Begin typing your search above and press return to search.

ఏపీ ఎన్నికల్లో గెలుపుపై కేసీఆర్ జోస్యంపై తెలుగు తమ్ముళ్లు ఫుల్ హ్యాపీ!

ఇటీవల కాలంలో కేసీఆర్ ఎన్నికల జోస్యాలన్నీ అడ్డంగా తప్పుతున్నాయని.. ఆయన గెలుస్తారంటే ఓడిపోవటం అర్థమని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   24 April 2024 4:29 AM GMT
ఏపీ ఎన్నికల్లో గెలుపుపై కేసీఆర్ జోస్యంపై తెలుగు తమ్ముళ్లు ఫుల్ హ్యాపీ!
X

ఏపీ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో గెలుపు ఎవరిది? అన్నదిప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎవరు అవునన్నా.. కాదన్నా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారికి ఏదో రకంగా రెండు రాష్ట్రాలతోనూ సంబంధాలు.. లింకులు.. భావోద్వేగాలు ఉండటం తెలిసిందే. తాజాగా ఒక టీవీ చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ కోసం వెళ్లిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక ప్రశ్నకు బదులిస్తూ.. ఇప్పుడున్న జరుగుతున్న ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ఎన్నికల్లో విజయం సాధిస్తారని.. ఆయన మళ్లీ సీఎం అవుతారన్న సమాచారం తన వద్ద ఉందని కేసీఆర్ చెప్పటం తెలిసిందే.

ఏపీలో ఎవరు గెలిచినా తమకు సంబంధం లేదని.. తమకెలాంటి లాభనష్టాలు ఉండవని తేల్చేసిన ఆయన.. ఎవరొచ్చినా తమకు ఒకటే అంటూనే.. గెలిచేది జగనే అంటూ చెప్పిన వైనంపై తెలుగు తమ్ముళ్లు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి. ఇటీవల కాలంలో కేసీఆర్ ఎన్నికల జోస్యాలన్నీ అడ్డంగా తప్పుతున్నాయని.. ఆయన గెలుస్తారంటే ఓడిపోవటం అర్థమని చెబుతున్నారు.

ఈ జోస్యాలు తప్పు కావటం జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి మొదలైందని చెబుతున్నారు. ఆ ఎన్నికల్లో వందకు పైగా సీట్లు తమకు ఖాయమని కేసీఆర్ ధీమాగా వ్యక్తం చేశారు. ఫలితం ఏమైందో తెలిసిందే. ఎక్కడిదాకానో ఎందుకు.. నాలుగు నెలల క్రితం తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తాము మూడోసారి అధికారంలోకి రానున్నట్లు చెప్పిన కేసీఆర్.. హ్యాట్రిక్ సీఎంగా తాను పవర్లోకి వస్తానన్న ధీమాను వ్యక్తం చేయటం తెలిసిందే. అయితే.. అసలేం జరిగిందో అందరికి తెలిసిందే.

గెలుపు తర్వాత.. దారుణమైన పరాభవం ఎదురైంది. ఊహించలేని రీతిలో ఓటమి ఎదురుకావటంతో కేసీఆర్ అంచనాలు ఇటీవల కాలంలో ఎదురుదెబ్బలు తగులుతున్న పరిస్థితి. ఇలాంటివేళలో.. తాజాగా చెప్పిన జోస్యం ప్రకారం చూస్తే.. కేసీఆర్ నోటి నుంచి జగన్ మళ్లీ సీఎం అవుతారన్న మాట చెబితే.. అది కచ్ఛితంగా జరగదన్నఅభిప్రాయాన్ని తెలుగు తమ్ముళ్లు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఏం చెబుతారో.. దానికి రివర్సులో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని.. ఈ లెక్కన ఇప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఖాయంగా జగన్ ది కాదన్న మాట వస్తోంది. మరి.. కేసీఆర్ అంచనా సరైందా? లేదా? అన్నది మరికాస్త వెయిట్ చేస్తే అర్థమైపోతుంది.