెక్షన్లను అడిగినపుడు వారు ఓటుని వైసీపీకే వేస్తారు అని అంటున్నారు.

ఎటు నుంచి ఏమి జరిగినా వంగా గీత పాతిక వేల ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయమని కూడా అంటున్నారు. గతసారి పెండెం దొరబాబుకు 14 వేల పై దాటి మెజారిటీ వచ్చింది. ఈసారి మాత్రం మరో 11 వేలు గీతకే అదనంగా వస్తాయని అంటున్నారు ఇక జనసేనకు గతసారి 28 వేల ఓట్లు వచ్చాయని అలాగే టీడీపీ వర్మకు 68 వేల ఓట్లు వచ్చాయని ఈ రెండు నంబర్లు కలిపితే లక్షకు పై దాటుతుందని కానీ రాజకీయ గణితంలో అలా జరగదని అంటున్నారు.

వర్మ పోటీలో లేకపోవడంతో అసంతృప్తి ఉందని ఆయా వర్గాల ఓట్లు వైసీపీ టర్న్ అయినా అవుతాయని లెక్కలు వేస్తున్నారు. మొత్తం మీద చూస్తే మాత్రం సేఫ్ జోన్ లోనే ఉన్నామని వైసీపీ అంటోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.