Begin typing your search above and press return to search.

టీడీపీ పండుగ మహానాడు ఈసారీ ప్రతిపక్షంలోనే.. పక్కా!

తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే కాదు.. ప్రపంచ రాజకీయాల్లోనూ తెలుగు దేశం పార్టీ (టీడీపీ)ది చెరగని ముద్ర. కేవలం స్థాపించిన తొమ్మది నెలల్లోనే అధికారం చేపట్టడం అనే రికార్డు ఇంతవరకు చెక్కుచెదరలేదు.

By:  Tupaki Desk   |   27 April 2024 4:30 PM GMT
టీడీపీ పండుగ మహానాడు ఈసారీ ప్రతిపక్షంలోనే.. పక్కా!
X

తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే కాదు.. ప్రపంచ రాజకీయాల్లోనూ తెలుగు దేశం పార్టీ (టీడీపీ)ది చెరగని ముద్ర. కేవలం స్థాపించిన తొమ్మది నెలల్లోనే అధికారం చేపట్టడం అనే రికార్డు ఇంతవరకు చెక్కుచెదరలేదు. 1982 మార్చి 28న ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని మాత్రం మే 28న జరుపుకొంటుంది. దీనికి కారణం.. వ్యవస్థాపకుడు, దివంగత మహా నటుడు నందమూరి తారక రామారావు జయంతి మే 28 కాబట్టి. కాగా, ఈ తేదీకి ఒక్క రోజు ముందే మే 27న మహానాడు మొదలవుతుంది.

పార్టీ కేడర్ కు మహా పండుగ

టీడీపీ మహానాడు ఆ పార్టీ కార్యకర్తలకు మహా పండుగనే. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ సమావేశాల్లో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, ఏజెండాను, వివిధ సమస్యలపై తీర్మానాలను ప్రకటిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీడీపీ అభిమానులు, కార్యకర్తలు దీనికి హాజరవుతారు. మహానాడులోనే టీడీపీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారంటే ఈ కార్యక్రమం ఎంతటి ఘనమైనదో తెలుసుకోవచ్చు.

ఈ సంవత్సరాల్లో నిర్వహణకు దూరం..

1985, 1991, 1996.. ఈ మూడు సంవత్సరాల్లో మహానాడును నిర్వహించలేదు. 1985, 1996లో టీడీపీనే అధికారంలో ఉంది. 1985లొ ఎన్టీఆర్ కూడా జీవించి ఉన్నారు. ఇక 2012లో కూడా మహానాడును వాయిదా వేసింది. ఉమ్మడి ఏపీలో ఉప ఎన్నికలు ఉండడమే దీనికి కారణం. 2014లో టీడీపీ విభజిత ఏపీలో అధికారంలోకి వచ్చిన సమయంలో హైదరాబాద్ లో మహానాడును అత్యంత వేడుకగా నిర్వహించారు.

ఈసారి వాయిదానా? వేడుకనా?

2019లో మే23న ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అందులో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. ప్రతిపక్షంలో ఉన్న ఈ నాలుగేళ్లలో మహానాడు నిర్వహించారు. అయితే, ఈసారి ఎన్నికలకు సంబంధించి మే 13న పోలింగ్ ముగిసినా.. జూన్ 4 వరకు తెలుగు రాష్ట్రాల్లో కోడ్ అమల్లో ఉండనుంది. దీంతో ఏటా ఏదో ఒక ప్రదేశంలో నిర్వహించే మహానాడును ఈ సారి ఏం చేస్తారో చూడాలి.

ప్రతిపక్షంలోనా?

ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ పోలింగ్ ముగిసినందున అన్న ఎన్టీఆర్ జయంతి కాబట్టి మహానాడును మే27-29 మధ్య తలపెడితే టీడీపీ ప్రతిపక్షంలో ఉండగానే జరిపినట్లు అవుతుంది. గతంలో మహానాడును వాయిదా వేసిన సందర్భాలు లేవు కాబట్టి ఇదే ఈసారి కూడా జరుగుతుందని భావించాల్సి ఉంటుంది. కాగా, వచ్చే ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలైతే మరో ఐదేళ్లు ప్రతిపక్షంలోనే ఉంటుంది. గెలిస్తే అధికారంలోకి వస్తుంది. అయితే, మహానాడు మాత్రం ప్రతిపక్షంలోనే?